30 లక్షల కేసులు దాటిన మొదటి రాష్ట్రంగా కాలిఫోర్నియా రికార్డు

ABN , First Publish Date - 2021-01-19T23:23:13+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు, మరణాలు అమెరికాలోనే నమోదైన సంగతి తెలిసిందే. అమెరికాలో రెండు

30 లక్షల కేసులు దాటిన మొదటి రాష్ట్రంగా కాలిఫోర్నియా రికార్డు

కాలిఫోర్నియా: ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు, మరణాలు అమెరికాలోనే నమోదైన సంగతి తెలిసిందే. అమెరికాలో రెండు కోట్లకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా మహమ్మారి ప్రారంభమైన సమయంలో అమెరికాలో న్యూయార్క్ రాష్ట్రం కరోనాకు కేంద్రంగా ఉండేది. కానీ.. అక్కడి ప్రభుత్వం సమర్థవంతంగా కరోనా మహమ్మారి వ్యాప్తిని తగ్గించగలిగింది. న్యూయార్క్‌లో వ్యాప్తి తగ్గిందనుకునేలోపే ఇతర రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి పెరగడం మొదలైంది. ముఖ్యంగా కాలిఫోర్నియా, ఫ్లోరిడా రాష్ట్రాల్లో కరోనా విపరీతంగా వ్యాప్తి చెందుతూ వచ్చింది. 


జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ లెక్కల ప్రకారం.. కాలిఫోర్నియాలో మంగళవారానికి 30 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ లెక్కల ప్రకారం కాలిఫోర్నియాలో ఇప్పటివరకు 30,19,758 కరోనా కేసులు నమోదయ్యాయి. మరోపక్క కరోనా బారిన పడి కాలిఫోర్నియా వ్యాప్తంగా 33,746 మంది ప్రాణాలు కోల్పోయారు. అమెరికాలో 30 లక్షలకు పైగా కేసులు దాటిన మొదటి రాష్ట్రంగా కాలిఫోర్నియా కొత్త రికార్డు కొట్టింది. ఇదిలా ఉంటే.. అమెరికా ప్రభుత్వం ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రారంభించేసింది. అక్కడి జనాభాలో ఇప్పటివరకు 3.2 శాతం మంది వ్యాక్సిన్ డోస్‌ను తీసుకున్నారు. మరోపక్క తమ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో 10 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లు వేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు జో బైడెన్ అన్నారు. జనవరి 20న ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Updated Date - 2021-01-19T23:23:13+05:30 IST