అదే జరిగితే ఐపీఎల్‌లో ఆడబోను: జోస్ బట్లర్

ABN , First Publish Date - 2021-06-23T01:00:59+05:30 IST

భారత్‌లో కరోనా సంక్షోభం కారణంగా అర్ధంతరంగా రద్దు అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోని తదుపరి మ్యాచ్‌లు

అదే జరిగితే ఐపీఎల్‌లో ఆడబోను: జోస్ బట్లర్

లండన్: భారత్‌లో కరోనా సంక్షోభం కారణంగా అర్ధంతరంగా రద్దు అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లోని తదుపరి మ్యాచ్‌లు ఈ ఏడాది సెప్టెంబరు-అక్టోబరులో యూఏఈలో జరగనున్నాయి. నిజానికి ఐపీఎల్ జరుగుతున్నప్పుడు మరెక్కడా అంతర్జాతీయ మ్యాచ్‌లు జరగవు కాబట్టి అన్ని దేశాల ఆటగాళ్లు అందుబాటులో ఉంటారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా లీగ్ జరుగుతుంది. అయితే, కొవిడ్ సంక్షోభం కారణంగా మిగిలిపోయిన దాదాపు సగానికి పైగా మ్యాచ్‌ను యూఏఈలో నిర్వహించాలని నిర్ణయించింది. అయితే, లీగ్ ప్రారంభానికి కాస్త అటూఇటుగా పలు అంతర్జాతీయ సిరీస్‌లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పలువురు విదేశీ ఆటగాళ్లు అందుబాటులో ఉండే అవకాశం తక్కువగానే కనిపిస్తోంది.


ముఖ్యంగా ఆసీస్ ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడడం కష్టమే. దీంతో పలు బోర్డులతో సంప్రదింపులు జరుపుతున్న బీసీసీఐ మ్యాచ్ షెడ్యూళ్లను మార్చుకోవాలని కోరుతోంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ జోస్ బట్లర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. అంతర్జాతీయ మ్యాచ్‌లు ఉన్న సమయంలోనే ఐపీఎల్ జరిగితే తమ దేశానికే ప్రాధాన్యం ఇస్తానని చెప్పాడు. తద్వారా ఐపీఎల్‌లో ఆడబోనని చెప్పకనే చెప్పాడు. టీ20 ప్రపంచకప్‌కు ముందు పలు పర్యటనలు ఉన్నాయని పేర్కొన్నాడు. కాబట్టి ఐపీఎల్ మ్యాచ్‌లు అంతర్జాతీయ మ్యాచ్‌లతో క్లాష్ కాకుంటేనే ఐపీఎల్‌లో ఆడతానని బట్లర్ తేల్చి చెప్పాడు.

Updated Date - 2021-06-23T01:00:59+05:30 IST