సంకెళ్లపై.. సమరం

ABN , First Publish Date - 2020-10-29T11:07:01+05:30 IST

రాజధానికి భూములిచ్చిన అన్నదాతలకు సంకెళ్లు వేసి మరీ జైలుకు తీసుకెళ్లడంపై బుధవారం వివిధ పక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

సంకెళ్లపై.. సమరం

గుంటూరు, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): రాజధానికి భూములిచ్చిన అన్నదాతలకు సంకెళ్లు వేసి మరీ జైలుకు తీసుకెళ్లడంపై బుధవారం వివిధ పక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అక్రమ కేసులు పెట్టడమే కాకుండా అన్యాయంగా జైలుకు తరలించారని మండిపడ్డారు. గుంటూరు జిల్లా జైలు ఎదుట టీడీపీ, సీపీఐ, అమరావతి జేఏసీ నేతలు సంయుక్తంగా ధర్నా చేశారు. రాజధాని గ్రామాల్లో 316వ రోజు కొనసాగిన ఆందోళనల్లోనూ రైతులకు సంకెళ్లపై నిరసనలు మిన్నంటాయి.


రాజధాని దళిత జేఏసీ, రాజధాని ఐక్య కార్యాచరణ సమితి నాయకులు మూడు రోజుల నిరసనలకు కార్యాచరణ ప్రకటించారు. కృష్ణాయపాలెంలో బాధిత కుటుంబాలను లోకేశ్‌  పరామర్శించారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు సంకెళ్లు వేసి జైలుకు తరలించడంపై గుంటూరులోని జిల్లా జైలు వద్ద, రాజధాని గ్రామాల్లో నిరసనలు మిన్నంటాయి. జిల్లా జైలు వద్ద బుధవారం టీడీపీ, సీపీఐ, అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు మాట్లాడుతూ రైతులకు వేసిన సంకెళ్లే జగన్‌ ప్రభుత్వానికి ఉరితాళ్లుగా మారతాయని  హెచ్చరించారు. అమరావతి ఉద్యమం పట్ల ప్రభుత్వ అణచివేత పరాకాష్టకు చేరిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు.


అమరావతి ఉద్యమంలో ఒకే కులంవారు ఉన్నారని ప్రచారం చేసిన వారు ఇప్పుడు ఎస్సీలు, బీసీలను ఎందుకు అరెస్టు చేశారని టీడీపీ గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు శ్రావణ్‌కుమార్‌ ప్రశ్నించారు. సీఎం జగన్‌కు రాజ్యాంగ వ్యవస్థలపై నమ్మకం లేదని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ అన్నారు. భూములిచ్చినవారు కడుపు మండి పోరాటం చేస్తుంటే, వారికి పోటీ ఆందోళనలు చేయడం దారుణమని సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. 


 న్యాయమడిగితే కేసులా?

నెట్‌వర్క్‌ : న్యాయమడిగితే కేసులు పెడతారా..? అని రాజధాని రైతులు రైతు కూలీలు, దళిత జేఏసీ సభ్యులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాజధాని ఉద్యమం బుధవారం 316వ రోజుకు చేరుకుంది. రాజధాని దళిత రైతుల అక్రమ అరెస్టులను నిరసిస్తూ అనంతవరం శిబిరంలో ఆకు పచ్చ కండువాలతో చేతులు కట్టుకుని మహిళలు నిరసన తెలిపారు. రైతులు అర్ధనగ్నంగా మోకాళ్లపై నిలబడి దీక్ష చేపట్టారు. పెదపరిమి, మందడం, వెలగపూడి, అబ్బరాజుపాలెం, బోరుపాలెం, నెక్కల్లు, మందడం, నేలపాడు, ఐనవోలు, తుళ్లూరు రైతు దీక్షా శిబిరాల్లోనూ నిరసన కార్యక్రమాలు జరిగాయి.  


 నేటి నుంచి నిరసనలు

తుళ్లూరు: అక్రమ కేసులకు నిరసనగా గురువారం రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్లకు, ఆర్డీవోలకు, రెవెన్యూ అధికారులకు వినతిపత్రాలు అందించనున్నట్టు జేఏసీ నేతలు తెలిపారు. శుక్రవారం నియోజకవర్గ, మండల కేంద్రాల్లోని అంబేడ్కర్‌, మహాత్మాగాంధీ విగ్రహాల వద్ద నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని, శనివారం ‘చలో గుంటూరు జిల్లా జైలు’కు పిలుపునిచ్చినట్టు చెప్పారు. 

Updated Date - 2020-10-29T11:07:01+05:30 IST