424 మందికి కరోనా

ABN , First Publish Date - 2020-10-02T08:33:33+05:30 IST

జిల్లాలో కరోనా ఉధృతి చాపకింద నీరులా కొనసాగుతూనే ఉంది. గురువారం కొత్తగా 424 మందికి వైరస్‌ సోకింది.

424 మందికి కరోనా

 మరో ఆరుగురు బాధితులు మృతి 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ): 

జిల్లాలో కరోనా ఉధృతి చాపకింద నీరులా కొనసాగుతూనే ఉంది. గురువారం కొత్తగా 424 మందికి వైరస్‌ సోకింది. కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల్లో 400 మంది గడచిన 24 గంటల్లో వ్యాధి నుంచి కోలుకుని, ఇళ్లకు చేరుకున్నారు. మరో ఆరుగురు బాధితులు మరణించారు. కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసులు 27,852కు చేరాయి.


కరోనా మరణాలు అధికారికంగా 446కి పెరిగాయి. ఇంకా 2,712 మంది బాధితులు కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. జిల్లావ్యాప్తంగా పల్లెల్లోనే కరోనా కేసులు పెరుగుతుండటంతో జిల్లా అధికారులు వైరస్‌ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఇప్పటికే అనేక గ్రామాల్లో కంటైన్మెంట్‌ జోన్లు ఏర్పాటు చేసి, కొవిడ్‌ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. అయినా వైరస్‌ వ్యాప్తి అదుపులోకి రాకపోగా, రోజురోజుకూ పాజిటివ్‌ కేసులు, కరోనా మరణాలు పెరుగుతుండటం ఆందోళనకలిగిస్తోంది.


జిల్లాలో మరో ఐదు కంటైన్మెంట్‌ జోన్లు

విజయవాడ సిటీ : జిల్లాలో కొత్తగా మరో ఐదు కంటైన్మెంట్‌ జోన్లను కలెక్టర్‌ ఇంతియాజ్‌ ప్రకటించారు. కంచికచర్ల మండలంలోని మున్నలూరు, గూడూరు మండలంలోని తరకటూరు, తిరువూరు మండలంలోని పెద్దవరం, ఘంటసాల మండలంలోని శ్రీకాకుళం, మండవల్లి మండలంలోని చవలిపాడు గ్రామాల్లో కొత్తగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో ఈ ప్రాంతాల్లో కంటైన్మెంట్‌ నిబంధనలను ఖచ్చింతగా అమలు చేయనున్నట్టు తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 521 కంటైన్మెంట్‌ జోన్లలో 2712 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని కలెక్టర్‌ పేర్కొన్నారు.

Updated Date - 2020-10-02T08:33:33+05:30 IST