సర్వే సర్వత్రా భయం!

ABN , First Publish Date - 2020-02-22T06:59:44+05:30 IST

వారం రోజుల క్రితం గోల్కొండలోని జిన్సీ కాలనీలో కుష్ఠు వ్యాధిగ్రస్తుల గురించి సర్వే చేసేందుకు వెళ్లిన బృందానికి చేదు అనుభవం ఎదురైంది. సీఏఏ, ఎన్‌ఆర్‌సీ సర్వే కోసమే వారు...

సర్వే సర్వత్రా భయం!

అన్ని సర్వేలకూ గడ్డుకాలం

సీఏఏ, ఎన్‌ఆర్‌సీలపై ఆందోళనతో వివరాలు చెప్పేందుకు ప్రజలు నో!

పత్రాలు చూపేదే లేదని స్పష్టీకరణ

సర్వేలకు వస్తున్నవారిపై ఆగ్రహం

వచ్చిన దారినే పొమ్మని ఆందోళన

హైదరాబాద్‌లో పలు సర్వేలకు సెగ

కుష్టు రోగుల సర్వేకు ససేమిరా

స్టాటిస్టికల్‌ సర్వే బృందం అడ్డగింత

ఖమ్మంలో ‘ఆయుష్మాన్‌ భవ’ ఎన్‌సీడీ సర్వేను అడ్డుకున్న ముస్లింలు

దేశంలో పలు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి

జాతీయ జనగణనకూ ఇబ్బందులు?


భూవివాదాలకు చెక్‌ పెట్టేందుకు భూ సర్వే.. నిరక్షరాస్యుల సంఖ్యను తెలుసుకునేందుకు అక్షరాస్యత సర్వే.. ప్రజల ఆరోగ్య స్థితిగతులపై చేసే ఆరోగ్య సర్వే.. అమ్మకాలు పెంచుకునేందుకు కంపెనీలు చేసే మార్కెటింగ్‌ సర్వే.. ఇలా ఎన్నో సర్వేలు!

 

ప్రభుత్వాలు విధానాలను రూపొందించుకోవడానికి.. కంపెనీలు వృద్ధి సాధించడానికి.. ఇలాంటి సర్వేల్లో లభించే సమాచారమే కీలకం. అంత కీలకమైన సర్వేలు ఇన్నాళ్లూ ఎలాంటి ఇబ్బందులూ లేకుండా జరిగిపోయాయి!


కానీ.. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ) నేపథ్యంలో ‘సర్వే’ అంటేనే సర్వే సర్వత్రా భయం నెలకొంది. ఎవరు ఏ సర్వేకొచ్చినా అది ఏ సీఏఏ కోసమో.. ఎన్‌ఆర్‌సీ కోసమో అనే ఆందోళన, ఏ వివరాలిస్తే ఏమవుతుందోనన్న భయం.. ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. దీంతో సాధారణంగా నిర్వహించే సర్వేలను, ప్రభుత్వ సర్వేలను సైతం అడ్డుకుంటున్నారు. ‘ఎవరు ఏ పత్రాలు అడిగినా చూపించొద్దు’ అంటూ సీఏఏ నిరసనకారులు ఇచ్చిన పిలుపు నేపథ్యంలో.. వివిధ సర్వేల కోసం వచ్చినవారికి పత్రాలు చూపేందుకు ప్రజలు నిరాకరిస్తున్నారు. అంతేకాదు.. సర్వేయర్లను అడ్డుకుని వచ్చినదారినే తిరిగి వెళ్లిపొమ్మని ఆందోళనకు దిగుతున్నారు. 


హైదరాబాద్‌ సిటీ, ఖమ్మం, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): వారం రోజుల క్రితం గోల్కొండలోని జిన్సీ కాలనీలో కుష్ఠు వ్యాధిగ్రస్తుల గురించి సర్వే చేసేందుకు వెళ్లిన బృందానికి చేదు అనుభవం ఎదురైంది. సీఏఏ, ఎన్‌ఆర్‌సీ సర్వే కోసమే వారు వచ్చారని భావించిన స్థానికులు.. వారిని అడ్డుకున్నారు. తాము కుష్ఠువ్యాధి బాధితుల వివరాల కోసం వచ్చామని వారు చెప్పినా వినిపించుకోలేదు. వివరాలు చెప్పడానికి ససేమిరా అన్నారు. అక్కణ్నుంచి వెళ్లిపోవాలని తేల్చిచెప్పారు. దీంతో చేసేది లేక అధికారులు 2,3 ఇళ్లల్లో నామమాత్ర సర్వే చేసి వెనుదిరిగారు. రెండు వారాల క్రితం.. పాతబస్తీలోని ఒక ప్రాంతానికి వెళ్లిన స్టాటిస్టికల్‌ సర్వే బృందానికీ ఇదే అనుభవం ఎదురైంది. వారికి స్థానికులు సహకరించలేదు. తాము ఎందుకు సర్వే చేస్తున్నామో వివరించేందుకు ప్రయత్నించినా.. వినడానికి ఆసక్తి చూపలేదు. అదెలాంటి సర్వే అయినా సరే.. ప్రస్తుత పరిస్థితుల్లో తాము సహకరించే ప్రశ్నే లేదని కరాఖండిగా చెప్పడంతో అధికారులు వెనుదిరిగారు. ఈ సర్వేల వ్యవహారం ప్రజలను ఎంతగా భయపెడుతోందంటే.. కార్డన్‌ సెర్చ్‌లకు సైతం ప్రజల నిరసన సెగలు తాకుతున్నాయి. ఉదాహరణకు.. డిసెంబరులో శాలిబండ పోలీసులు నిర్వహించిన కార్డన్‌ సెర్చ్‌ను స్థానిక ఎమ్మెల్యే అడ్డుకున్నారు. ప్రజలు సైతం పోలీసులకు పత్రాలు చూపించేందుకు ఒప్పుకోలేదు. దీంతో 10 నిమిషాల వ్యవధిలోనే పోలీసులు వెళ్లిపోయారు.


దేశవ్యాప్తంగా..

రాష్ట్రంలోనే కాదు.. దేశవ్యాప్తంగా కూడా దాదాపుగా ఇదే పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల ప్రజలు తమ వివరాలు తెలిపేందుకు నిరాకరిస్తూ సర్వేయర్లపై దాడికి దిగుతున్నట్టు జాతీయ గణాంకాల కార్యాలయానికి (ఎన్‌ఎ్‌సవో) ఫిర్యాదులు వస్తున్నాయి. ఉదాహరణకు.. ఐక్యరాజ్య సమితి ‘సస్టెయినబుల్‌ డెవల్‌పమెంట్‌ గోల్స్‌ 2030’ కోసం సమాచారం సేరించే ప్రయత్నానికి అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. పౌరుల వలసలు, ఇంటిని కొనుగోలు చేసే శక్తి తదితర అంశాలపై సమగ్ర సమాచారాన్ని సేకరించే కీలకమైన సామాజిక, ఆర్థిక సర్వే ఇది. కానీ.. ‘మీరు కనీసం గత ఆరునెలలుగా ఇక్కడే ఉంటున్నారా? ఇంతకు ముందు ఎక్కడ ఉన్నారు? ఇంట్లోంచి ఎవరైనా వేరే చోటుకు వెళ్లాలనుకుంటున్నారా? ఇక్కడ ఉండడానికి ముందు ఏ దేశంలో నివసించారు? జనన ధ్రువీకరణ పత్రం ఉందా?’ తదితర ప్రశ్నలు అందులో ఉండడంతో ప్రజలు సర్వేయర్లను అనుమానిస్తున్నారు.


పౌరసత్వాన్ని నిర్ధారించేందుకే ఈ సర్వేను నిర్వహిస్తున్నారనే నిర్ధారణకు వచ్చి సహాయ నిరాకరణ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌, కేరళ, మహారాష్ట్ర, బిహార్‌, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో కొన్నిచోట్ల సర్వేయర్లపై దాడులు కూడా జరిగినట్టు ఎన్‌ఎ్‌సవోకు ఫిర్యాదులు వచ్చాయి. పశ్చిమబెంగాల్‌లో అయితే అసలు ఎలాంటి సర్వేలూ నిర్వహించట్లేదు. ‘క్షేత్రస్థాయిలో అధికారుల భద్రత ప్రశ్నార్థకమవుతోంది. సర్వేయర్లపై దాడులు చేస్తున్నారు. వారిని ఘెరావ్‌ చేస్తున్నారు. ఎలాంటి సర్వే చేయడానికీ ఇది సరైన సమయం కాదని జిల్లా స్థాయి అధికారులు చెబుతున్నారు.’ అని పశ్చిమబెంగాల్‌లో ఎన్‌ఎ్‌సవో అధికారి ఒకరు తెలిపారు. ‘వలసలకు సంబంధించిన ప్రశ్నల వల్లే ప్రజలు ఆగ్రహానికి గురవుతున్నారని మేం మొదట అనుకున్నాం. కానీ.. వారు అత్యంత ప్రాథమికమైన పేరు, మతం లాంటి ప్రశ్నలపై కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు’ అని వివరించారు. యూఎన్‌ సర్వేనే కాదు.. దేశవ్యాప్తంగా చేపట్టిన ఏడో ఆర్థిక గణన, లేబర్‌ ఫోర్స్‌ సర్వేలాంటివి కూడా పశ్చిమబెంగాల్‌లో ఆగిపోయిన పరిస్థితి. బిహార్‌లో కూడా ఇంచుమించుగా ఇదే పరిస్థితి నెలకొంది. ఢిల్లీ శివార్లలోని గ్రేటర్‌ నోయిడా ప్రాంతంలో ఇటీవల ఏడో ఆర్థిక గణన సర్వే నిర్వహించడానికి వెళ్లిన అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. వారిపై దాడి చేశారు. ప్రభుత్వ సర్వేల సంగతి పక్కన పెడితే.. ప్రైవేటు కంపెనీలు తమ అమ్మకాలు పెంచుకోవడానికి నిర్వహించే మార్కెటింగ్‌ సర్వేలకూ ఇబ్బందులు ఎదురు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇది ఇలాగే కొనసాగితే జాతీయ జనగణనకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


తాజాగా ఖమ్మంలో..

ఎన్పీఆర్‌ అనుకొని ఆయుష్మాన్‌భవ సర్వేను ముస్లింలు అడ్డుకున్న ఘటన ఖమ్మంలో శుక్రవారం జరిగింది. ఆయుష్మాన్‌భవలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 2018 అక్టోబరు నుంచి ఎన్‌సీడీ (అంటువ్యాధులు కాని వ్యాధులు) సర్వే నిర్వహిస్తోంది.  రక్తపోటు, మధుమేహం, నోరు-రొమ్ము-గర్భాశయ క్యేన్సర్‌ లక్షణాలను గుర్తించడం ఈ సర్వే ప్రధాన లక్ష్యం. ఖమ్మంలో ఆశా కార్యకర్తలు ఈ సర్వే నిమిత్తం వెళ్లగా.. వారిని ముస్లింలు అడ్డుకున్నారు. ‘అసంక్రమిత వ్యాధుల సర్వే’ అని సర్వే ఫారంలో స్పష్టంగా ఉన్నా వారు వివరాలు తెలిపేందుకు నిరాకరించారు. ఈ సర్వేలో కుటుంబంలోని సభ్యులందరి పేర్లనూ పత్రంలో నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ వివరాలను అడగటంతో ముస్లింలు ఆందోళనకు గురయ్యారు. ఇది వ్యాధులకు సంబంధించిన సర్వే అని చెప్పినా విశ్వసించలేదు. దీంతో చేసేది లేక ఆశా కార్యకర్తలు వెనుదిరిగారు. దీనిపై జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ మాలతిని సంప్రదించగా.. కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఉచిత వైద్యం అందించేందుకు ఈ సర్వే నిర్వహిస్తోందని, ప్రజలు సహకరించాలని సూచించారు.

Updated Date - 2020-02-22T06:59:44+05:30 IST