బైపాస్‌లోకి వెళ్లేదెలా..!

ABN , First Publish Date - 2022-05-16T06:28:52+05:30 IST

బైపాస్‌లోకి వెళ్లేదెలా..!

బైపాస్‌లోకి వెళ్లేదెలా..!
నున్న బైపాస్‌ రోడ్డులోకి తిరిగే చోట మట్టి గుట్టలు ఉండటంతో అతి కష్టం మీద మలుపు తిరుగుతున్న ఆర్టీసీ బస్సు

ఫ నడిరోడ్డుపై మట్టి గుట్టలు

ఫ కనెక్టింగ్‌ రోడ్డు నిర్మాణంపై నిర్లక్ష్యం

ఫ మలుపు తిరిగేందుకు నానా కష్టాలు

ఫ నున్నలో పెరుగుతున్న ట్రాఫిక్‌ 

ఫ కన్నెత్తి చూడని ఆర్‌ అండ్‌ బీ అధికారులు

విజయవాడ రూరల్‌, మే 15 : ఒకటి కాదు రెండు కాదు రూ.10.50 కోట్ల ఖర్చుతో నున్న బైపాస్‌ రోడ్డు నిర్మాణం చేపట్టారు. అయినా నేటికీ ఆ రోడ్డు నిర్మాణం పూర్తిస్థాయిలో జరగలేదు.   రైతుల నుంచి భూ సేకరణకు బాగానే ఖర్చయింది. మధ్యలో కొన్నాళ్లపాటు బైపాస్‌ రోడ్డుపై నుంచి హైటెన్షన్‌ లైన్‌ వెళుతుందనే సాకుతో ఐదారేళ్లపాటు ఆ  రోడ్డు రాకపోకలు సాగలేదు. ఆ సమస్య పరిష్కారమైనా, విజయవాడ - నూజివీడు ఆర్‌ అండ్‌ బీ రోడ్డుకు కనెక్టింగ్‌ (అనుసంధానం) చేసే పనులు ఏళ్ల తరబడి జాప్యం జరుగుతున్నాయి. ఫలితంగా బైపాస్‌ మీదగా వెళ్లాల్సిన భారీ వాహనాలన్నీ నున్న  లో నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి. దీనివల్ల నిత్యం గ్రామంలో ట్రాఫిక్‌ సమస్య తలెత్తుతోంది.  విజయవాడ నుంచి నూజివీడు వైపు వెళ్లే వాహనాలు స్థానిక మ్యాంగో మార్కెట్‌ సమీపంలో బైపాస్‌ రోడ్డులోకి వెళ్లి, మళ్లీ రామచంద్రాపురం క్రాస్‌ రోడ్డు వద్ద నూజివీడు రోడ్డులో కలవాలి. అలాగే నూజివీడు నుంచి విజయవాడ వచ్చే వాహనాలను నున్న బైపాస్‌లోకి మళ్లించి మ్యాంగో మార్కెట్‌ వద్ద నూజివీడు రోడ్డుకు చేరాలి. మ్యాంగో మార్కెట్‌ వద్ద బైపాస్‌కు నూజివీడు రోడ్డును కనెక్ట్‌ చేసే పనులు రెండేళ్ల క్రితమే పూర్తికావాల్సి ఉంది. ఆర్‌ అండ్‌ బీ, విద్యుత్‌, ట్రాఫిక్‌ పోలీసులు ఆ ప్రాంతాన్ని జాయింట్‌గా పరిశీలించారు. మ్యాంగో మార్కెట్‌ వద్ద సర్కిల్‌ నిర్మించాలని ప్రతిపాదించారు. కానీ, ఆర్‌ అండ్‌ బీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఆ పనులు ఒక్క అడుగు కూడా ముందుకు సాగడంలేదు. అయినప్పటికీ, బస్సులు, భారీ వాహనాలు బైపాస్‌ మీదగా రాకపోకలు సాగిస్తుండటంతో నూజివీడు రోడ్డు మధ్యలో భారీ గుంతలు ఏర్పడ్డాయి. ఆ గుంతలను పూడ్చేందుకు స్థానికులు కొందరు అందులో మట్టి పోశారు. అయితే వాటిని పూడ్చకపోవడంతో, వాహనాలను బైపాస్‌లోకి తిప్పాలంటే డ్రైవర్లు అష్టకష్టాలు పడుతున్నారు. దీనివల్ల ప్రమాదాలు జరుగుతాయేమోన్న ఆందోళనను వాహనదారులు వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ఎందుకొచ్చిందిలే అనుకునే మరికొందరు ఏకంగా గ్రామంలో నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. వేసవి సీజన్‌ కావడంతో మామిడికాయల ట్రాక్టర్లు, భారీ లారీలుసైతం నున్నలో నుంచే రాకపోకలు సాగిస్తుండటంతో కోటకట్ట సెంటర్‌, సీఎస్‌ఐ చర్చి, చెరువు సెంటర్‌లో భారీగా ట్రాఫిక్‌ స్తంభిస్తోంది. ఇంత జరుగుతున్నా, ట్రాఫిక్‌ పోలీసులు ఏమ్రాతం పట్టించుకోవడంలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసలు నున్న బైపాస్‌ను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తెచ్చేందుకు ఆర్‌ అండ్‌ బీ అధికారులు పట్టించుకోకోవడం వల్లే ఇన్ని సమస్యలని విమర్శిస్తున్నారు. గ్రామంలో ట్రాపిక్‌ సమస్య తగ్గుతుందనే ఉద్దేశంతోనే బైపాస్‌కు భూములిచ్చామని, రోడ్డు నిర్మాణం పూర్త యినా, చిన్న చిన్న పనులను పెండింగ్‌ పెడుతూ తమను ఇబ్బంది పెడితే ఎలాగని ప్రశ్నిస్తున్నారు. ఇప్ప టికైనా అధికారులు స్పందించి బైపాస్‌ కనెక్టింగ్‌ పనులను త్వరగా పూర్తిచేయాలని, లేనిపక్షంలో ఆందోళనకు దిగుతామని స్థానికులు హెచ్చరిస్తున్నారు.  

Updated Date - 2022-05-16T06:28:52+05:30 IST