బైపాస్‌ అడ్డాగా ఖాకీల వసూళ్ల పర్వం

ABN , First Publish Date - 2021-12-20T06:28:23+05:30 IST

వాణిజ్య, వ్యాపార రంగాలు విస్తరించి ఉన్న మిర్యాలగూడ పట్టణం నుంచి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు నిత్యం వందలాది వాహనాల రాకపోకలు కొనసాగుతుంటాయి. రెండు రాష్ట్రాలను కలుపుతూ అద్దంకి-నార్కట్‌పల్లి బైపా్‌సరోడ్డు పట్టణం నుంచి వెళ్తుండగా, ఇది కొందరు ఖాకీలకు అక్రమవసూళ్ల అడ్డాగా మారింది.

బైపాస్‌ అడ్డాగా ఖాకీల వసూళ్ల పర్వం

సంతరోజు హోంగార్డుల హల్‌చల్‌

ఆదివారం వస్తే రోడ్డుపైనే గస్తీ

వాహనదారులతో చిల్లరబేరం

మిర్యాలగూడ అర్బన్‌, డిసెంబరు 19: వాణిజ్య, వ్యాపార రంగాలు విస్తరించి ఉన్న మిర్యాలగూడ పట్టణం నుంచి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు నిత్యం వందలాది వాహనాల రాకపోకలు కొనసాగుతుంటాయి. రెండు రాష్ట్రాలను కలుపుతూ అద్దంకి-నార్కట్‌పల్లి బైపా్‌సరోడ్డు పట్టణం నుంచి వెళ్తుండగా, ఇది కొందరు ఖాకీలకు అక్రమవసూళ్ల అడ్డాగా మారింది. భారీ వాహనాలకు పట్టణంలోకి అనుమతి లేకపోవడంతో సూర్యాపేట, ఏపీ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాల నుంచి నల్లగొండ జిల్లాలోకి వెళ్లే వాహనాలన్నీ బైపా్‌సరోడ్డు మీదుగా ప్రయాణిస్తుంటాయి. అలాగే జిల్లా నుంచి మిర్యాలగూడ మీదుగా ఇతర ప్రాంతాలు వెళ్లే వాహనాలు ఏడుకోట్లతండా వై-జంక్షన్‌ నుంచి బైపా్‌సమీదుగా వెళ్తుంటాయి. రెండు వైపులా వాహనాల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డును కొందరు కానిస్టేబుళ్లు, హోంగార్డులు వారి రోజువారీ ఆదాయ వనరుగా మార్చకున్నట్లుగా పలువురు వాహనదారులు ఆరోపిస్తున్నారు. లారీలు, ట్రక్కులు, మినీ ట్రాన్స్‌పోర్టు వాహనాలను అటకాయించి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

సంతరోజు వసూళ్ల సందడి

మిర్యాలగూడ మండలం అవంతీపురం వద్ద ప్రతీ మంగళ, శనివారాల్లో పశులు, గొర్రెలు, మేకల క్రయవిక్రయాలకు సంత కొనసాగుతోంది. రెండు తెలుగురాష్ట్రాలకు అత్యంత సమీపంలో అవంతీపురం సంత ఉండటంతో పలు ప్రాంతాల నుంచి వ్యాపారులు, పాడిరైతులు, హైదరాబాద్‌ నుంచి మాంసం వ్యాపారులు ఇక్కడికి వచ్చి పశులను ఖరీదుచేసిన వాహనాల్లో తరలిస్తుంటారు. దీంతో ప్రతీ వారం ఈ సంతలో లక్షలాది రూపాయల లావాదేవీలు కొనసాగుతుంటాయి. ఈ రెండు రోజుల్లో కొందరు ఖాకీలు ఈదులగూడ, హనుమాన్‌పేట, నందిపాడు, చింతపల్లి చౌరస్తాల వద్ద మకాం వేసి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. సాధారణ రోజుల్లో కొందరు హోంగార్డులు డ్యూటీ ముగించుకొని ఇంటికి చేరుకునే సందర్భాల్లో బైపా్‌సరోడ్డు వద్ద రాత్రిపొద్దుపోయేంత వరకు గస్తీ నిర్వహిస్తూ వాహనాదారులతో చిల్లరబేరం ఆడుతున్నట్లు ప్రచారంలో ఉంది. వారికి చిక్కిన వాహనదారుడిని రహదారి నిబంధనల ఉల్లంఘన, ఓవర్‌స్పీడ్‌ వంటి కేసుల భయం చెప్పి రూ.100 నుంచి రూ.500 వరకు వసూలు చేస్తున్నట్టు పలువురు వాహనదారులు తెలిపారు. పోలీ్‌సస్టేషన్‌ పరిసరాల్లో కాకుండా ఇతర ప్రాంతాల్లో రోడ్డెక్కి వాహనాలను నిలిపి అక్రమవసూళ్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదంటూ పోలీ్‌సశాఖ ఉన్నతాధికారులు హెచ్చరించినా కొందరి ప్రవర్తనలో మార్పు రావడం లేదు.

కానిస్టేబుల్‌నంటూ హోంగార్డు వసూళ్ల బేరం

సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పోలీ్‌సస్టేషన్‌లో పనిచేస్తున్న ఓ హోంగార్డు ఆదివారం మిర్యాలగూడ పట్టణంలోని హనుమాన్‌పేట వద్ద బైపా్‌సరోడ్డుపై వాహనాలను అటకాయించి అక్రమ వసూళ్లకు దిగాడు. ఈ విషయాన్ని కొందరు సామాజిక కార్యకర్తలు సోషల్‌మీడియాలో పోస్ట్‌చేయగా, ప్రస్తుతం అది వైరల్‌ అవుతోంది. ప్రతీరోజు సాయంత్రం వేళలో ద్విచక్రవాహనంపై వస్తూ ఈ రహదారిపై సివిల్‌ డ్రస్‌లో చక్కర్లుకొడుతూ మినీ ట్రాన్స్‌పోర్ట్‌, అధికలోడ్‌తో వెళ్లే లారీలు, ఇతర వాహనాలను ఆపడం, తాను మిర్యాలగూడ చెందిన కానిస్టేబుల్‌నంటూ బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. హోంగార్డు అక్రమ వసూళ్ల తతంగంపై కొందరు స్థానికులు నేరేడుచర్ల పోలీసులకు సైతం సమాచారమిచ్చి చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిసింది.

కఠిన చర్యలు తీసుకుంటాం : వెంకటేశ్వరరావు, మిర్యాలగూడ డీఎస్పీ

మిర్యాలగూడ వద్ద అద్దంకి-నార్కట్‌పల్లి బైపా్‌సరోడ్డుపై కొందరు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే విషయం మా దృష్టికి రాలేదు. ఎవరైనా వాహనాలను అటకాయించి డబ్బు అడిగితే సమీప స్టేషన్‌హౌస్‌ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేయాలి. ప్రధాన రహదారులపై వెళ్లే వాహనాలను నిలిపి అక్రమవసూళ్లకు పాల్పడితే శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం.

Updated Date - 2021-12-20T06:28:23+05:30 IST