తీపి, చేదు కలయిక.. గెలుపెవరిదే ఇక!

ABN , First Publish Date - 2021-04-13T05:43:37+05:30 IST

తీపి, చేదు, వగరు, పులుపు ఇలా షడ్రుచుల సమ్మేళనం ఉగాది. తెలుగు సంవత్సరాదిగా జరుపుకునే ఈ పండుగను మంగళవారం జిల్లావాసులు ఘనంగా జరుపుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

తీపి, చేదు కలయిక..  గెలుపెవరిదే ఇక!

 ఈ ఉగాది ఏ అనుభవం మిగుల్చుతుందో!?

 ఉప ఎన్నికలతో ముడిపడిన నాయకుల భవితవ్యం


తీపి, చేదు, వగరు, పులుపు ఇలా షడ్రుచుల సమ్మేళనం ఉగాది. తెలుగు సంవత్సరాదిగా జరుపుకునే ఈ పండుగను  మంగళవారం జిల్లావాసులు ఘనంగా జరుపుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఉగాది సందర్భంగా ఎదురయ్యే అనుభవాలే ఏడాదంతా కొనసాగుతాయని తెలుగువారి నమ్మకం. అందుకే ఉగాది పచ్చడిలో తీపి పాలు ఎక్కువ కలుపుతారు. పచ్చడి చేతికిచ్చినా చేదు, కారం పక్కకు నెట్టి తీపినే స్వీకరిచండానికి ఇష్టపడతారు. ప్రజల మాట ఎలా ఉన్నా ఈ ఉగాది రాజకీయ పార్టీ నాయకులు మాత్రం తీపే కావాలని కోరుకుంటున్నారు. తిరుపతి ఉప ఎన్నికల ఫలితాల ద్వారా తమకు తీయ్యని భవిష్యత్తు ఇవ్వాలని కోరుకొంటున్నారు. మూడు ప్రధాన పార్టీల నాయకుల రాజకీయ భవిష్యత్తు ఉప ఎన్నికలపై ఆధారపడి ఉండటంతో ఆ ఫలితాలు తమ పాలిట తియ్యగా మారాలని భావిస్తున్నారు.                నెల్లూరు, (ఆంధ్రజ్యోతి) 


గెలుపు కోసం.. 

తిరుపతి ఫలితాలతో దేశం మొత్తం రాష్ట్రం వైపు చూడాలని అధికార పార్టీ అధినేత అంటున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా అదే కోరుకొంటోంది. ఈ ఉప ఎన్నిక పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకే్‌షకు ఒక పరీక్ష లాంటిదే. ఎన్నడూ లేనివిధంగా వరుసగా ఏడు రోజులు విస్తృతంగా  ప్రచారం చేస్తున్నారు. గతానికి భిన్నంగా సభలతోపాటు నాయకులు, కార్యకర్తలు చివరికి బూత్‌ కమిటీలతో చంద్రబాబు సమావేశమై దిశానిర్దేశం చేస్తున్నారు. తిరుపతిలో గత ఎన్నికలకన్నా మెరుగైన ఫలితాలు సాధించినప్పుడే తండ్రీతనయుల శ్రమకు విలువ పెరుగుతుంది. లేని పక్షంలో విపక్షాలకు ఇదొక విమర్శనాస్త్రం అవుతుంది. టీడీపీ నాయకులకు ఇది ఒక అగ్నిపరీక్షే. సర్వేపల్లిలో మాజీ మంత్రి సోమిరెడ్డి, వెంకటగిరిలో మాజీ ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ, సూళ్లూరుపేటలో నెలవల సుబ్రహ్మణ్యం, వేనాటి సతీ్‌షరెడ్డి, గూడూరులో మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌లకు ఈ ఎన్నికలు అగ్నిపరీక్షే. చంద్రబాబు, లోకేష్‌ సభలకు ఈ నియోజకవర్గాల్లో మంచి స్పందన లభించింది. దీనిని ఓటుగా మలుచుకునే బాధ్యత నియోజకవర్గ నేతలదే. పనబాక దంపతుల రాజకీయ భవిష్యత్తుకు ఈ ఎన్నికలు చాలా ముఖ్యమైనవి. ఇప్పటికే నాలుగు పర్యాయాలు ఎంపీగా, పదేళ్లపాటు కేంద్ర మంత్రిగా పనిచేసిన పనబాక తిరుపతి నుంచి రెండోవసారి పోటీ చేస్తున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు పనబాక లక్ష్మి, ఆమె భర్త పనబాక కృష్ణయ్యల రాజకీయ దిశ, దశను నిర్ణయించనున్నాయి. 


వీరికి మెడమీద కత్తే

తిరుపతి ఉప ఎన్నికలు వైసీపీ నాయకుల మెడ మీద కత్తే అని చెప్పాల్సి వస్తోంది. ఐదు లక్షల మెజారిటీ ఆ పార్టీ అధినేత లక్ష్యం. దేశంలో మరే ఎంపీ సాధించనంత రికార్డు మెజారిటీ సాధించడం ద్వారా దేశం మొత్తం తనవైపు చూడాలన్నది ఆ పార్టీ అధినేత ఉద్దేశం. ఆ మేరకు పార్టీ నాయకులకు టార్గెట్‌ ఇచ్చారు. ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో మంత్రిని ఇన్‌చార్జిగా నియమించారు. సాధారణ పరిస్థితుల్లో అయితే భారమంతా స్థానిక నాయకులపై మోపి  మంత్రులు చుట్టపుచూపుగా వచ్చి వెళ్లేవారేమో. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ఎందుకంటే రెండున్నర సంవత్సరాల పదవీ కాలం ముగియడానికి ఇక ఆరు నెలల కాలమే ఉంది. మరో రెండున్నరేళ్లు తమ మంత్రి పదవిని నిలబెట్టుకోవడానికి ఉప ఎన్నికల ఫలితాలు ఎంతో కొంత ఉపయోగపడతాయి. ఈ కోణంలో ఆలోచిస్తే జిల్లాకు చెందిన మంత్రులు అనిల్‌కుమార్‌ యాదవ్‌, మేకపాటి గౌతంరెడ్డిలకు ఈ ఎన్నికలు అత్యంత ప్రాధాన్యమైనవే. ఇక రెండో ఫేజ్‌లో మంత్రి పదవుల రేస్‌లో ఉన్న వారు తిరుపతి పార్లమెంట్‌ సెగ్మెంట్‌ పరిధిలో చాలా మందే ఉన్నారు. జిల్లా విషయానికి వస్తే కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, కిలివేటి సంజీవయ్య, వరప్రసాద్‌ నలుగురు మంత్రి పడవుల రేస్‌లో ఉన్నవారే. కొత్త మంత్రుల పరిశీలన జాబితాలో వీరికి చోటు దక్కాలంటే వారి నియోజకవర్గాల్లో భారీ మెజారిటీ చూపించకతప్పదు. ఈ నాలుగు నియోజకవర్గాల్లో రాష్ట్రస్థాయి నామినేటెడ్‌ పదవులు ఆశిస్తున్న వారు పలువురు ఉన్నారు. గూడూరు నుంచి ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, పేర్నాటి శ్యాంప్రసాద్‌రెడ్డి, కొణకా దేవసేన, కలిమిలి రాంప్రసాద్‌రెడ్డి ఇలా ఆశావహుల జాబితా భారీగానే ఉంది. వీరి రాజకీయ భవిష్యత్తుకు ఈ ఎన్నిక చాలా ముఖ్యం. విశేషమేమంటే 2019 ఎన్నికల్లో వచ్చిన మెజారిటీకన్నా కాస్త తగ్గినా వైసీపీ నైతికాంశం తెరపైకి వస్తుంది. దేశమంతా చర్చకు తెరలేస్తుంది. ఈ కోణంలో చూస్తే తిరుపతి ఎన్నికలు వైసీపీ నేతల మెడమీద కత్తే అనడంలో అతిశయోక్తిలేదు. 


కోటి ఆశలతో కమలదళం

తిరుపతి ఎన్నికల్లో గెలవడం ద్వారా రాష్ట్రంలో వేళ్లూనుకోవాలని కమలదళం కోటి ఆశలతో ముందుకు వెళుతోంది. తిరుపతి పార్లమెంట్‌ నుంచి గతంలో ఒకసారి బీజేపీ అభ్యర్థి ప్రాతినిధ్యం వహించడం, తిరుపతి, శ్రీకాళహస్తి లాంటి పెద్ద ఆధ్యాత్మిక పట్టణాలు బీజేపీ భావజాలానికి జై కొడతాయన్న నమ్మకం, పవన్‌ కల్యాణ్‌ జనబలం ఏరుదాటిస్తుందన్న విశ్వాసం ఈ పార్టీ నాయకుల్లో ఉంది. తిరుపతి ఎన్నికల ద్వారా రాష్ట్రంలో తమ సత్తా చాటుకోవాలని, ప్రత్యామ్నాయ పార్టీగా ఎదగాలని ఆ పార్టీ నేతలు ఉవిళ్లూరుతున్నారు. ఈ క్రమంలోనే తిరుపతి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోరాడుతున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా మొదలు కేంద్ర మంత్రులు, రాష్ట్ర నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు.  


తానే ఒక సైన్యమై..

2019కి పూర్వం వరకు కాంగ్రెస్‌ పార్టీకి తిరుపతి పార్లమెంట్‌ కంచుకోట. రాష్ట్ర విభజనానంతరం ఎదురైన పరిణామాల క్రమంలో ప్రస్తుతం తానే ఒక సైన్యమై చింతా మోహన్‌ పోరాడుతున్నారు. ఇక్కడ నుంచి ఆరు పర్యాయాలు గెలిచిన ఈయన ప్రస్తుతం ఒంటరిగా కాంగ్రెస్‌ గెలుపు బాధ్యతలను భుజాన వేసుకొని పోరాడుతున్నారు. 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్‌ పార్టీకి చాలా తక్కువ ఓట్లే దక్కాయి. అయితే,, వైసీపీ, బీజేపీ పాలనలో జరిగిన మోసాలు, అన్యాయాల పట్ల ప్రజలు విసిగిపోయారని, కాంగ్రె్‌సను గెలిపించాలని నిశ్చయించుకున్నారని ఆ పార్టీ నాయకులు విశ్వసిస్తున్నారు. ఆ నమ్మకంతోనే కాంగ్రెస్‌ అభ్యర్థి చింతా మోహన్‌ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.  ఉగాది ఆరంభంలో జరుగుతున్న తిరుపతి ఉప ఎన్నికలు  అన్ని పార్టీలకు, నాయకులకు అత్యంత కీలకమైనవిగా మారాయి. అయితే ఈ ఉగాది ఎవరికి ఏ రుచిని పంచుతుందో.. ఫలితాలు వెలువడే వరకు వేచి చూడాల్సిందే. 

Updated Date - 2021-04-13T05:43:37+05:30 IST