నిర్బంధకాండ

ABN , First Publish Date - 2020-11-01T10:32:59+05:30 IST

జిల్లావ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులను శనివారం పోలీసులు గృహనిర్బంధం చేశారు.

నిర్బంధకాండ

  జిల్లాలో టీడీపీ నేతల గృహ నిర్బంధం


 విజయవాడ, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి) : జిల్లావ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నాయకులను శనివారం పోలీసులు గృహనిర్బంధం చేశారు. అమరావతి రాజధాని రైతుల అక్రమ అరెస్టులకు నిరసనగా ‘చలో గుంటూరు.. జైల్‌ భరో ’ కార్యక్రమానికి పిలుపునివ్వడంతో టీడీపీ నాయకులెవరూ ఆ కార్యక్రమంలో పాల్గొనకుండా పోలీసులు శనివారం ఉదయం నుంచే హౌస్‌ అరెస్టులు చేశారు. విజయవాడలో ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌, మాజీ డిప్యూటీ మేయర్‌ గోగుల వెంకటరమణారావు తదితర నాయకులకు నోటీసులు జారీచేసి హౌస్‌ అరెస్టులు చేశారు. విజయవాడ పార్లమెంట్‌ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు, మాజీమంత్రి నెట్టెం రఘురామ్‌ను జగ్గయ్యపేటలో నిర్బంధించారు.


ఆయనతో పాటు జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్‌ తాతయ్య, మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ మల్లెల గాంధీ, తెలుగు యువత అధ్యక్షుడు మల్లెల శివప్రసాద్‌ తదితర నాయకులను హౌస్‌ అరెస్ట్‌ చేశారు. మచిలీపట్నంలో ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, టీడీపీ మచిలీపట్నం పార్లమెంట్‌ నియోజకవర్గ అధ్యక్షుడు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు, మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు పోలీసులు ముందస్తు నోటీసులు అందజేసి నిరసనకు వెళ్లకుండా అడ్డగించారు. 


అవనిగడ్డ టౌన్‌, అక్టోబరు 31 : అమరావతి రైతల అక్రమ అరెస్టులకు నిరసగా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు జైల్‌బరో కార్యక్రమానికి బయలుదేరిన మండల పార్టీ నేతలను పోలీసులు అవనిగడ్డ పార్టీ కార్యాలయంలో నిలువరించి నిర్బంధించారు. జైల్‌బరోలో తెలుగుదేశం నేతలు కొల్లూరి వెంకటేశ్వరరావు, మండలి రామ్మోహన్‌ రావు, గాజుల మురళీకృష్ణ, కడవకొల్లు సీత, లుక్కా. శ్రీనివాసరావు, పులిగడ్డ నాంచారయ్య, షేక్‌ బాబావలి, రేపల్లె అంకినీడు పాల్గొన్నారు. 


బంటుమిల్లి, : పెడన నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి కాగిత కృష్ణప్రసాదును బంటుమిల్లి, పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. కాగిత కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ శాంతియుతంగా నిర్వహిస్తున్న ప్రజాపోరాటాలను ప్రభుత్వం అణిచివేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. బొల్లా వెంకన్న, పాలడుగు వెంకటేశ్వరరావు, కొండ, కాశీ, జరీనా, రమేష్‌ పాల్గొన్నారు.


నాగాయలంక : అమరావతి రైతులను అరెస్టు చేసి గుంటూరు అరండల్‌ పేటలో ఉంచినందుకు నిరసనగా శనివారం అక్కడకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న మచిలీపట్నం పార్లమెంట్‌ టీడీపీ మహిళా అధ్యక్షురాలు తలశిల స్వర్ణలతను నాగాయలంక ఎస్సై కె.శ్రీనివాసు, సిబ్బంది గృహనిర్భంధం చేసినట్లు ఆమెకు నోటీసులు ఇచ్చారు. 


జగ్గయ్యపేట: రాజధాని రైతులను ఎద్దేవాచేస్తున్న ప్రభుత్వం చలో గుంటూరుకు వెళ్లకుండా ఎందుకు అడ్డుకుందని విజయవాడ పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడు నెట్టెం రఘురామ్‌ ప్రశ్నించారు. శనివారం తెల్లవారుజామున నెట్టెంను జగ్గయ్యపేట పోలీసులు ఇంట్లోనే అదుపులోకి తీసుకుని, గుంటూరు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ సందర్భంగా నెట్టెం విలేకర్లతో మాట్లాడుతూ రాజధానిని, రాజధాని రైతులను చులకన చేసి మాట్లాడుతున్న అధికార వైసీపీ నేతలు, మంత్రులు త్వరలోనే తలవంచక తప్పదన్నారు.

  

మచిలీపట్నం టౌన్‌ : గుంటూరులో నిర్వహించే జైల్‌భరో కార్యక్రమానికి వెళుతున్న గన్నవరం నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు బచ్చుల అర్జునుడును మచిలీపట్నంలో హౌస్‌ అరెస్టు చేశారు. అర్జునుడు మాట్లాడుతూ టీడీపీ నిర్వహించే ఉద్యమాలను హౌస్‌ అరెస్టులతో అడ్డుపడదామనుకుంటే ఉద్యమం మరింత ఉధృతమవుతుందని హెచ్చరించారు. సుప్రీం కోర్టు తీర్పును ఉల్లంఘించే విధంగా రైతులకు బేడీలు వేశారన్నారు. 

Updated Date - 2020-11-01T10:32:59+05:30 IST