భారత్ ప్రతిష్ఠకు కెయిన్ కళంకం

ABN , First Publish Date - 2021-07-14T20:16:14+05:30 IST

భారత్‌లో చమురు, సహజవాయు నిక్షేపాల అన్వేషణలో పాల్గొంటున్న ప్రైవేట్ సంస్థలలో కెయిన్ ఒకటి. అనేక బడా వ్యాపార సంస్థల వలే ఇది కూడా తన వాటాల మళ్ళింపునకు పాల్పడింది.

భారత్ ప్రతిష్ఠకు కెయిన్ కళంకం

భారత్‌లో చమురు, సహజవాయు నిక్షేపాల అన్వేషణలో పాల్గొంటున్న ప్రైవేట్ సంస్థలలో కెయిన్ ఒకటి. అనేక బడా వ్యాపార సంస్థల వలే ఇది కూడా తన వాటాల మళ్ళింపునకు పాల్పడింది. ఈ వాటాల వ్యాపారానికి సంబంధించిన పన్నుల చెల్లింపు భారత ప్రభుత్వం, ఆ కంపెనీ మధ్య ఒక వివాదాస్పద వ్యవహారంగా పరిణమించింది. పదిహేను సంవత్సరాల క్రితం మొదలయిన ఈ పన్నుల వివాదం చివరకు భారతదేశాన్ని అంతర్జాతీయ బోనులో నిలబెట్టే పరిస్థితికి చేరుకుంది. విదేశాలలోని భారతీయ బ్యాంకులలో ఉన్న నగదు నిల్వలను ఉపసంహరించుకోవడానికి కేంద్రం సిద్ధమవడం పరిస్థితి తీవ్రతను విశదం చేస్తోంది. 


కెయిన్ విషయంలో మన అధికారులు, బహుశా, పొరబడి ఉంటారు. ఆ సంస్థ ఏకంగా మన దేశాన్ని అంతర్జాతీయంగా ఈడుస్తుందని ఉహించి ఉండరు. విదేశీ వాటాల బదలాయింపు ఫలితంగా రూ.10,247 కోట్ల పన్నును అపరాధ రుసుంతో కలిపి, వెరసి రూ.24,500 కోట్లు చెల్లించాలని కెయిన్‌ను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశించింది. అందుకు ఆ కంపెనీ నిరాకరించింది. దీంతో ఆ సంస్థ వాటాలు కొన్నింటిని కేంద్రం స్వాధీనపర్చుకొంది. బ్రిటన్-భారత్ మధ్య ద్వైపాక్షిక ఒప్పందానికి భిన్నంగా తమపై పన్ను వేశారని, ఇది న్యాయవిరుద్ధమని కెయిన్ వాదించింది. ‘అంతర్జాతీయ వివాదాల ట్రిబ్యునల్’లో భారత్‌కు వ్యతిరేకంగా దావా వేసింది. కెయిన్‌కు అను కూలంగా ట్రిబ్యునల్ తీర్పు వచ్చింది. 1.2 బిలియన్ డాలర్లను కెయిన్ సంస్థకు చెల్లించాలని భారత్‌ను ఆ ట్రిబ్యునల్ ఆదేశించింది. ఈ తీర్పు వెలువరించిన న్యాయమూర్తులలో ఒకరు అంతర్జాతీయ పన్ను వివాదాల నిపుణుడు, ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి దల్వీర్ భండారి. ఆ తీర్పును అమలు చేయాలని భారత ప్రభుత్వ ఆస్తులు, బ్యాంకులు ఉన్న పలు దేశాలలోని న్యాయస్థానాలను కెయిన్ ఆశ్రయించింది. ఫ్రాన్స్‌లో దానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. వివిధ దేశాలలోని భారతీయ బ్యాంకులలో ఉన్న నగదు నిల్వలపై ఆ సంస్థ కన్నేసింది. ఆయా దేశాలలోని భారత ప్రభుత్వ ఆస్తులను తమకు స్వాధీనపరచాలని కెయిన్ వ్యూహాత్మకంగా ముందుకు వెళుతూ భారత్‌ను ఇరుకునపెడుతోంది. సున్నితమైన ఈ అంశంపై అది చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. భారత్ నుంచి వసూలు చేసే సొమ్మును తాము మళ్ళీ ఆ దేశంలోనే మదుపు చేస్తామని కెయిన్ ప్రకటించింది. 


గతంలో వోడాఫోన్ సంస్థ పన్నుల విషయంలో కేంద్రం వ్యవహరించిన తీరును కూడా అంతర్జాతీయ వాణిజ్య వర్గాలు హర్షించలేదు. రూ.8000 కోట్ల పన్నును అపరాధ రుసుం, వడ్డీతో కలిపి 22 వేల కోట్లు చెల్లించాలని కేంద్రం ఇచ్చిన ఆదేశాలపై వోడాఫోన్ ఇదే ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. తీర్పు వోడాఫోన్‌కే అనుకూలంగా ఉంది. నెదర్లాండ్స్–భారత్ మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలకు, భారత ప్రభుత్వ ఆదేశాలు విరుద్ధమని ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. కెయిన్, వోడాఫోన్ పన్నుల వివాదాలు యూపీఏ ప్రభుత్వ హయాంలోనే మొదలయ్యాయి. అయితే కెయిన్ సంస్థ పన్నుల వివాదాన్ని న్యాయపరంగా ఎదుర్కోవడంలో మోదీ సర్కార్ విఫలమయింది. దేశం లోపల బయట న్యాయస్థానాలలో కెయిన్ పన్నుల కేసును భారత ప్రభుత్వం సమర్థంగా ఎదుర్కోవడం లేదని దివంగత ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రధాని మోదీకి రాసినట్లుగా చెబుతున్న లేఖ ఒకటి ఇటీవల వెలుగులోకి రావడం ఇక్కడ గమనార్హం. పన్నుల ఉగ్రవాదం అంటూ యూపీఏ ప్రభుత్వాన్ని బీజేపీ విమర్శించేది. మోదీ ప్రభుత్వం సైతం ఆ విధానాన్నే అనుసరించింది. ఈ రెండు కేసులలో కూడా అంతర్జాతీయ ట్రిబ్యునల్ కంటే ముందు, భారత సుప్రీంకోర్టు సైతం విదేశీ సంస్థల వాదనను సమర్ధిస్తూ వారికి అనుకూలంగా తీర్పులు ఇచ్చిన విషయాన్ని ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాలి. అంతర్జాతీయ దౌత్య నియమాలు, దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలకు భిన్నంగా ఈ రకమైన పన్నుపోటుకు ప్రభుత్వాలు ఎందుకు ప్రయత్నిస్తాయో అర్థం చేసుకోవడానికి పెద్దగా శ్రమపడవల్సిన అవసరం లేదు. ఈ రెండు వివాదాల తర్వాత 2016–19 సంవత్సరాల మధ్య సుమారు 60 దేశాలు భారత్‌తో ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందాలను రద్దు చేసుకోవడమో లేదా సవరించుకోవడమో చేశాయి. 


విదేశీ సంస్థలను భారీ పన్నులతో సతాయిస్తే అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడంలో భారత్ వెనుకపడిపోయే ప్రమాదం ఎంతైనా ఉంది. ఏమైనా కెయిన్ వివాదం అంతర్జాతీయంగా భారతదేశానికి తల నొప్పిగా పరిణమించవచ్చు. భారతదేశ సౌర్వభౌమత్వాన్ని, ప్రభుత్వ విచక్షణాధికారాలను విదేశీ గడ్డపై ప్రశ్నించే విధంగా ఈ వ్యవహారం ముదురుతుండడం బాధాకరం. 


మొహమ్మద్ ఇర్ఫాన్

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి


Updated Date - 2021-07-14T20:16:14+05:30 IST