షటిల్స్‌.. ట్రబుల్స్‌

ABN , First Publish Date - 2020-10-27T10:00:16+05:30 IST

రెండు రాష్ట్రాల మధ్య సమన్వయ లేమి బోర్డర్స్‌ షటిల్‌ సర్వీసుల్లో ప్రయాణించినవారిని ఇబ్బందుల్లోకి నెట్టింది.

షటిల్స్‌.. ట్రబుల్స్‌

 విజయవాడ, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి) : రెండు రాష్ట్రాల మధ్య సమన్వయ లేమి బోర్డర్స్‌ షటిల్‌ సర్వీసుల్లో ప్రయాణించినవారిని ఇబ్బందుల్లోకి నెట్టింది. ఆదివారం పండగ రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌ - విజయవాడ మధ్య ప్రయాణించేవారి కోసం ఇటునుంచి ఏపీఎస్‌ఆర్టీసీ, అటునుంచి టీఎస్‌ఆర్టీసీలు సరిహద్దుల వరకు షటిల్‌ బస్సులు నడిపాయి. తొలిరోజు టీఎస్‌ఆర్టీసీ బస్సులను గరికపాడు చెక్‌పోస్టుకు కిలోమీటరున్నర దూరంలో నిలిపివేశారు. దీంతో ఇటు నుంచి ఏపీఎస్‌ఆర్టీసీ బస్సుల్లో వెళ్లి, చెక్‌పోస్టు దగ్గర దిగిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు.


తెలంగాణ బస్సులకు సమీపంలో మన బస్సులు ఆగితే బాగుండేదని ప్రయాణికులు అభిప్రాయపడగా, బోర్డర్‌ దాటితే లేనిపోని సమస్యలు వస్తాయన్న ఉద్దేశంతోనే బోర్డర్‌ దగ్గరే మన బస్సులను నిలిపివేయాల్సి వచ్చిందని ఆర్టీసీ అధికారులు వివరణనిచ్చుకున్నారు. కరోనా నేపథ్యంలో ఇంత రద్దీ ఉంటుందని ఆర్టీసీ అధికారులు కూడా భావించలేదు. రెగ్యులర్‌ రైళ్లు లేకపోవటం, చివరి నిమిషంలో స్పెషల్‌ రైళ్లలో సీట్లు దొరకకపోవటంతో ప్రయాణికులు షటిల్‌ బస్సులను ఆశ్రయించక తప్పలేదు. దసరాకు ముందు హడావిడిగా బోర్డర్స్‌కు షటిల్‌ సర్వీసులు నడపటానికి రెండు రాష్ట్రాల ఆర్టీసీలు నిర్ణయం తీసుకున్నాయి. ఏపీ నుంచి వచ్చే వారికి వీలుగా బోర్డర్‌ పాయింట్స్‌ దగ్గరే తెలంగాణ బస్సులు ఆగి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు. అయితే తొలిరోజు ఇబ్బందులను గుర్తించి, సోమవారం టీఎస్‌ఆర్టీసీ బస్సులను గరికపాడు, కల్లూరు చెక్‌పోస్టుల వద్ద ఆపారు. రెండు రాష్ట్రాల బస్సులను పక్కపక్కనే నిలిపి, వచ్చిన ప్రయాణికులను వచ్చినట్టు బస్సుల్లో ఎక్కించడంతో సమస్య పరిష్కారమయింది. 

Updated Date - 2020-10-27T10:00:16+05:30 IST