సర్కారు బడికి బైబై..!

ABN , First Publish Date - 2022-10-05T16:30:23+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య దారుణంగా పడిపోయింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో లక్షలాదిగా విద్యార్థులు ప్రైవేటు బాట పట్టడంతో ‘నాడు- నేడు’, జగనన్న విద్యా కానుక, అమ్మఒడి తదితర పథకాలతో ఎన్‌రోల్‌మెంట్‌ పెరిగిన ఆనందం

సర్కారు బడికి బైబై..!

ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్‌రోల్‌మెంట్‌ ఢమాల్‌ 

దారుణంగా పడిపోయిన కొత్త విద్యార్థుల సంఖ్య 

ఒక్క ఏడాదిలో ఏకంగా 4.4 లక్షల మంది దూరం 

గతేడాది ప్రభుత్వ బడుల్లో 45.71 లక్షల మంది 

ఈసారి 41.24 లక్షల దగ్గరే ఆగిన విద్యాకానుక 

ప్రైవేటు పాఠశాలల్లో పెరిగిన 5 లక్షల మంది 

ప్రవేశాలపై సర్కారు అంచనాలు తలకిందులు 

తరగతుల విలీనంతో విద్యార్థుల ప్రైవేటు బాట 

కొవిడ్‌ సమయంలో వచ్చినవారు తిరిగి వెనక్కి 

పిల్లల సంఖ్యపై కిమ్మనని పాఠశాల విద్యాశాఖ 

‘నాడు-నేడు’, విద్యాకానుకతో ఫలితం తాత్కాలికం


ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య దారుణంగా పడిపోయింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో లక్షలాదిగా విద్యార్థులు ప్రైవేటు బాట పట్టడంతో ‘నాడు- నేడు’, జగనన్న విద్యా కానుక, అమ్మఒడి తదితర పథకాలతో ఎన్‌రోల్‌మెంట్‌ పెరిగిన ఆనందం తాత్కాలికమేనని తేలిపోయింది. ఓవైపు ప్రైవేటు పాఠశాలలకు విద్యార్థులు క్యూ కడుతుంటే, ప్రభుత్వ బడుల్లో కొత్తగా ఎవరూ చేరకపోగా, ఉన్నవారు కూడా వెళ్లిపోవడం సర్కారు ప్రతిష్ఠను మరింత దిగజారుస్తోంది. 


(అమరావతి-ఆంధ్రజ్యోతి): వివిధ పథకాలతో ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చినట్లు వైసీపీ సర్కారు ఘనంగా ప్రకటించుకుంటున్నా... అవి ఎందుకూ ఉపయోగపడటం లేదని స్పష్టమవుతోంది. కొవిడ్‌ సమయంలో తరగతులు లేవనే కారణంతో ప్రభుత్వ బడులకు వచ్చిన విద్యార్థులను చూపించి... ఇది తమ ఘనతేనని ప్రకటనలు చేసిన ప్రభుత్వం ఇప్పుడు విద్యార్థులు లక్షల్లో వెళ్లిపోవడంతో తెల్లమొఖం వేయాల్సిన పరిస్థితి వచ్చింది. తాజా లెక్కలను పరిశీలిస్తే విద్యార్థుల సంఖ్యను పెంచడం మాట అటుంచి... ఉన్నవారిని కాపాడుకోవడంలో జగన్‌ ప్రభుత్వం ఎంత ఘోరంగా విఫలమైందో అర్థమవుతోంది. 2021-22 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 45.71 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ఆ సంఖ్య ఈ ఏడాది 47 లక్షలు దాటుతుందనే అంచనాతో పాఠశాల విద్యాశాఖ ఆ స్థాయిలో జగనన్న విద్యాకానుకలు సిద్ధం చేసింది. కానీ చివరికి కేవలం 41.24 లక్షల మందితోనే కానుకల పంపిణీ ఆగిపోయింది. అంటే కొత్త విద్యార్థులు రాకపోగా, ఉన్నవారిలో 4.47 లక్షల మంది ప్రభుత్వ బడులకు దూరమయ్యారు. మరోవైపు ఈ ఏడాది ఏప్రిల్‌ నాటి లెక్కల ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో 24 లక్షల మంది విద్యార్థులుంటే ఆ సంఖ్య ఇప్పుడు 29.1 లక్షలకు చేరింది. అంటే 5.1 లక్షల మంది అదనంగా చేరారు. దీన్నిబట్టి ప్రభుత్వ పాఠశాలల్లో ఉండాల్సిన సాధారణ వృద్ధి కూడా ప్రైవేటులో కలిసిపోయిందని తెలుస్తోంది. సాధారణంగా సొంతంగా పెరిగే సంఖ్యకు తోడు ప్రభుత్వం నుంచి వచ్చిన విద్యార్థులు కూడా కలిసి ప్రైవేటు బడులు కళకళలాడుతుంటే... ఉన్నవారు కూడా వెళ్లిపోవడంతో సర్కారు బడులు వెలవెలబోతున్నాయి.


దెబ్బతీసిన సంస్కరణలు 

విద్యారంగంలో గొప్ప సంస్కరణలంటూ తీసుకొచ్చిన తరగతుల విలీనం విద్యార్థుల సంఖ్య దారుణంగా పడిపోవడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. 3, 4, 5 తరగతుల విద్యార్థులను కిలోమీటరు లోపు ఉన్న ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడంతో వారంత ప్రైవేటు బాట పట్టారు. బడిలో టీసీలు తీసుకుని, మరో ప్రభుత్వ బడిలో చేర్పించాల్సి ఉండగా, నేరుగా ప్రైవేటు పాఠశాలలకు వెళ్లిపోయారు. దీంతో 4, 5, 6 తరగతుల్లో విద్యార్థుల సంఖ్య భారీగా పడిపోయింది. 5,400 పాఠశాలల్లో తరగతులు విలీనం కావడం అక్కడ విద్యార్థుల సంఖ్యపై తీవ్ర ప్రభావం చూపింది. మరోవైపు ప్రైవేటు నుంచి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు మారిన విద్యార్థులు కూడా కొవిడ్‌ పూర్తిగా తగ్గిపోవడంతో తిరిగి వెళ్లిపోయారు. అలాగే ఈ ఏడాది సరిగ్గా పాఠశాలలు తెరిచే సమయంలో అమ్మఒడి నగదును ఖాతాల్లో వేయడం పిల్లల్ని ప్రైవేటు బడిలో చేర్పించి ఫీజు కట్టడానికి తల్లిదండ్రులకు ఉపయోగపడింది. 


రెండేళ్లకే సీన్‌ రివర్స్‌ 

కొవిడ్‌తో విద్యార్థులు ప్రభుత్వ బడులకు రావడం చూపించి దీన్ని ప్రభుత్వ పథకాల ఘనతగా అప్పట్లో వైసీపీ సర్కారు ప్రకటించుకుంది. నాడు-నేడు చూసే విద్యార్థులు క్యూ కడుతున్నారని, ఇక వారు శాశ్వతంగా ప్రభుత్వ బడుల్లోనే ఉంటారని చెప్పుకొంది. అయితే సరి గ్గా రెండేళ్లలో సీన్‌ రివర్స్‌ అయింది. ప్రభుత్వ బడుల్లో ఎంత వేగంగా విద్యార్థుల సంఖ్య పెరిగిందో, ఈ ఏడాది అంతే వేగంతో టీసీలు తీసుకుని వెళ్లిపోయారు. ఓ దశ లో కొన్ని పాఠశాలల్లో టీసీలు రాసే పుస్తకాలకు కొరత రావడాన్ని చూస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. నిజంగానే నాడు-నేడు వల్ల పాఠశాలలల్లో విద్యార్థులు పెరిగి ఉంటే, రెండోదశ పనులు మొద లై మరిన్ని బడులను అభివృద్ధి చేస్తున్న సమయంలో ఎందుకు వెళ్లిపోతున్నారనే ప్రశ్నలు వస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం కిక్కురుమనడం లేదు. 



Updated Date - 2022-10-05T16:30:23+05:30 IST