పంజాబ్: సీఎం ఎవరైనా ఉప ఎన్నిక తప్పదు

ABN , First Publish Date - 2022-02-27T22:33:19+05:30 IST

ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ రెండు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీకి దిగారు. ఒక వేళ రెండు స్థానాల నుంచి చన్నీ గెలిచి ముఖ్యమంత్రి అయినా కాకపోయినా మరో స్థానానికి ఉప ఎన్నిక తప్పనిసరిగా జరుగుతుంది. అకాలీదళ్ ముఖ్యమంత్రి అభ్యర్థి సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ప్రస్తుతం ఫిరోజ్‌పూర్ లోక్‌సభ..

పంజాబ్: సీఎం ఎవరైనా ఉప ఎన్నిక తప్పదు

చండీగఢ్: పంజాబ్‌లో ఎవరు ముఖ్యమంత్రి అయినా ఉప ఎన్నిక అనివార్యం. అది కూడా ముఖ్యమంత్రి అభ్యర్థి సొంత నియోజకవర్గంలోనే. రాష్ట్రంలో ప్రధానంగా కాంగ్రెస్, అకాలీదళ్, ఆప్ పార్టీలు ప్రధాన పోటీగా ఉన్నాయి. ఈ మూడు పార్టీల్లోని ముఖ్యమంత్రి అభ్యర్థుల్లో ఇద్దరు ఇప్పటికే లోక్‌సభ ఎంపీలు కాగా ఒకరు రెండు స్థానాల్లో పోటీ చేయబోతున్నారు. దీంతో ఒక స్థానానికి తప్పనిసరిగా ఉప ఎన్నిక ఖాయంగా ఉంది. ఇక రెండు స్థానాలకు ఉప ఎన్నికలు జరిగే అవకాశమూ లేకపోలేదు.


ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ రెండు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీకి దిగారు. ఒక వేళ రెండు స్థానాల నుంచి చన్నీ గెలిచి ముఖ్యమంత్రి అయినా కాకపోయినా మరో స్థానానికి ఉప ఎన్నిక తప్పనిసరిగా జరుగుతుంది. అకాలీదళ్ ముఖ్యమంత్రి అభ్యర్థి సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ప్రస్తుతం ఫిరోజ్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాగా, ఇదే స్థానం నుంచి ఈయన గతంలో ఎమ్మెల్యేగా పని చేశారు. ఒక వేళ అకాలీదళ్ అధికారంలోకి వచ్చి సుఖ్‌బీర్ సింగ్ ముఖ్యమంత్రి అయితే.. ఫిరోజ్‌పూర్ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుంది.


ఇక ఆప్ ఏకైక ఎంపీ (లోక్‌సభ), పంజాబ్ ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్‌మాన్ ముఖ్యమంత్రి అయినా ఇదే పరిస్థితి. సంగ్రూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి భగవంత్ మాన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రి అయితే సంగ్రూర్‌కు ఉప ఎన్నిక తప్పదు. అయితే ఒక సందర్భంలో మాత్రం ఉప ఎన్నికను తప్పించుకునే అవకాశాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుని చన్నీ ఒక స్థానంలో ఒడిపోతే ఉప ఎన్నిక అవసరం రాకపోవచ్చు.

Updated Date - 2022-02-27T22:33:19+05:30 IST