విందుకు పిలిచారు ... హత్య చేశారు

ABN , First Publish Date - 2021-10-19T05:51:00+05:30 IST

దసరా పండుగ రోజు అర్ధరాత్రి జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీట్‌ బజార్‌ ప్రాంతంలో జరిగిన హత్య కేసును జగిత్యాల పట్టణ పోలీసులు మూడు రోజుల్లోనే ఛేదించారు.

విందుకు పిలిచారు ... హత్య చేశారు
నిందుతులను అరెస్టు చూపిస్తున్న డీఎస్పీ

జగిత్యాల బీట్‌ బజార్‌ హత్య కేసును ఛేదించిన పోలీసులు

వివరాలు వెల్లడించిన జగిత్యాల డీఎస్పీ

జగిత్యాల టౌన్‌, అక్టోబరు 18 : దసరా పండుగ రోజు అర్ధరాత్రి జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీట్‌ బజార్‌ ప్రాంతంలో జరిగిన హత్య కేసును జగిత్యాల పట్టణ పోలీసులు మూడు రోజుల్లోనే ఛేదించారు. పథకం ప్రకారమే పండుగ పూట విందుకు పిలిచి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. హత్యకు పాల్పడ్డ ఇద్దరు యువకులను సోమవారం పట్టుకుని వారి వద్ద హత్యకు ఉపయోగించిన కత్తిని సీజ్‌ చేశారు. అనంతరం హత్యకు పాల్పడ్డ ఇద్దరు యువకులపై రౌడీ షీట్‌ తెరిచి రిమాండ్‌కు తరలించారు. జగిత్యాల టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో డీఎస్పీ ప్రకాష్‌ హత్య కేసుపై విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. జగిత్యాల పట్టణంలోని హనుమాన్‌ వాడకు చెందిన తోట శేఖర్‌-(38), బీట్‌ బజార్‌కు చెందిన సమిండ్ల మహేష్‌లు మంచి స్నేహితులు. ఐదేళ్ల క్రితం ఇద్దరు స్నేహితుల మధ్య గొడవలు జరిగి కత్తులతో దాడి చేసుకునే పరిస్థితికి కక్షలు పెరిగాయి. అప్పటి నుంచి ఒకరినొకరు చంపతానని బెదిరింపులు, గొడవలకు పాల్పడ్డారు. ఈ క్రమంలో దసరా పండుగ రోజు పథకం ప్రకారం తోట శేఖర్‌ను హత్య చేసేందుకు మహేష్‌ స్కెచ్‌ వేశాడు. తన స్నేహితుడైన వీరబత్తిని సాయికిరణ్‌ సహాయంతో దసరా పండుగ రోజు అర్థరాత్రి శేఖర్‌కు పూటుగా మద్యం తాగించారు. అనంతరం మహేష్‌ కత్తితో శేఖర్‌పై దాడి చేశాడు. రక్తపుమడుగులో శేఖర్‌ మృతి చెందాడు. స్థానికులు సమాచారంతో సంఘటనా స్థలాన్ని జగిత్యాల డీఎస్పీ ప్రకాష్‌, టౌన్‌ ఇన్స్‌పెక్టర్‌ కిషోర్‌ సందర్శించి వివరాలు సేకరించారు. సోమవారం పట్టణ శివారులో టౌన్‌ ఇన్స్‌పెక్టర్‌ కిషోర్‌ వాహనాల తనిఖీ చేస్తున్న సమయంలో సమిండ్ల మహేష్‌తో పాటు వీరబత్తిని సాయి కిరణ్‌ అనుమానాస్పదంగా కనిపించారు. పోలీసులను చూసి తప్పించుకునే క్రమంలో పట్టుకుని విచారించగా బీట్‌ బజార్‌ హత్య కేసులో నిందులుగా గుర్తించినట్లు పేర్కొన్నారు. హత్యకు గురైన శేఖర్‌పై ఇది వరకే రౌడీ షీట్‌ ఉందని, దసరా పండుగ రోజు బీట్‌ బజార్‌లో జరిగిన దసరా ఉత్సవాల్లో తల్వార్‌ చేత బట్టుకుని ప్రదర్శించిన సమిండ్ల మహేష్‌, అదే రోజు తన స్నేహితుడితో కలిసి హత్యకు పాల్పడడంతో ఇద్దరిపై రౌడీ షీట్‌ తెరిచినట్లు డీఎస్పీ ప్రకాష్‌ వెల్లడించారు. ఒకటి కంటే ఎక్కువ కేసులు నమోదవుతే ఇక నుంచి రౌడీ షీట్లు ఓపెన్‌ చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏఎస్సై వెంకటేశ్వర్‌ రావు, సిబ్బంది శ్రీనివాస్‌ ఉన్నారు.


Updated Date - 2021-10-19T05:51:00+05:30 IST