కాల్సైట్‌ టెండర్లు రద్దు

ABN , First Publish Date - 2021-04-16T10:05:04+05:30 IST

విశాఖ జిల్లా అనంతగిరి మండలం నిమ్మలపాడులో కాల్సైట్‌ గనుల టెండర్లను రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) రద్దు చేసింది.

కాల్సైట్‌ టెండర్లు రద్దు

ఏపీఎండీసీ ఉత్తర్వులు

3 వారాలు స్టే విధించిన హైకోర్టు..  ఫలితంగానే టెండర్ల రద్దు


విశాఖపట్నం, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): విశాఖ జిల్లా అనంతగిరి మండలం నిమ్మలపాడులో కాల్సైట్‌ గనుల టెండర్లను రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) రద్దు చేసింది. నిమ్మలపాడులోని 8.725 హెక్టార్లలో కాల్సైట్‌ తవ్వకాలకు సంస్థ గత నెలలో ఈ-టెండర్లు ఆహ్వానించింది. గిరిజనుల అనుమతి లేకుండా.. గ్రామసభ తీర్మానం చేయకుండానే వీటిని పిలిచింది. టెండర్లలో గిరిజనులు గానీ, గిరిజన సహకార సొసైటీలు పాల్గొనడానికి వీల్లేని కఠినతర నిబంధనలు విధించింది. ఈ వ్యవహారంలో ఇద్దరు వైసీపీ పెద్దల పాత్ర ఉందన్న ఆరోపణలు వచ్చాయి.


దీనిపై ‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలు ప్రచురించింది. ఇదే సమయంలో టెండర్‌లో నిబంధనలను సవాల్‌ చేస్తూ నిమ్మలపాడుకు చెందిన అభయ మ్యూచువల్లీ గిరిజన లేబర్‌ కో-ఆపరేటివ్‌ సొసైటీ హైకోర్టులో పిటిషన్‌ వేయగా.. కోర్టు మూడు వారాలపాటు స్టే విధించింది. ఈ నేపథ్యంలో పాలనాపరమైన కారణాలతో కాల్సైట్‌ గనుల టెండర్లు రద్దు చేస్తున్నట్లు గురువారం ఏపీఎండీసీ ఉత్తర్వులు జారీచేసింది.

Updated Date - 2021-04-16T10:05:04+05:30 IST