ముందే తెలిసి.. పనులు నిలిపి..!

ABN , First Publish Date - 2020-10-01T07:59:18+05:30 IST

పాతరావిచర్లలో క్వారీ అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. వీటిని పరిశీలించేందుకు సబ్‌కలెక్టర్‌ వస్తున్నారనే సమాచారం అందడంతో క్వారీ నిర్వాహకులు ముందస్తుగా పనులు నిలిపివేశారు.

ముందే తెలిసి.. పనులు నిలిపి..!

పాతరావిచర్లలో క్వారీ అక్రమాల

పరిశీలనకు వెళ్లిన సబ్‌కలెక్టర్‌

 సమాచారం తెలిసి పనులు ఆపేసిన నిర్వాహకులు

 వాహనాల తరలింపు

 ఆంఽధ్రజ్యోతి కథనానికి స్పందన


 (నూజివీడు రూరల్‌, సెప్టెంబరు 30):

పాతరావిచర్లలో క్వారీ అక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి. వీటిని పరిశీలించేందుకు సబ్‌కలెక్టర్‌ వస్తున్నారనే సమాచారం అందడంతో క్వారీ నిర్వాహకులు ముందస్తుగా పనులు నిలిపివేశారు. అప్పటికే లోడ్‌ చేసిన గ్రావెల్‌ను రోడ్డు  పక్కన వదిలేసి వాహనాలను తరలించి తప్పుకున్నారు. ఈ నెల 28వ తేదీన ‘తరుగుతున్న కొండలు’ శీర్షికన ఆంధ్రజ్యోతిలో  కథనం ప్రచురణ అయిన సంగతి తెలిసిందే.


దీనికి స్పందించిన నూజివీడు సబ్‌ కలెక్టర్‌ బుధవారం పాతరావిచర్ల గ్రామంలోని క్వారీని పరిశీలిం చేందుకు బయలుదేరారు. ఈ సమాచారం తెలీడంతో క్వారీ నిర్వాహకులు పనులను నిలిపివేశారు. ఉదయం 11.30 గంటలకు సబ్‌ కలెక్టర్‌ క్వారీ వద్దకు వస్తున్నారని రెవెన్యూ సిబ్బంది, క్వారీ ప్రాంతానికి వెళ్లే రహదారి వద్ద వేచి ఉన్నారు. ఈ సమయంలో క్వారీ వద్ద గ్రావెల్‌ లోడ్‌తో ఉన్న టిప్పర్‌, ట్రాక్టర్లకు సిద్ధంగా ఉన్నాయి. రెవెన్యూ సిబ్బంది రాకను గమనించిన క్వారీ నిర్వాహకులు విజయవాడ ప్రధాన రహదారికి కొంత దూరంలో క్వారీకి వెళ్లే రహదారి పక్కనే గ్రావెల్‌ను వదిలేసి వాహనాలను మరో వైపునకు తరలించారు.


మరో రెండు ట్రాక్టర్ల గ్రావెల్‌ను సైతం క్వారీ నిర్వాహకులు వారి ఆఫీసుకు పక్కనే వదిలి ట్రాక్టర్లను పంపించి వేశారు. 


అనుమతులు ఉంటే పనులెందుకు ఆపారు?

క్వారీ నిర్వాహకులకు అనుమతులుంటే పనులను నిలిపి వేయాల్సిన ఆవసరం ఏమిటనేది ప్రశ్నగా ఉంది. సోమవారం తహసీల్దార్‌  సురేష్‌కుమార్‌ క్వారీని పరిశీలించిన సమయంలో కూడా నిర్వాహకులు పనులను నిలిపివేశారని, క్వారీ ప్రాంతంలో సమాధానం చెప్పడానికి కూడా ఎవరూ అందుబాటులో లేరని ఆయన చెప్పారు.


బుధవారం నూజివీడు సబ్‌కలెక్టర్‌ తనిఖీ చేయడానికి వస్తున్నారని తెలియడంతో ఎక్స్‌కవేటర్‌ను, ఇతర వాహనాలను వేరే ప్రాంతానికి తరలించడంతో పాటుగా నిర్వాహకులు క్వారీ పనులు నిలిపివేసి ఆ ప్రాంతంలో ఎవరూ అందుబాటులో లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. 


కొండ ప్రాంతం కూడా ఆక్రమణకు సిద్ధం

క్వారీ నిర్వహణ ప్రాంతంలోనే (సర్వేనంబరు 20) 5 ఎకరాలకుపైగా కొండ ప్రాంతాన్ని ఆక్రమించేందుకు అక్రమార్కులు సిద్ధమయ్యారు. ఈ ప్రాంతంలో మొక్కలను తొలగించారు. వ్యవసాయ అవసరాల నిమిత్తమో, లేదా గ్రావెల్‌ తవ్వకాలకో అధికారుల విచారణలోనే తేలాలి. ఇక్కడ మరో విచిత్రం ఏమిటంటే క్వారీ జరుగుతున్న ప్రాంతానికి చుట్టుపక్కల వ్యవసాయ భూములు క్వారీ నిర్వాహకులవే కావండంతో, ఈ భూముల్లో   గ్రావెల్‌ తవ్వుతూ అధికారులను బురిడీ కొట్టిస్తున్నారనే ఆపరోణలున్నాయి. 


విజిలెన్స్‌ విచారణ చేపట్టాలి

పాతరావిచర్లలో జరుగుతున్న క్వారీకి అనుమతులు ఎప్పటివరకు ఉన్నాయి? ఎంతమేరకు గ్రావెల్‌ను తవ్వుకోవచ్చు? నిబంధనలను నిర్వాహకులు ఉల్లంఘించారా? గ్రావెల్‌ తరలింపునకు సంబంధించి ప్రభుత్వానికి చెల్లించాల్సిన రుసుం క్వారీ నిర్వాహకులు చెల్లించారా? లేదా? అన్న విషయాలు తెలియాలంటే మైనింగ్‌, విజిలెన్స్‌ అధికారులు విచారణ చేపట్టాలి.

                     ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే 

Updated Date - 2020-10-01T07:59:18+05:30 IST