Abn logo
Oct 2 2020 @ 03:00AM

నేటి నుంచి సందర్శకుల కోసం బాపూ మ్యూజియం

 విజయవాడ, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి) : అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకున్న బాపు మ్యూజియం సందర్శకులకు ద్వారాలు తెరిచింది. గాంధీ జయంతి అయిన శుక్రవారం నుంచి సందర్శకులను అధికారులు అనుమతిస్తారు. రూ.8 కోట్లతో నూతనంగా నిర్మించిన మ్యూజియం భవనాన్ని, అగ్‌మెంటెడ్‌ టెక్నాలజీతో అనుసంధానం చేసిన గ్యాలరీలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి గురువారం ప్రారంభించారు. తొలుత పింగళి వెంకయ్య విగ్రహాన్ని పూలమాలలు వేసి నివాళులర్పించారు.


అనంతరం గాంధీజీ చిత్రపటం వద్ద నివాళులర్పించి, నూతన గ్యాలరీలు ఉన్న భవనాన్ని ప్రారంభించారు. కింది అంతస్తులో ఉన్న రెండు గ్యాలరీలను సీఎం సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన కియోస్క్‌లను ఉపయోగించి వివిధ శిలలు, నాణేల వివరాలను తెలుసుకున్నారు. సుమారు 20 నిమిషాలపాటు ఆయన ఇక్కడ ఉన్నారు. పదేళ్లపాటు మ్యూజియం మూసివేసి ఉండడం, కొత్త గ్యాలరీలను ప్రారంభించడంతో ప్రముఖుల సందర్శన జ్ఞాపకాలు ఉండేందుకు కొత్తగా ఒక పుస్తకాన్ని ప్రవేశపెట్టారు.


ఇందులో సీఎం జగన్‌ సంతకం చేశారు. ‘ఇంప్రెస్సివ్‌ కలెక్షన్‌ ఆఫ్‌ ఆర్టికల్స్‌’ అని తన అభిప్రాయాన్ని రాశారు. సీఎం వెంట పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రవాణ శాఖ మంత్రి పేర్ని నాని, పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, వ్యవసాయ శాఖ మంత్రి కె.కన్నబాబు, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, మత్స్యశాఖ మంత్రి సిదిరి అప్పలరాజు, మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, మేకా ప్రతాప్‌, సామినేని ఉదయభాను, జోగి రమేష్‌, కొలుసు పార్థసారథి, పురావస్తు శాఖ కమిషనర్‌ డాక్టర్‌ జి.వాణీమోహన్‌, కలెక్టర్‌ ఇంతియాజ్‌, జాయింట్‌ కలెక్టర్‌ మాధవీలత తదితరులు ఉన్నారు. 


 పెద్దలకు రూ.50, పిల్లలకు రూ.30

 సందర్శకులను అనుమతించడానికి సిద్ధమైన అధికారులు పెద్దలకు రూ.50, పిల్లలకు రూ.30 చొప్పున టికెట్‌ ధర నిర్ణయించారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు మ్యూజియం తెరచి ఉంటుంది. సందర్శకులు ఆండ్రాయిడ్‌లో బాపు మ్యూజియం యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

Advertisement
Advertisement