కన్నుల పండువగా తెప్పోత్సవం

ABN , First Publish Date - 2020-10-27T09:51:43+05:30 IST

దసరా ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం సాయంత్రం గంగా సమేత దుర్గామల్లేశ్వరస్వామివార్ల తెప్పోత్సవం కన్నులపండువగా సాగింది.

కన్నుల పండువగా తెప్పోత్సవం

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : దసరా ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం సాయంత్రం గంగా సమేత దుర్గామల్లేశ్వరస్వామివార్ల తెప్పోత్సవం కన్నులపండువగా సాగింది. ఇంద్రకీలాద్రి నుంచి ఉత్సవ మూర్తులను మేళతాళాలు, మహిళల కోలాటాలు, కేరళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా కృష్ణానది వద్దకు తీసుకువచ్చి, దుర్గాఘాట్‌లో సిద్ధంగా ఉంచిన హంస వాహనంలో ఉంచి, పూజలు నిర్వహించారు. కలెక్టరు ఇంతియాజ్‌, విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ శ్రీనివాసులు, జేసీ మాధవీలత, దుర్గగుడి ఈవో ఎం.వి.సురేశ్‌బాబు తదితరులు సతీసమేతంగా తెప్పోత్సవంలో పాల్గొన్నారు.


ఏటా ఉత్సవాల ముగింపు రోజు దేవేరులతో కలిసి మల్లేశ్వరస్వామి కృష్ణానదిలో హంస వాహనంపై ముమ్మారు జలవిహారం చేయడం ఆనవాయుతీ. అయితే ఈ ఏడాది వరద పోటెత్తుతుండటంతో ఉత్సవమూర్తుల జలవిహారానికి అధికారులు అనుమతించలేదు. దీంతో ఘాట్‌ వద్దనే హంస వాహనాన్ని నదిలో నిలిపి, గంగా సమేత దుర్గామల్లేశ్వరులకు వేదపండితులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలిచ్చారు. తెప్పోత్సవం అనంతరం వన్‌టౌన్‌ పోలీసుల ఆధ్వర్యంలో మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, సాంస్కృతిక కార్యక్రమాల నడుమ ఉత్సవమూర్తులను రాత్రంతా పాతబస్తీలో ఊరేగించారు. సోమవారం సూర్యోదయానికి ముందే ఉత్సవమూర్తులను తిరిగి ఇంద్రకీలాద్రికి తీసుకువచ్చారు. 


 కొనసాగుతున్న ఉత్సవశోభ 

దసరా ఉత్సవాలు ముగిసినా ఇంద్రకీలాద్రిపై ఉత్సవ శోభ కొనసాగుతూనే ఉంది. సోమవారం కూడా అమ్మవారు రాజరాజేశ్వరీదేవి అలంకారంలోనే భక్తులకు దర్శనమిచ్చారు. భవానీ దీక్ష చేపట్టిన భక్తులు భారీసంఖ్యలో తరలి రావడంతో ఇంద్రకీలాద్రి పరిసరాలు ఎరుపెక్కాయి. దాదాపు 40 వేల మంది భవానీ భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు రాగా.. ఎక్కువమంది ఇరుముడులు తీసుకుని తిరిగివెళ్లారు. 

Updated Date - 2020-10-27T09:51:43+05:30 IST