12 అడుగుల మొసలితో పోరాడి.. ప్రాణాలు దక్కించుకున్న టీనేజర్!

ABN , First Publish Date - 2021-07-28T19:11:47+05:30 IST

కాలిఫోర్నియాకు చెందిన ఓ టీనేజర్ పెద్ద సాహసమే చేసింది. ఏకంగా 12 అడుగుల మొసలితో పోరాడి మరీ తన ప్రాణాలను కాపాడుకుంది.

12 అడుగుల మొసలితో పోరాడి.. ప్రాణాలు దక్కించుకున్న టీనేజర్!

మెక్సికో: కాలిఫోర్నియాకు చెందిన ఓ టీనేజర్ పెద్ద సాహసమే చేసింది. ఏకంగా 12 అడుగుల మొసలితో పోరాడి మరీ తన ప్రాణాలను కాపాడుకుంది. సరదాగా స్నేహితురాలితో కలిసి ఈతకు వెళ్లిన సమయంలో ఆమె ఊహించని విధంగా ప్రమాదం బారిన పడింది. నీటిలో మొసలి ఆమె కాలును నోట కరచుకుని లోపలికి లాక్కెళ్తుంటే ఏ మాత్రం భయపడకుండా వీరోచితంగా దానితో పోరాడింది. తన కాలును వదిలిపెట్టేవరకు మొసలిపై పిడిగుద్దులతో విరుచుకుపడింది. అంతే.. టీనేజర్ దెబ్బలకు మొసలి ఆమె కాలును వదిలిపెట్టి అక్కడి నుంచి జారుకుంది. అసలేం జరిగిందంటే.. కాలిఫోర్నియాలోని మారిన్ కౌంటీకి చెందిన కియానా హమ్మెల్స్ అనే 18 ఏళ్ల టీనేజర్ ఇటీవల తన స్నేహితురాలితో కలిసి పుర్టో వల్లార్తాలోని మారియట్ రిసార్ట్‌కు వెళ్లింది. ఈ క్రమంలో ఇద్దరు కలిసి రాత్రివేళ సరదాగా ఈత కొట్టాలని నిర్ణయించుకున్నారు. దాంతో దగ్గరిలోని సముద్ర తీరానికి వెళ్లారు. 


ఇద్దరు సముద్ర తీరంలో ఈత కొట్టడం ప్రారంభించారు. అలా కొద్దిసేపు వారికి సరదాగా గడిచింది. ఆ తర్వాత ఉన్నట్టుండి కియానా కాలును ఎవరో నీటిలో కింద పట్టి లాగినట్లు అనిపించింది. ఏంటా అని చూస్తే పెద్ద మొసలి కనిపించింది. వెంటనే కియానా అక్కడి నుంచి బయటకు రావడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో మొసలి ఆమె కుడి కాలును నోట కరచుకుని లోపలికి లాక్కెళ్లడం ప్రారంభించింది. దాంతో కియానాకు ఏమీ తోచలేదు. వెంటనే తన చేతి పిడికిలిని గట్టిగా బిగించి మొసలిపై పిడిగుద్దుల వర్షం కురిపించింది. తన కాలిని వదిలిపెట్టేవరకు ఆపలేదు. దాంతో మొసలి ఆమె కాలును వదిలిపెట్టి అక్కడి వెళ్లిపోయింది. అనంతరం కియానా తన స్నేహితురాలి సహాయంతో నీటి నుంచి బయటకు వచ్చేసింది. కాలుపై తీవ్ర గాయాలు కావడంతో ఆమెను మారిన్ జనరల్ ఆస్పత్రిలో చేర్పించారు. ఆ సయమంలో కియానా మీడియాతో మాట్లాడడంతో ఈ విషయం బయటకు వచ్చింది. కియానా ధైర్యానికి నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.  

Updated Date - 2021-07-28T19:11:47+05:30 IST