ప్రతిష్టంభన వీడినట్టేనా?

ABN , First Publish Date - 2022-06-29T06:20:50+05:30 IST

బెజవాడ తూర్పు బైపాస్‌ నిర్మాణంపై నెలకొన్న ప్రతిష్టంభనకు చెక్‌పడే సంకేతాలు కనిపిస్తున్నా కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ప్రతిష్టంభన వీడినట్టేనా?

విజయవాడ తూర్పు బైపాస్‌కు కేంద్రం అనుమతి

  లాజిస్టిక్‌ పార్క్‌కు భూములు కేటాయించాలని మెలిక

  80 నుంచి 100 ఎకరాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం 

  వచ్చే నెలలో గడ్కరీ అధ్యక్షతన జాతీయ రోడ్డు ప్రాజెక్టులపై సమావేశం 

   బెజవాడ తూర్పు బైపాస్‌ నిర్మాణంపై నెలకొన్న ప్రతిష్టంభనకు చెక్‌పడే సంకేతాలు కనిపిస్తున్నా కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ప్రాజెక్టుకు కేంద్రం అంగీకరించినప్పటికీ ఆ తర్వాత ఉమ్మడి కృష్ణా జిల్లాలో లాజిస్టిక్‌ హబ్‌ ఏర్పాటుకు కూడా భూములు కేటాయించాలని మెలిక పెట్టడంతో సందిగ్ధం నెలకొంది. లాజిస్టిక్‌ హబ్‌కు 80 నుంచి 100 ఎకరాలు కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. వచ్చే నెలలో జాతీయ స్థాయి ప్రాజెక్టులపై జరిగే సమావేశంలో దీనిపై చర్చ ఉంటుందని తెలుస్తోంది. 

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : లాజిస్టిక్‌ హబ్‌ ప్రాజెక్టు చాలా ఏళ్ల కిందటే ఉమ్మడి కృష్ణా జిల్లాకు మంజూరైంది. దీనికి 80 - 100 ఎకరాల భూములు అవసరమని ఎన్‌హెచ్‌ ప్రతిపాదించింది. భూముల ప్రతిపాదనపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన స్పందన లేకపోవటంతో.. ఇప్పటి వరకు విజయవాడ తూర్పు బైపాస్‌ ప్రాజెక్టు ప్రతిష్టంభనలో ఉంది. విజయవాడ తూర్పు బైపాస్‌ ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించగానే.. కేంద్రం కొన్ని షరతులు నిర్దేశించింది. తూర్పు బైపాస్‌కు కావల్సిన భూములతో పాటు, పన్ను మినహాయింపులు, రోడ్డు నిర్మాణానికి సేకరించే మినరల్స్‌కు కూడా పన్ను మినహాయింపులు కోరింది. వీటన్నింటికీ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. దీంతో డీపీఆర్‌ రూపకల్పనకు వెళ్లడమే తరువాయి అనుకున్న దశలో కేంద్రం నుంచి లాజిస్టిక్‌ పార్క్‌కు కూడా భూములు కేటాయించాలన్న ప్రతిపాదన రావటం, అది రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ఉండటంతో ప్రతిష్టంభన తలెత్తింది. ఆ తర్వాత కేంద్రస్థాయిలో కూడా విజయవాడ తూర్పు బైపాస్‌కు ఎక్కడా చర్చకు రాలేదు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం లాజిస్టిక్‌ పార్క్‌కు కూడా భూములు కేటాయించటానికి అంగీకారం తెలిపి విజయవాడ తూర్పు బైపాస్‌ అంశాన్ని కేంద్ర కోర్టుకు నెట్టేసింది. ఉమ్మడి కృష్ణాజిల్లాకు మంజూరైన ప్రాజెక్టు కాబట్టి.. ప్రస్తుతం ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల్లో ఏ జిల్లాలో భూములు కేటాయిస్తారన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. విజయవాడ పశ్చిమ బైపాస్‌ వెంబడి కానీ, విజయవాడ తూర్పు బైపాస్‌ వెంబడి కానీ ఇవ్వొచ్చని తెలుస్తోంది. ఈ రెండు చోట్ల ప్రభుత్వ భూములు ఎక్కడ ఉంటే అక్కడ ఇచ్చే అవకాశం క నిపిస్తోంది. మల్లవల్లి మోడల్‌ ఇండస్ర్టియల్‌ పార్క్‌లో అనువుగా భూములు ఉన్నందున అక్కడ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. 

కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తే.. 

కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ గ్రీన్‌ సిగ్నల్‌  ఇస్తే వెంటనే.. జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌) నేతృత్వంలో సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) రూపకల్పన చేయాల్సి ఉంటుంది. మామూలుగా అయితే డీపీఆర్‌ తయారు చేయటం కోసం కన్సల్‌టెంట్‌ను ఎంపిక చేయటానికి టెండర్లు పిలవాలి. విజయవాడ తూర్పు బైపాస్‌కు డీపీఆర్‌ తయారు చేసే కన్సల్‌ టెంట్‌ కోసం టెండర్లు పిలవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఓఆర్‌ఆర్‌ కన్సల్టెంట్‌ను చేంజ్‌ ఆఫ్‌ యూజ్‌ కింద ఉపయోగించుకోవచ్చు. 

నిడమానూరు ఫ్లై ఓవర్‌ డీపీఆర్‌కు త్వరలో టెండర్‌ 

విజయవాడలో మహానాడు జంక్షన్‌ నుంచి నిడమానూరు వరకు ఆరున్నర కిలోమీటర్ల దూరంలో ఆరు వరుసల్లో ఫ్లై ఓవర్‌ నిర్మాణానికి  ఎన్‌హెచ్‌ అధికారులు ఇప్పటికే డీపీఆర్‌ రూపకల్పన కోసం అవసరమైన కన్సల్టెంట్‌ ఎంపికకు టెండర్లు పిలిచారు. మొత్తం ఎనిమిది సంస్థలు వచ్చాయి. వీటికి సంబంధించిన టెక్నికల్‌ అవాల్యుయేషన్‌ జరుగుతోంది. త్వరలో కన్సల్‌టెంట్‌ను ఎంపిక చేసి డీపీఆర్‌ బాధ్యతలు అప్పగించనున్నారు. 

విజయవాడ ఎయిర్‌పోర్టు ఫ్లై ఓవర్‌కు కాంట్రాక్టు సంస్థ ఎంపిక 

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం ఎదుట ఫ్లైఓవర్‌ నిర్మాణానికి పిలిచిన వర్క్‌ టెండర్లకు మొత్తం ఏడు సంస్థలు బిడ్లు సమర్పించాయి. ఈ ఏడింటి సాంకేతిక, ఆర్థిక అంశాలను పరిగణనలోకి తీసుకుని ఒక సంస్థను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. అగ్రిమెంట్‌ చేసుకున్న తర్వాత కాంట్రాక్టు సంస్థ పేరును బహిర్గతం చేసే అవకాశం ఉంది. 

వచ్చేనెలలో జాతీయ  ప్రాజెక్టులపై సమావేశం 

రోడ్డు ప్రాజెక్టులకు సంబంధించి జూలైలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ అధ్యక్షతన జాతీయస్థాయి సమావేశం ఢిల్లీలో జరగనుంది. అక్కడ తూర్పు బైపాస్‌ ప్రాజెక్టు చర్చకు రానుంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం లాజిస్టిక్‌ పార్క్‌కు భూములు కేటాయించటానికి అంగీకరించిన నేపథ్యంలో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ విజయవాడ వచ్చినపుడు ఈస్ట్‌ బైపాస్‌పై స్పష్టమైన హామీ ఇచ్చారు. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్నపుడు కూడా విజయవాడ తూర్పు బైపాస్‌ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో, విజయవాడ తూర్పు బైపాస్‌ ప్రాజెక్టుకు అభ్యంతరాలు ఉండబోవని తెలుస్తోంది. కానీ ఏమి జరుగుతుందన్నది మాత్రం చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు రకరకాల కారణాలతో విజయవాడ ఈస్ట్‌ బైపాస్‌ను ప్రతిష్టంభనలో పెట్టిన కేంద్రం తాజా పరిణామాల నేపథ్యంలో మరో అవాంతరం ఏమైనా సృష్టిస్తుందేమోనన్న అనుమానాలు కూడా నెలకొంటున్నాయి. ఈ అనుమానాల నేపథ్యంలో, సమావేశంలో తీసుకునే అంతిమ నిర్ణయాన్ని బట్టి విజయవాడ తూర్పు బైపాస్‌ భవితవ్యం ఆధారపడి ఉంటుంది. 


Updated Date - 2022-06-29T06:20:50+05:30 IST