భారత్‌పై కేసుల ఉపసంహరణకు కెయిర్న్ అంగీకారం

ABN , First Publish Date - 2021-09-07T20:59:10+05:30 IST

వివిధ దేశాల్లోని భారత ప్రభుత్వ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు

భారత్‌పై కేసుల ఉపసంహరణకు కెయిర్న్ అంగీకారం

న్యూఢిల్లీ : వివిధ దేశాల్లోని భారత ప్రభుత్వ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు పెట్టిన కేసులను ఉపసంహరించుకుంటామని బ్రిటన్‌లోని కెయిర్న్ ఎనర్జీ పీఎల్‌సీ మంగళవారం ప్రకటించింది. రెట్రాస్పెక్టివ్ ట్యాక్స్ చట్టం రద్దు నేపథ్యంలో 1 బిలియన్ డాలర్లు తమకు భారత ప్రభుత్వం చెల్లించిన రెండు రోజుల్లోనే ఈ కేసులను ఉపసంహరించుకుంటామని తెలిపింది. లండన్‌లో ఉన్న కెయిర్న్ సీఈఓ సైమన్ థామ్సన్ భారత దేశంలోని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వివరాలను తెలిపారు. 


వ్యాపార ఆస్తులు భారత దేశంలో ఉంటూ, వాటి యాజమాన్యం విదేశాల్లో మారితే కేపిటల్ గెయిన్స్ లెవీలను విధించేందుకు అవకాశం కల్పిస్తూ ఓ విధానాన్ని 2012లో భారత ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ విధానాన్ని రద్దు చేస్తూ గత నెలలో ఓ చట్టాన్ని భారత ప్రభుత్వం ఆమోదించింది. ఈ చర్య సాహసోపేతమైనదని కెయిర్న్ పేర్కొంది. 


రెట్రాస్పెక్టివ్ ట్యాక్స్ డిమాండ్‌ను అమలు చేయడం కోసం జప్తు చేసిన సొమ్మును తమకు తిరిగి ఇచ్చేయడం, అందుకు బదులుగా భారత ప్రభుత్వంపై తాము పెట్టిన కేసులను ఉపసంహరించుకోవడం తమకు సమ్మతమేనని సైమన్ చెప్పారు. ఈ సొమ్మును తిరిగి చెల్లించిన రెండు రోజుల్లో తాము పెట్టిన కేసులను ఉపసంహరించుకుంటామన్నారు. పారిస్‌లోని దౌత్య కార్యాలయాల భవనాలను, అమెరికాలోని ఎయిరిండియా విమానాలను స్వాధీనం చేసుకోవడం కోసం పెట్టిన కేసులను ఉపసంహరించుకుంటామని చెప్పారు. ఇందుకు కెయిర్న్ షేర్ హోల్డర్లు అంగీకరించారని తెలిపారు. బ్లాక్‌రాక్, ఫ్రాంక్లిన్ టెంపుల్‌టన్ వంటి కోర్ షేర్ హోల్డర్స్ సమ్మతించినట్లు తెలిపారు. 


Updated Date - 2021-09-07T20:59:10+05:30 IST