Bypoll results 2022 : త్రిపుర సీఎం మాణిక్ సాహా భవితవ్యం తేలేది నేడే

ABN , First Publish Date - 2022-06-26T15:48:54+05:30 IST

మూడు లోక్‌సభ స్థానాలకు, ఏడు శాసన సభ నియోజకవర్గాలకు

Bypoll results 2022 : త్రిపుర సీఎం మాణిక్ సాహా భవితవ్యం తేలేది నేడే

న్యూఢిల్లీ : మూడు లోక్‌సభ స్థానాలకు, ఏడు శాసన సభ నియోజకవర్గాలకు జూన్ 23న జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆదివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం)లలో ఓట్లను లెక్కిస్తున్నారు. త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా ఆ పదవిలో కొనసాగాలంటే ఈ ఉప ఎన్నికల్లో తప్పనిసరిగా గెలవలసిందే. ఓటరు మహాశయుల తీర్పు ఏ విధంగా ఉంటుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.


త్రిపురలో అగర్తల, టౌన్ బర్డోవాలి, సుర్మ, జుబ్రాజ్ నగర్ శాసన సభ స్థానాలకు జూన్ 23న ఉప ఎన్నికలు జరిగాయి. మొత్తం మీద 78.58 శాతం ఓట్లు పోలయ్యాయి. టౌన్ బర్డోవాలి నుంచి ముఖ్యమంత్రి మాణిక్ సాహా బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రి పదవిలో కొనసాగాలంటే ఈ ఎన్నికలో తప్పనిసరిగా గెలిచి తీరాలి. దీంతో ఈ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బీజేపీ నేత బిప్లబ్ దేబ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత మాణిక్ సాహా ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన సంగతి తెలిసిందే.


సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్, ఆ పార్టీ నేత ఆజం ఖాన్ లోక్‌సభ సభ్యత్వాలకు రాజీనామా చేసి, శాసన సభ ఎన్నికల్లో పోటీ చేయడంతో ఉత్తర ప్రదేశ్‌లోని ఆజంగఢ్, రామ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ రెండు నియోజకవర్గాలు ఆ పార్టీకి కంచుకోటల వంటివి. పంజాబ్‌లోని సంగ్రూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్నికైన భగవంత్ మాన్ రాజీనామా చేసి, శాసన సభ ఎన్నికల్లో పోటీ చేశారు. దీంతో సంగ్రూర్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. 


ఉత్తర ప్రదేశ్‌లో జరుగుతున్న లోక్‌సభ ఉప ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రామ్‌పూర్, ఆజంగఢ్ లోక్‌సభ స్థానాలు సమాజ్‌వాదీ పార్టీకి కంచుకోటలు కావడంతో అందరి కళ్ళు అటువైపే చూస్తున్నాయి. రామ్‌పూర్ నుంచి బీజేపీ అభ్యర్థిగా ఘనశ్యామ్ సింగ్ లోఢీ, సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిగా అసీం రజా పోటీ చేస్తున్నారు. ఈ స్థానం నుంచి బీఎస్‌పీ పోటీ చేయడం లేదు. ఆజంగఢ్ లోక్‌సభ స్థానం నుంచి దినేశ్ లాల్ యాదవ్ ‘నిర్హువా’ (బీజేపీ), ధర్మేంద్ర యాదవ్ (ఎస్‌పీ), షా ఆలం (బీఎస్‌పీ) పోటీ చేస్తున్నారు. 


ఆదివారం ఉదయం 9.36 గంటలకు అందిన సమాచారం ప్రకారం, సంగ్రూర్ లోక్‌సభ నియోజకవర్గంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అభ్యర్థి గుర్మయిల సింగ్ కాస్త వెనుకంజలో ఉన్నారు. ఆయనకు 46,973 ఓట్లు లభించగా, ఆయన సమీప ప్రత్యర్థి, ఎస్ఏడీ (అమృత్‌సర్) అభ్యర్థి సిమ్రన్‌జిత్ సింగ్ మాన్‌కు 47,083 ఓట్లు లభించాయి. కాంగ్రెస్ అభ్యర్థి దల్బీర్ సింగ్ గోల్డీకి 3,446 ఓట్లు, ఎస్ఏడీ (బాదల్) అభ్యర్థి కమల్‌దీప్ కౌర్‌కు 1,587 ఓట్లు, బీజేపీ అభ్యర్థి కేవల్ సింగ్ ధిల్లాన్‌కు 3,529 ఓట్లు లభించాయి. శాసన సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీకి ఈ ఉప ఎన్నికలు ఓ పరీక్షగా నిలిచాయి. 


ఢిల్లీలోని రాజిందర్ నగర్ శాసన సభ స్థానానికి కూడా జూన్ 23న ఉప ఎన్నికల పోలింగ్ జరిగింది. ఇక్కడి నుంచి ఆప్ అభ్యర్థి దుర్గేశ్ పాఠక్, బీజేపీ అభ్యర్థి రాజేశ్ భాటియా పోటీ చేస్తున్నారు. 


జార్ఖండ్‌లోని మందర్ శాసన సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో జేఎంఎం నేతృత్వంలోని కూటమి అభ్యర్థిగా శిల్పి నేహా టిర్కే, బీజేపీ అభ్యర్థిగా గంగోత్రి కుజుర్ పోటీ చేస్తున్నారు. శిల్పి నేహా తండ్రి బంధు టిర్కే ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అంతకుముందు గెలిచారు. అయితే ఆయన అవినీతి కేసులో దోషిగా నిర్థరణ కావడంతో అనర్హతకు గురయ్యారు. దీంతో ఈ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అవసరమైంది. 


ఆంధ్ర ప్రదేశ్‌లోని ఆత్మకూరు శాసన సభ నియోజకవర్గానికి కూడా జూన్ 23న ఉప ఎన్నికల పోలింగ్ జరిగింది. ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే, మాజీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మరణించడంతో ఉప ఎన్నిక అవసరమైంది. ఆయన సోదరుడు విక్రమ్ రెడ్డి వైకాపా అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షం తెదేపా ఈ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. బీజేపీ అభ్యర్థిగా భరత్ కుమార్, బీఎస్‌పీ అభ్యర్థిగా ఓబులేసు పోటీ చేస్తున్నారు. ప్రారంభంలో వైకాపా అభ్యర్థి ఆధిక్యంలో ఉన్నారు. 


Updated Date - 2022-06-26T15:48:54+05:30 IST