మళ్లీ టీడీపీ జెండా ఎగరేద్దాం

ABN , First Publish Date - 2020-10-02T08:38:42+05:30 IST

వైసీపీ ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ఎండగట్టేందుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలందరూ కదలి రావాలని మాజీ ఎంపీ, మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు పిలుపునిచ్చారు.

మళ్లీ టీడీపీ జెండా ఎగరేద్దాం

మచిలీపట్నం టౌన్‌, అక్టోబరు 1 : వైసీపీ ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ఎండగట్టేందుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలందరూ కదలి రావాలని మాజీ ఎంపీ, మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు పిలుపునిచ్చారు. గురువారం ఆయన మచిలీపట్నంలోని ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి, శంఖం పూరించి తన ప్రచార యాత్రను ప్రారంభించారు.


ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి ఇప్పటి నుంచే కృషి చేయాలన్నారు. మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ జెండా ఎగరవేయడానికి పార్టీ శ్రేణులందరూ కలసికట్టుగా పనిచేయాలన్నారు. బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చే ఏకైక పార్టీ తెలుగుదేశమేనన్నారు. ఎమ్మెల్సీ అర్జునుడు సమర్ధతను గుర్తించే పార్టీ అధిష్ఠానం అర్జునుడుకు గన్నవరం బాధ్యతలు అప్పగించిందన్నారు.


గన్నవరం నియోజకవర్గంలో గెలిచిన నాయకుడు వెళ్ళిపోయినా, కార్యకర్తలు మాత్రం పార్టీకి అండగానే ఉన్నారన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా గన్నవరం నుంచి కాబోయే ఎమ్మెల్యే బచ్చుల అర్జునుడే అన్నారు. ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ కొనకళ్ల నాయకత్వంలో గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ జెండా మరలా ఎగురవేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. తనపై నమ్మకం ఉంచి చంద్రబాబు గన్నవరం నియోజకవర్గ బాధ్యతలను అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.


ఈ కార్యక్రమంలో మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ మోటమర్రి బాబాప్రసాద్‌, మునిసిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ పంచపర్వాల కాశీవిశ్వనాథం, మాజీ కౌన్సిలర్‌ కొట్టె వెంకట్రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ గొర్రెపాటి గోపీచంద్‌, టీడీపీ జిల్లా కార్యదర్శి ఫణికుమార్‌, పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఇలియాస్‌ పాషా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుల్తానగరం ఆంజనేయస్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

Updated Date - 2020-10-02T08:38:42+05:30 IST