హక్కుల భాస్వరం!

ABN , First Publish Date - 2020-08-13T05:30:00+05:30 IST

కమలా హారిస్‌... ఇప్పుడు అమెరికాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు. డెమొక్రటిక్‌ పార్టీ తరఫున అమెరికా అధ్యక్షుడి రేసులో ఉన్న జో బిడెన్‌ ఆమెను తన డిప్యూటీగా ఎంపిక చేయడమే అందుకు కారణం...

హక్కుల భాస్వరం!

కమలా హారిస్‌... ఇప్పుడు అమెరికాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్న పేరు. డెమొక్రటిక్‌ పార్టీ తరఫున అమెరికా అధ్యక్షుడి రేసులో ఉన్న జో బిడెన్‌ ఆమెను తన డిప్యూటీగా ఎంపిక చేయడమే అందుకు కారణం. కాలిఫోర్నియా సెనేటర్‌గా ఉన్న కమల (55) అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపికైన తొలి భారత సంతతి మహిళగా గుర్తింపు సాధించారు. ఈ అరుదైన గౌరవం అందుకున్న తొలి నల్ల జాతీయురాలామె. ఈ ‘హక్కుల స్వరం’ ప్రస్థానమిది.


ప్రస్తుతం కాలిఫోర్నియా జూనియర్‌ సెనేటర్‌గా ఉన్న కమలా హారిస్‌ ఆక్లాండ్‌లో పుట్టారు. ఆమె తల్లి శ్యామలా గోపాలన్‌ది తమిళనాడు. తండ్రి డొనాల్డ్‌ హారిస్‌ది జమైకా. కమల అమ్మానాన్న అమెరికాలోని బర్కిలీ యూనివర్సిటీలో ఒకరికొకరు పరిచయం అయ్యారు. ఆ తరువాత పెళ్లి చేసుకున్నారు. కమలకు ఒక చెల్లెలు ఉన్నారు. పేరు మాయ. ఆమె కూడా రాజకీయ ఉద్యమకారిణి. హిల్లరీ క్లింటన్‌ అమెరికా అధ్యక్ష పోటీలో ఉన్నప్పుడు ఆమె వద్ద పనిచేశారు. కమలా హారిస్‌ హోవర్డ్‌ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా అందుకున్నారు. తరువాత ‘హేస్టింగ్స్‌ కాలేజీ ఆఫ్‌ లా’ నుంచి న్యాయ విద్య పూర్తిచేశారు. కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా, శాన్‌ఫ్రాన్సిస్కో జిల్లా అటార్నీగా కూడా పనిచేసిన తొలి మహిళగా, మొదటి నల్లజాతీయురాలుగా కమల గుర్తింపు పొందారు. ఆమె భర్త డగ్లస్‌ ఎంహాఫ్‌ కూడా న్యాయవాదిగా పనిచేస్తున్నారు.  


సంస్కరణల స్వరం... 

ఒక సెనేటర్‌గా కమల ఆరోగ్య రంగంలో సంస్కరణలు, వలసొచ్చిన వారికి పౌరసత్వం, మారణాయుధాలపై నిషేధం, పన్ను సంస్కరణలకు మద్దతు తెలిపారు. జాతివివక్షను మొదటి నుంచి ప్రశ్నించేవారామె. నల్లజాతీయుడు జార్జ్‌ ఫ్లాయిడ్‌ హత్య తరువాత జాతివివక్షకు గురయ్యే వారికి న్యాయం జరగాలని నినదించారు. అంతేకాదు పోలీస్‌ వ్యవస్థలో మార్పులు చేయాలని, మూకదాడులను నేరంగా పరిగణించాలనే ప్రజాభిప్రాయానికి కమల మద్దతు తెలిపారు. 


అమ్మ ఆమెకు సూపర్‌హీరో!

చాలా ఇంటర్వ్యూలలో కమలా హారిస్‌ అమ్మతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ‘నా జీవితంలో నన్ను ఎక్కువగా ప్రభావితం చేసిన వ్యక్తి మా అమ్మ’ అంటారామె. కమలకు ఏడేళ్ల వయసున్నప్పుడు ఆమె తల్లితండ్రులు విడిపోయారు. ఇద్దరు బిడ్డల్ని వాళ్లమ్మ అన్నీ తానై పెంచింది. అందుకే వారికి తల్లితో అనుబంధం ఎక్కువ. తనకు బాధ్యతలు తెలియజేసి, రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు అమ్మే ప్రేరణ అంటారు కమల. అమ్మ ఆమెకు స్ఫూర్తి మాత్రమే కాదు సూపర్‌హీరో కూడా. 


సోషల్‌ మీడియాలో ప్రముఖుల మద్దతు...

కమలా హారిస్‌ వార్తల్లో నిలవడం ఇదే మొదటి సారి కాదు. ఆమె 2019లో మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ పుట్టినరోజు నాడు ‘నేను అమెరికా అధ్యక్షురాలిగా పోటీచేయాలనుకుంటున్నా’ అని ప్రకటించి సంచలనం సృష్టించారు. అయితే ధనబలం లేకపోవడం, మొదటి డిబేట్‌లో తగినన్ని ఓట్లు రాకపోవడంతో ఆమె వెనక్కి తగ్గారు. తాజాగా డెమొక్రటిక్‌ పార్టీ తరఫున అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపికవడంతో మరోమారు ఆమె అందరి దృష్టిని ఆకర్షించారు. కమలా హారిస్‌ ఎంపికను ఆ దేశ నేతలు గొప్ప నిర్ణయంగా భావిస్తున్నారు. ఆమెను అభినందిస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. ‘కమలా హారిస్‌ నాకు చాన్నాళ్లుగా తెలుసు. ఆమె ఈ పదవికి పూర్తి అర్హురాలు. హక్కుల కోసం నినదించే వారి గొంతుకగా ఆమె పోరాడుతున్నారు’’ అన్నారు మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా. ‘ఎంతో థ్రిల్‌గా ఫీలవుతున్నా. ప్రజా సేవకురాలిగా, నాయకురాలిగా కమల తనను తాను ఇప్పటికే నిరూపించుకుంది’’ అని కమలను అభినందిస్తూ హిల్లరీ క్లింటన్‌ ట్వీట్‌ చేశారు. ప్రపంచవ్యాప్తంగా అనేకమంది సెలబ్రిటీలు కమలకు మద్దతు తెలుపుతూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 


Updated Date - 2020-08-13T05:30:00+05:30 IST