తెలుగుతల్లి మన తల్లి కాదని కేసీఆర్‌ అనడం విచిత్రం

ABN , First Publish Date - 2020-02-08T08:45:54+05:30 IST

తెలుగుజాతి ఉంది గానీ తెలంగాణ జాతి, ఆంధ్రా జాతి లేదని నిష్కర్షగా చెబుతున్న డాక్టర్‌ సినారె... ప్రజాస్వామ్యంలో ప్రత్యేక రాష్ట్రం కావాలని అధిక సంఖ్యాకులు కోరుకుంటున్నప్పుడు ఇవ్వడంలో తప్పు లేదని

తెలుగుతల్లి మన తల్లి కాదని కేసీఆర్‌ అనడం విచిత్రం

తెలుగుజాతి ఉంది గానీ తెలంగాణ జాతి, ఆంధ్రా జాతి లేదని నిష్కర్షగా చెబుతున్న డాక్టర్‌ సినారె... ప్రజాస్వామ్యంలో ప్రత్యేక రాష్ట్రం కావాలని అధిక సంఖ్యాకులు కోరుకుంటున్నప్పుడు ఇవ్వడంలో తప్పు లేదని అంతే కచ్చితంగా అన్నారు. ఒక చిత్రంలో రాస్తే అన్ని పాటలూ రాస్తా గానీ, ఒక పాట రాసే ప్రసక్తి లేదని చెప్పిన జ్ఞానపీఠ్‌ అవార్డు గ్రహీత సి.నారాయణరెడ్డితో 26-7-10న జరిగిన ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’...


బీఏ దాకా ఉర్దూ మీడియంలో చదివారు. తెలుగు మీద ఇంత పట్టు ఎలా సాధ్యమైంది?

ఏ కళ అయినా సహజాతం... నేర్చుకుంటే పాండిత్యం వస్తుంది గానీ కవిత్వం రాదు. ఏడో తరగతి చదివేటప్పుడే సీస పద్యాలు చెప్పేవాడిని. ఇంటర్మీడియట్‌ వరకు ఆధునిక కవులైన విశ్వనాథ, జాషువా, కృష్ణశాస్ర్తి, శ్రీశ్రీ గురించి తెలియదు. కృష్ణదేవరాయాంధ్ర భాషా కేంద్రంలో సభ్యునిగా మారి, అప్పుడు ఇవన్నీ చదివాను.


సినిమా పాటలు రాసే అవకాశం ఎలా వచ్చింది?

నేను సినిమాలకు పాటలు రాయాలని అనుకోలేదు. 1960 ప్రాంతంలో నేను ఏదో కార్యక్రమానికి మద్రాసు వెళితే, దర్శకుడు బీఎన్‌ రెడ్డి.. పాటలు ఎందుకు రాయవు నారాయణరెడ్డీ అని అడిగారు. లెక్చరర్‌గా పని చేస్తున్నాను. పీహెచ్‌డీ చేస్తున్నాను. సినిమా పాటల్లో పడితే అవి ఆగిపోతాయని చెప్పాను. ఆ తర్వాత ఎన్టీఆర్‌ పిలిపించారు. పాటలు ఎందుకు రాయకూడదని అడిగారు. అంతకు ముందు నాకు రెండుసార్లు అవకాశం వచ్చింది. ఒక్కో పాట రాయాలని అడిగారు. నాకెందుకో ఒక్కటి రాయడం ఇష్టం లేదు. రాస్తే అన్ని పాటలు రాయాలన్నాను. ఆ తర్వాత మరోసారి పిలిపించారు. ‘గులేబకావలి కథ’ సినిమా తీస్తున్నాం. రాస్తారా? మొత్తం పాటలు రాయండని చెప్పారు. మద్రాసుకు వెళ్లగానే స్టేషన్‌కు వచ్చి ఎన్టీఆర్‌ నన్ను రిసీవ్‌ చేసుకున్నారు. 10 రోజులున్నాను. పది పాటలు రాశాను.


మీకు తృప్తి కలిగించిన గేయాలు ఒకటి రెండు...

‘నన్ను దోచుకుందువటే...’ అది జనబాహుళ్యంలోకి వెళ్లింది... ఇటీవల స్వాతికిరణంలో ‘సంగీత సాహిత్య సమలంకృతమే’ కూడా ఇష్టం. చాలా ఉన్నాయి. చెప్పడం కష్టం.


తెలుగుజాతి మనది లాంటి పాట ఇప్పుడు రాయమంటే రాస్తారా?

ఆంధ్రప్రదేశ్‌ భాషాప్రయుక్త రాష్ట్రంగా అవతరించాక రాసిన పాట అది. ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలన్న ఉద్యమం జోరుగా జరుగుతోంది. ఇక్కడ, అక్కడా భాష తెలుగే. అందుకే తెలుగుజాతి అన్నాను. నా దృష్టిలో తెలంగాణ జాతి, ఆంధ్రా జాతి అని ఉండదు. అధిక సంఖ్యాకులు ప్రత్యేక రాష్ట్రం కోరుతున్నప్పుడు ప్రజాస్వామ్యంలో నిరోధించడం భావ్యం కాదన్నది నా అభిప్రాయం.


కవి సార్వభౌముడు శ్రీనాథుడు ఆదర్శమా?

ఆయన రచనా సంవిధానం నాకు చాలా సన్నిహితంగా ఉంటుంది. సమాసాలు వేయడంలో ఆయనే స్ఫూర్తి.


మా తెలుగుతల్లి గేయాన్ని తెలంగాణవాదులు వ్యతిరేకించడం సమర్థనీయమా?

ఆ గేయంలో తెలంగాణ వారి గురించి తక్కువగా ఉందని అలా అంటున్నారు. ఆయన రాసినప్పుడు ఇలా జరుగుతుందనుకున్నారా?  అలా అనుకుంటే మిగతా పేర్లు కూడా కలిపేవారేమో... తెలుగుతల్లి మన తల్లి కాదని కేసీఆర్‌ అనడం విచిత్రం... అది ఆయన అభిప్రాయం కావచ్చు. మాతృభాష అంటాం... తెలుగుతల్లి అంటే తెలుగు భాష.


తెలంగాణలో పుట్టి పెరిగిన మీరు.. విప్లవ సాహిత్యం వైపు ఎందుకు తొంగి చూడలేదు?

రాజకీయ కోణంవైపు నేను ఎప్పుడూ చూడలేదు. నా దృష్టంతా కావ్యరచన పైనే. అయితే, నాకు అభ్యుదయ, విరసం కవులతో సాన్నిహిత్యం ఉం ది. కొన్నాళ్లు నేను అభ్యుదయ శాఖకు చెందిన కవిగా గుర్తింపు పొందాను. విరసం వచ్చాక నేను దూరంగా ఉన్నాను. నాది ప్రగతిశీల మానవతావాదం.


లక్ష్యంగా పెట్టుకున్నదేమైనా ఉందా?

ఇంత వరకు రాసిన దాని కంటే భిన్నంగా, మిన్నగా ఉండేలా దీర్ఘకావ్యం రాయాలి. దానికి తగ్గ వస్తువు దొరకాలి. ఎప్పటికైనా దీర్ఘకావ్యం రాయాలి అదే లక్ష్యం... ఓ ఐదు, పదేళ్లలో పూర్తి చేయాలన్నది సంకల్పం.


కవులు నిక్కచ్చిగా ఉంటారు. మీ విషయం వచ్చేసరికి లౌక్యంగా ఉంటారంటారు?

ఎవరి అభిప్రాయాలు వారివి. కవుల మధ్య అసూయ ఉంటే సంతోషిస్తాను. ద్వేషం ఉంటే బాధ పడతాను. నాకు జ్ఞానపీఠ్‌ అవార్డు రావడానికి చాలా కారణాలున్నాయి. అందరితో మంచిగా ఉండటం నేరం కాదు కదా.

Updated Date - 2020-02-08T08:45:54+05:30 IST