ఉప ఎన్నికలు : హిమాచల్‌లో కాంగ్రెస్, ఈశాన్యంలో ఎన్డీయే ముందంజ

ABN , First Publish Date - 2021-11-02T17:10:40+05:30 IST

దేశంలోని మూడు లోక్‌సభ, 29 శాసన సభ స్థానాలకు

ఉప ఎన్నికలు : హిమాచల్‌లో కాంగ్రెస్, ఈశాన్యంలో ఎన్డీయే ముందంజ

న్యూఢిల్లీ : దేశంలోని మూడు లోక్‌సభ, 29 శాసన సభ స్థానాలకు అక్టోబరు 30న జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం ప్రారంభమైంది. 13 రాష్ట్రాలు, దాద్రా అండ్ నగర్ హవేలీ కేంద్ర పాలిత ప్రాంతంలో ఈ నియోజకవర్గాలు ఉన్నాయి. అస్సాంలో 5, పశ్చిమ బెంగాల్‌లో నాలుగు, మధ్య ప్రదేశ్‌లో 3, హిమాచల్ ప్రదేశ్‌లో 3, మేఘాలయలో 3, బిహార్‌లో 2, కర్ణాటకలో 2, రాజస్థాన్‌లో 2, ఆంధ్ర ప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర, మిజోరాం, తెలంగాణాలలో ఒక్కొక్క శాసన సభ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరిగాయి. దాద్రా అండ్ నగర్ హవేలీ, హిమాచల్ ప్రదేశ్‌లోని మండి, మధ్య ప్రదేశ్‌లోని ఖండ్వా లోక్‌సభ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. 


మంగళవారం ఓట్ల లెక్కింపు తొలి రౌండ్లలో వెల్లడైన ఫలితాల ప్రకారం, ఈశాన్య భారత దేశంలో ఎన్డీయే కూటమి ముందంజలో కనిపిస్తోంది. మేఘాలయలోని రాజబాల నియోజకవర్గంలో ఎన్‌పీపీ అభ్యర్థి మహమ్మద్ అబ్దుస్ సలేహ్  188 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. అస్సాంలోని భబానీపూర్‌లో బీజేపీ అభ్యర్థి ఫణిధర్ తాలూక్‌దార్ ఆధిక్యంలో ఉన్నారు. మిజోరాంలో ఎంఎన్ఎఫ్ అభ్యర్థి రెండో రౌండ్ తర్వాత తన సమీప ప్రత్యర్థి కన్నా 597 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 


తెలంగాణాలోని హుజూరాబాద్‌లో బీజేపీ అభ్యర్థి రాజేందర్ తన సమీప ప్రత్యర్థి, టీఆర్ఎస్ అభ్యర్థి కన్నా స్వల్ప ఆధిక్యంలో కనిపిస్తున్నారు. 


కర్ణాటకలోని సిండ్గిలో కాంగ్రెస్ వెనుకంజలో ఉంది. కాంగ్రెస్ అభ్యర్థి అశోక్ మనగులి బీజేపీ అభ్యర్థి రమేశ్ కన్నా వెనుకంజలో ఉన్నారు. 


పశ్చిమ బెంగాల్‌లో ఉప ఎన్నికలు జరిగిన నాలుగు శాసన సభ నియోజకవర్గాల్లోనూ టీఎంసీ ఆధిక్యంలో దూసుకెళ్తుండటంతో ఆ పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు సంబరాలు ప్రారంభించారు. 


బిహార్‌‌లోని తారాపూర్ నియోజకవర్గంలో ఆర్జేడీ అభ్యర్థి అరుణ్ కుమార్‌ కన్నా బీజేపీ అభ్యర్థి రాజీవ్ కుమార్ సింగ్ 224 ఓట్లతో ముందంజలో ఉన్నారు. కుషేశ్వర్ ఆస్థాన్ నియోజకవర్గంలో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. 


ప్రాథమిక సమాచారం ప్రకారం, హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. మధ్య ప్రదేశ్‌లోని ఖండ్వా లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీ ముందంజలో ఉంది. దాద్రా అండ్ నగర్ హవేలీ లోక్‌సభ నియోజకవర్గంలో శివసేన ఆధిక్యంలో ఉంది.


మధ్య ప్రదేశ్‌లోని నాలుగు శాసన సభ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ప్రాథమిక సమాచారం ప్రకారం బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో కనిపిస్తున్నారు. 


రాజస్థాన్‌లోని ప్రతాప్‌గఢ్ శాసన సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి నగజ్ మీనా ముందంజలో ఉన్నారు. 


Updated Date - 2021-11-02T17:10:40+05:30 IST