ధాన్యం సేకరణకు ఏర్పాట్లు

ABN , First Publish Date - 2020-11-01T10:39:04+05:30 IST

ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో ధాన్యం కొనుగోలు చేసేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. నవంబరు 16 నుంచి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.

ధాన్యం సేకరణకు ఏర్పాట్లు

ఆంధ్రజ్యోతి - మచిలీపట్నం : ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో ధాన్యం కొనుగోలు చేసేందుకు జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. నవంబరు 16 నుంచి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన విధివిధానాలతో ఉన్న పోస్టర్‌, కరపత్రాలను కలెక్టర్‌ ఇంతియాజ్‌, జేసీ మాధవీలత విజయవాడలో శనివారం ఆవిష్కరించారు. పారదర్శకంగా ధాన్యం కొనుగోళ్లు జరుపుతామని, రైతులకు సకాలంలో నగదు చెల్లింపులు చేస్తామని కలెక్టర్‌ ఈ సందర్భంగా తెలిపారు. జిల్లాలో 338 ధాన్యం కొనుగోలు  కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. 249 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (పీఎసీఎస్‌), 53 జిల్లా సహకార వాణిజ్య సంస్థలు, మార్కెటింగ్‌శాఖ ద్వారా 36 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తామని కలెక్టర్‌ తెలిపారు. మచిలీపట్నం డివిజన్‌లో 76, గుడివాడ డివిజన్‌లో 75, విజయవాడ డివిజన్‌లో 81, నూజివీడు డివిజన్‌లో 106 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.  సాధారణ రకం ధాన్యం క్వింటాకు రూ.1868, గ్రేడ్‌-ఎ రకం ధాన్యం రూ.1888 మద్దతు ధరగా నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.


దిగుబడి లక్ష్యం 16.15 లక్షల టన్నులు  

జిల్లాలో ఈ ఖరీఫ్‌ సీజన్‌లో 2.41లక్ష లహెక్టార్లలో వరిసాగైంది.  ధాన్యం దిగుబడి 16.15లక్షల టన్నులు వస్తుందని అధికారిక అంచనా. ఇందులో పౌరసరఫరాల శాఖ ద్వారా 10.10 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు. మిగిలిన ధాన్యం బీపీటీ 5204, ఇతర సన్నరకాల ధాన్యం బహిరంగ మార్కెట్‌లో రైతులు విక్రయించుకోవచ్చు. రైతులు ధాన్యం విక్రయించాలంటే గ్రామంలోని  గ్రామవ్యవసాయ సహాయకుడు(వీఎఎ) వద్దకు వెళ్లాలి. పట్టాదారు పాస్‌బుక్‌,  ఆధార్‌కార్డు,  బ్యాంకు పాస్‌బుక్‌, సెల్‌ఫోన్‌ నెంబరును తీసుకువెళ్లి ఆన్‌ లైన్‌లో నమోదు చేయించుకోవాలి. ఆన్‌లైన్‌లో ఈ వివరాలు నమోదు చేస్తే ఓటీపీ నెంబరు వస్తుంది. ఆన్‌లైన్‌ ద్వారా వచ్చిన కూపన్‌ నెంబరును రైతులకు అందజేస్తారు.  ఏ గ్రామంలోని కొనుగోలు కేంద్ర ంలో ధాన్యం విక్రయించాలో గ్రామ వ్యవసాయ సహయకుడు నిర్ధేశించి,  సంబంధిత కేంద్రానికి ఈ వివరాలను ఆన్‌లైన్‌లో పంపుతారు.


కొనుగోలు కేంద్రవారు ధాన్యం ఉంచిన కల్లం వద్దకు వెళ్లి నాణ్యతా ప్రమాణాలు పరిశీలించి, అనంతరం ధాన్యం కొనుగోలు చేస్తారు. దీనినే ఫామ్‌గేట్‌ పర్చేజ్‌గా పిలుస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా రైతు నమోదు పత్రాన్ని(ఎఫ్‌టీవో) తయారు చేస్తారు. మద్దతు ధర వివరం రైతుల సెల్‌ఫోన్‌కు సమాచారం వస్తుంది. రైతులకు గోనె సంచులు అందించి, ధాన్యం తూకంవేసి, ముఠా కూలీల ద్వారా లారీలోకి ఎక్కించి  రైస్‌మిల్లుకు ఆన్‌లైన్‌ ట్రాక్‌షీట్‌ ద్వారా  రవాణా చేస్తారు. రైతు న మోద పత్రం ఆన్‌లైన్‌లో ఫ్రీ ఆడిట్‌ లాగిన్‌లోకి వెళుతుంది. ఆడిట్‌ విభాగం వార్చ పరిశీలించిన అనంతరం  పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజరు లాగిన్‌లోకి వస్తుంది. జిలా మేనేజర్‌ లాగిన్‌లో ఆమోదించిన 48 గంటల వ్యవధిలో రైతుల ఖాతాలో నగదు జమవుతుంది. 

Updated Date - 2020-11-01T10:39:04+05:30 IST