నాపై క్యాబ్‌ డ్రైవర్‌ తప్పుడు ప్రచారం

ABN , First Publish Date - 2020-10-02T08:05:51+05:30 IST

‘‘నేను డబ్బులు ఎగ్గొట్టలేదు.. నాపై క్యాబ్‌ డ్రైవర్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. అతను చెప్పిన దాంట్లో వాస్తవం లేదు.

నాపై క్యాబ్‌ డ్రైవర్‌ తప్పుడు ప్రచారం

పోలీసులకు సినీనటి ముమైత్‌ ఖాన్‌ ఫిర్యాదు


పంజాగుట్ట (ఆంధ్రజ్యోతి), అక్టోబరు 1: ‘‘నేను డబ్బులు ఎగ్గొట్టలేదు.. నాపై క్యాబ్‌ డ్రైవర్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. అతను చెప్పిన దాంట్లో వాస్తవం లేదు. అతనికి పూర్తి డబ్బులు చెల్లించాను. విమానంలో పెంపుడు శునకానికి అనుమతి లేకపోవడం, సమయానికి ఎయిరిండియా విమానం లేకపోవడంతో గోవాకు ప్రైవేటు క్యాబ్‌లో వెళ్లాను. నన్నే క్యాబ్‌ డ్రైవర్‌ మోసం చేశాడు’’ అని సినీ నటి ముమైత్‌ ఖాన్‌ ఆరోపించారు.


గురువారం రాత్రి క్యాబ్‌డ్రైవర్‌ రాజుపై పంజాగుట్ట పోలీసులకు ఈ మేరకు ఆమె ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. గోవాలో ఉంటున్న సోదరి వద్దకు వెళ్లడానికి సెప్టెంబరు 16న కారును బుక్‌ చేశానని, రానూపోనూ రూ.20 వేలకు డ్రైవర్‌ ఒప్పుకొన్నాడని తెలిపారు. వెళ్లేటప్పుడు అతను అడ్డదారిలో తీసుకువెళ్లాడని, ఆలస్యం చేశాడని, రోడ్డు ట్యాక్స్‌ అన్నీ తానే కట్టానని పేర్కొన్నారు.


‘‘సెప్టెంబరు 20న తిరిగి రావాల్సి ఉంది. కానీ అమ్మ, సోదరి కోరడంతో ఒకరోజు ఆలస్యమైంది. 22వ తేదీన ఉదయం నగరానికి చేరుకున్నాను. రాకపోకలకు మొత్తం రూ.23,500 చెల్లించాను. కానీ అతను నాపై తప్పుడు ప్రచారం చేశాడు. కొన్ని చానెళ్లలో నా పరువుకు భంగం కలిగేలా వార్తలు ప్రసారం చేశారు. అందుకే పోలీసులకు ఫిర్యాదు చేశా’’ అని వివరించారు. 


Updated Date - 2020-10-02T08:05:51+05:30 IST