ఎవరి కోసం?

ABN , First Publish Date - 2020-10-01T07:54:35+05:30 IST

ఇంద్రకీలాద్రిపై ఈ నెల 17 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించనున్న..

ఎవరి కోసం?

దసరా ఉత్సవ ఏర్పాట్లపై విమర్శలు

దర్శనం 10వేల మందికి.. ఏర్పాట్లు లక్ష మందికి!

 కరోనా కాలంలో ఇంత ఆర్భాటమా!

 మంత్రి అనుచరులకు పనులు కట్టబెట్టేందుకేనా?

 రూ.కోటికి పైగా దోపిడీకి వ్యూహం!

 దుర్గగుడి ఈవో మంత్రి భక్తి!


(ఆంధ్రజ్యోతి, విజయవాడ): ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తుల కోసమా? మంత్రి అనుచరులకు పనులు కట్టబెట్టేందుకా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అతి పెద్ద దేవాలయమైన టీటీడీ శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించగా, కరోనా కాలంలో ఇక్కడ ఉత్సవాలకు పదివేల మంది భక్తులను అనుమతించడం, ఏర్పాట్లను లక్ష మందికి సరిపడా అట్టహాసంగా చేయాలని నిర్ణయించడం విమర్శలకు తావిస్తోంది. అమ్మవారి సొమ్మును విచ్చలవిడిగా ఖర్చు చేసి, కమీషన్ల రూపంలో కాజేసేందుకే ఈ హడావిడి అని, దసరాకు పిలిచే టెండర్లన్నీ మంత్రి అనుచరులకు కట్టబెట్టేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 


ఇంద్రకీలాద్రిపై ఈ నెల 17 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించనున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ముసుగులో అమ్మవారి సొమ్ము దోపిడీకి తెర లేచింది. కరోనా నేపథ్యంలో కొవిడ్‌ నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తూ రోజుకు పది వేల మందికి మాత్రమే అమ్మవారి దర్శనం కల్పిస్తామని చెబుతున్న దుర్గగుడి అధికారులు అందుకనుగుణంగా ఉత్సవాల ఏర్పాట్లను తగ్గించకుండా, గతంలో మాదిరిగానే లక్ష మందికి సరిపడా అట్టహాసంగా చేస్తున్నారు. దేవదాయశాఖ మంత్రి ఆదేశాల మేరకు కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూనే దసరా ఉత్సవాల్లో అమ్మవారి వైభవం ఏమాత్రం తగ్గకుండా ఉండేలా ఏర్పాట్లు చేయాలని దేవస్థానం ఈవో ఎం.వి.సురేశ్‌బాబు మంగళవారం నిర్వహించిన సమావేశంలో దేవస్థానానికి చెందిన వివిధ విభాగాల అధికారులు, సిబ్బందిని ఆదేశించి మంత్రిగారిపై ఆయనకున్న భక్తిని మరోసారి చాటుకున్నారు.


దీంతో అమ్మవారి సొమ్మును ఉత్సవాల పేరుతో విచ్చలవిడిగా ఖర్చు చేసి కమీషన్ల రూపంలో కాజేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ ఏర్పాట్ల పేరుతో దాదాపు కోటి రూపాయలకుపైగా దోపిడీకి రంగం సిద్ధం చేసినట్లు దుర్గగుడిలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రతి ఏటా దసరా ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకునేందుకు దాదాపు పది లక్షల మందికి పైగా భక్తులు తరలివస్తారు. ఈ ఏడాది కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ టైమ్‌ స్లాట్‌ ప్రకారం రోజుకు పది వేల మందికి మాత్రమే అమ్మవారి దర్శనం కల్పిస్తామని దుర్గగుడి అధికారులు చెబుతున్నారు. ఆ మేరకు గత నెల 18 నుంచి ఆన్‌లైన్‌లో దర్శనం టికెట్లు కూడా విక్రయిస్తున్నారు.


ఆన్‌లైన్‌ టికెట్టు పొందినవారిని మాత్రమే అమ్మవారి దర్శనానికి అనుమతిస్తామని స్పష్టం చేస్తున్నారు. ఈ లెక్కన దసరా తొమ్మిది రోజుల్లో 90 వేల మంది భక్తులు మాత్రమే అమ్మవారిని దర్శించుకుంటారు. గత ఏడాది దసరా ఉత్సవాల పది రోజుల్లో 12 లక్షల మంది భక్తులు తరలివచ్చారు. వారిలో పదో వంతు భక్తులు కూడా వచ్చే అవకాశం లేదు. ఈ లెక్క ప్రకారం ఉత్సవ ఏర్పాట్ల ఖర్చు కూడా తగ్గించాల్సి ఉండగా, దుర్గగుడి అధికారులు ఏర్పాట్ల విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. రోజుకు లక్షమంది భక్తులు వచ్చినప్పుడు చేసినట్టే ఇప్పుడు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. కెనాల్‌ రోడ్డులోని వినాయకుడి గుడి వద్ద నుంచి, అటు కుమ్మరిపాలెం వైపు నుంచి కొండపైకి క్యూలైన్లు, షామియానాలు, పబ్లిక్‌ మైక్‌ అనౌన్స్‌మెంట్‌ ఏర్పాట్లన్నీ యథావిధిగానే చేయాలని నిర్ణయించారు.


ఉత్సవాల్లో బందోబస్తుకు వచ్చే పోలీసులు, రెవెన్యూ, ఇరిగేషన్‌, నగరపాలక సంస్థ సిబ్బందికి, వివిధ దేవాలయాల నుంచి వచ్చే డిప్యూటేషన్‌ సిబ్బందికి అయ్యే ఖర్చులు కూడా దేవస్థానం నిధుల నుంచే వెచ్చిస్తారు. భోజనాలు, పూల అలంకరణ, లైటింగ్‌ తదితర ఏర్పాట్లకు టెండర్లను పిలిచారు. ఈ టెండర్లను బినామీ పేర్లతో మంత్రి అనుచరులకే కట్టబెట్టేలా దుర్గగుడి అధికారులు ఇప్పటికే వ్యూహాన్ని సిద్ధం చేసినట్లు ఇంద్రకీలాద్రిపై బాహాటంగానే చర్చించుకుంటున్నారు. 


కరోనా కాలంలో రిస్క్‌ అవసరమా?

కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో టీటీడీ సైతం శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భక్తులను అనుమతించకుండా ఈ ఏడాది ఏకాంతంగానే నిర్వహించింది. అయినా అక్కడ వందల మంది దేవస్థానం ఉద్యోగులు, భక్తులు కరోనా బారిన పడ్డారు. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలకు కూడా భక్తులు దాదాపు అంతే ప్రాధాన్యమిస్తారు. దసరా ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకోవడం కోసం ప్రతి ఏటా రోజుకు లక్ష మందికి పైగానే తరలివస్తారు. ఈ ఏడాది కరోనా కారణంగా రోజుకు పది వేలమందినే అనుమతిస్తామని అధికారులు చెబుతున్నారు. 


వీఐపీలు, ఉభయదాతలు, పాలక మండలి సభ్యులు, రాజకీయ ప్రముఖులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, న్యాయమూర్తులు, వారి సిఫార్సులతో వచ్చేవారు.. ఇలా లెక్కలేసుకుంటే ప్రతి రోజూ 20వేల మందికి తక్కువ ఉండరనేది అంచనా. వీరందరినీ నియంత్రించే శక్తి దుర్గగుడి అధికారులకు ఉందా? అనేది ప్రశ్న. పైగా ప్రస్తుత పరిస్థితుల్లో అంత భారీ సంఖ్యలో జనం కొండ మీద గుమిగూడితే కరోనా మహమ్మారి మరింత విజృంభిస్తుందనడంలో సందేహం లేదు.


పైగా వచ్చేది శీతాకాలం కావడంతో హృద్రోగాలు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడేవారు ఎక్కువగా ఇబ్బందులు పడతారు. అలాంటివారికి వైరస్‌ సోకితే ప్రాణాలకే ప్రమాదమని వైద్యనిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ ఆలయాల్లో దర్శనాలను మాత్రమే పునరుద్ధరించుకో వచ్చునని అన్‌లాక్‌ 0.4లో పేర్కొంది. తాజాగా బుధవారం రాత్రి విడుదల చేసిన అన్‌లాక్‌ 0.5 మార్గదర్శకాల్లో కూడా దేవాలయాలకు సంబంధించి దాదాపు అవే మార్గదర్శకాలను కొనసాగించింది. 


రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన ఉత్సవాలు, ఇతర కార్యక్రమాలను ఇండోర్‌లో హాలు సామర్థ్యాన్ని బట్టి 200 మందికి మించకుండా మాత్రమే అనుమతించాలని కేంద్రం తాజా మార్గదర్శకాల్లో పేర్కొంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతుల పరిశుభ్రత తదితర కొవిడ్‌ నిబంధనలను పాటించాలని ఆదేశించింది. దసరా ఉత్సవాల్లో భక్తులను క్యూలైన్లలో దర్శనానికి అనుమతించినా గుడి లోపల లైన్లు ఇరుకుగానే ఉంటాయి.


వాటిలో భౌతిక దూరం పాటిస్తూ అమ్మవారిని దర్శించుకున్నా భక్తులు ఆ క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని, అంతసేపు అక్కడ ఉంటే కరోనా వ్యాపించే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనా విపత్తును లెక్కచేయకుండా దుర్గగుడి అధికారులు కమీషన్ల కోసమే ఉత్సవాలకు అట్టహాసంగా ఏర్పాట్లను చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

Updated Date - 2020-10-01T07:54:35+05:30 IST