ప్రచారానికి వస్తావా? పోలీస్‌ స్టేషన్‌కు వెళతావా?

ABN , First Publish Date - 2021-03-05T06:16:45+05:30 IST

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అధికార పార్టీ..

ప్రచారానికి వస్తావా? పోలీస్‌ స్టేషన్‌కు వెళతావా?

కే‘డర్’‌!

ఇదీ అధికార పార్టీ దందా

సొంత పార్టీ వారికే బెదిరింపులు

ప్రతిపక్ష కార్యకర్తలకూ హెచ్చరికలు

పోలీస్‌ స్టేషన్‌లో బైండోవర్‌ కేసులు

‘తూర్పు’లోని ఒక్క స్టేషన్‌లోనే 110 కేసులు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ అధికార పార్టీ బెదిరింపులు అధికమవుతున్నాయి. నిన్నటి వరకు పోటీలో ఉండవద్దని, నామినేషన్లు ఉపసంహరించుకోవాలంటూ ఇతర పార్టీలకు చెందిన వారిని బెదిరించారు. మరికొందరిని భయపెట్టి పార్టీలో కలిపేసుకున్నారు. ఇప్పుడు సొంత పార్టీ వారైనా సరే ప్రచారానికి రాకుండా మొండికేయడం, వ్యతిరేకంగా పనిచేస్తారని అనుమానం ఉంటే...వారిని కూడా కట్టడి చేస్తున్నారు. ఇందుకోసం పోలీసులను ఉపయోగించుకుంటున్నారు. 


‘మా వార్డులో ఫలానా వ్యక్తి మాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు. అతడి వల్ల ఎన్నికల సమయంలో ఘర్షణలు జరిగే అవకాశం ఉంది.’ అంటూ అధికార పార్టీ అభ్యర్థి సంబంధిత పోలీస్‌ స్టేషన్‌లో చెబుతున్నారు. దానినే ఫిర్యాదుగా చేసుకొని సదరు పోలీసులు...సదరు వ్యక్తులను తీసుకొచ్చి స్టేషన్‌లో వేస్తున్నారు. ఎటువంటి గలాటాలు చేయనని హామీ పత్రం రాయించుకొని, తహసీల్దార్‌ ముందు హాజరు పరిచి, రూ.2 లక్షల పూచీకత్తు తీసుకొని ఆ తరువాత విడిచిపెడుతున్నారు. పోలీస్‌ చర్యలతో సదరు వ్యక్తులు భయపడిపోతున్నారు. ఎన్నికల్లో ప్రచారానికి వెళ్లనంత మాత్రాన ఇలా పోలీస్‌ కేసులు పెడతారా? అంటూ వాపోతున్నారు. అధికార పార్టీ దీర్ఘకాలంగా పార్టీకి సేవ చేస్తున్న వారిని పక్కనపెట్టి కొన్ని వార్డుల్లో వేరే వ్యక్తులకు టిక్కెట్లు ఇచ్చింది. అటువంటిచోట్ల అభ్యర్థులతో కలిసి పనిచేయడానికి ఆ వార్డు నాయకులు, కార్యకర్తలు కొందరు విముఖత చూపుతున్నారు. ఎన్నికల ప్రచారానికి, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దీనిని సదరు అభ్యర్థులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇష్టమున్నా, లేకపోయినా వచ్చి పనిచేయాల్సిందేనని హుకుం జారీచేస్తున్నారు. అప్పటికీ మాట వినకపోతే...వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో పోలీసులు ముందు ఒప్పించడానికి యత్నించి, వినకపోతే బైండోవర్‌ కేసులు పెడుతున్నారు. 


ప్రతిపక్ష పార్టీ నాయకులపై కూడా

సొంత పార్టీ నాయకులపైనే కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్న అధికార పార్టీ నాయకులు ప్రతిపక్ష పార్టీ వారిని వదిలిపెడతారా? అనే అనుమానం కలగకమానదు. ఆ విషయంలోను వారు వెనక్కి తగ్గడం లేదు. ప్రతిపక్షంలో తమ విజయావకాశాలను తగ్గించేవారు ఎవరున్నారో గుర్తించి వారిపై కేసులు పెడుతున్నారు. ఈ బైండోవర్‌ల వల్ల సదరు కుటుంబాలన్నీ బెదిరిపోతున్నాయి. రూ.2 లక్షల పూచీకత్తు, ఎన్నికల సమయంలో ఎక్కడికి వెళ్లబోమని, ఏమీ చేయబోమని రాసి ఇవ్వాల్సి ఉండడంతో...‘ఎందుకొచ్చిన రాజకీయాలు?’ అంటూ వారి కుటుంబ సభ్యులు తలలు బాదుకుంటున్నారు. 


ఆ స్టేషన్‌లో 110 కేసులు నమోదు

విశాఖ తూర్పు నియోజకవర్గంలోని ఒక పోలీస్‌ స్టేషన్‌లోనే 110 మందిపై ఇలాంటి బైండోవర్‌ కేసులు నమోదు చేశారు. దీనిపై సంబంధిత అధికారిని వివరణ కోరితే... అభ్యర్థుల ఫిర్యాదుల మేరకు కేసులు పెట్టామని, రూ.2 లక్షల పూచీకత్తుతో విడిచిపెట్టామని వివరించారు. ఇందులో అన్ని పార్టీలకు చెందినవారు వున్నారని వివరించారు. 


వారిపై గతంలో ఏ కేసులు లేవు

సాధారణంగా బైండోవర్‌ కేసులను రౌడీషీటర్లు, తరచూ ఘర్షణలకు దిగేవారిపై పెడుతుంటారు. కానీ ఇప్పుడు ఈ కేసులు నమోదైన వారిలో అత్యధికులకు అలాంటి చరిత్ర లేకపోవడం గమనార్హం. కేవలం అభ్యర్థుల ఫిర్యాదును ఆధారంగా చేసుకొని ముందు జాగ్రత్త చర్యగా కేసులు పెడుతున్నారు. 


రౌడీషీటర్లపై కేసులు ఎత్తివేత!

ఎప్పుడైనా ఎన్నికలు జరుగుతుంటే...రౌడీషీటర్లను తీసుకొచ్చి కౌన్సెలింగ్‌ చేస్తారు. గొడవలు చేసినా, ఇంకెటువంటి వివాదాలు రేపినా తోలు తీస్తామని హెచ్చరిస్తారు. వారు రోజూ స్టేషన్‌కు వచ్చి సంతకాలు పెట్టాలని చెబుతారు. విచిత్రంగా ఈసారి ఎందుకనో ఎన్నికల ముందు...గత నెలలో సుమారు 35 మంది రౌడీషీటర్లపై కేసులు ఎత్తేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.  


24వ వార్డులో రెబెల్‌కు బెదిరింపులు

24వ వార్డులో అధికార పార్టీ టిక్కెట్‌ ఆశించిన వ్యక్తి మహిళా రిజర్వేషన్‌ కావడంతో తన భార్య పేరుతో నామినేషన్‌ వేయించారు. పార్టీలో మొదటి నుంచి వున్నందున తనకు టిక్కెట్‌ ఇస్తారని భావించారు. కానీ వేరే వారికి పార్టీ టిక్కెట్‌ ఇవ్వడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. అంతేకాకుండా భార్యతో, అనుచరులతో కలిసి విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఇది అధికార పార్టీ నాయకులకు నచ్చలేదు. వెంటనే బరిలో నుంచి తప్పుకోకపోతే...‘కొబ్బరికాయ పగిలిపోద్ది’ అంటూ హెచ్చరికలు జారీచేశారు. దానికి సదరు అభ్యర్థి భయపడలేదు. తనకు ఏదైనా జరిగితే...ఆ బెదిరించిన నాయకుడిదే బాధ్యత అంటూ లేఖ రాసి పోలీసులకు అందిస్తానని విలేఖరులకు తెలిపారు.  

Updated Date - 2021-03-05T06:16:45+05:30 IST