ముమ్మరంగా ప్రధాన రహదారి విస్తరణ పనులు

ABN , First Publish Date - 2022-01-04T05:46:10+05:30 IST

జిల్లా కేంద్రంలో ప్రధాన రహదారి విస్తరణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే రోడ్డుకు ఇరువైపులా ఆక్రమణలను మునిసిపల్‌ అధికారులు తొలగించారు. బొమ్మాయిపల్లి రోడ్డు నుంచి రాయిగిరి వరకు 100 పీట్లతో రోడ్డును అభివృద్ధి చేస్తున్నారు.

ముమ్మరంగా ప్రధాన రహదారి విస్తరణ పనులు
ప్రధాన రహదారి విస్తరణ పనులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే పైళ్ల

రూ.20కోట్లతో ప్రధాన రహదారి అభివృద్ధి

అర్బన్‌ ఫారెస్టు నిధులతో చెరువు సుందరీకరణ


యాదాద్రి, జనవరి3 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలో ప్రధాన రహదారి విస్తరణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే రోడ్డుకు ఇరువైపులా ఆక్రమణలను మునిసిపల్‌ అధికారులు తొలగించారు. బొమ్మాయిపల్లి రోడ్డు నుంచి రాయిగిరి వరకు 100 పీట్లతో రోడ్డును అభివృద్ధి చేస్తున్నారు. ఈ రహదారిని మూడు ఫేజ్‌లుగా విస్తరిస్తున్నారు. టీచర్స్‌కాలనీ నుంచి హైదరాబాద్‌ చౌరస్తా వరకు, అక్కడి నుంచి పాతబస్టాండ్‌ వరకు, ఇక్కడి నుంచి రాయిగిరి వరకు పనులు నిర్వహించనున్నారు. పాతబస్టాండ్‌ నుంచి రాయిగిరి మినహా మిగతా పనులు కొనసాగుతున్నాయి. టీచర్స్‌ కాలనీ నుంచి కలెక్టరేట్‌ వరకు 2.12కి.మీటర్ల పనులు నిర్వహిస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా ఫుట్‌పాత్‌లు నిర్మించనున్నారు. ఇప్పటికే రోడ్డు వెంట భవనాల కూల్చివేత పూర్తికాగా, కాల్వల పనులు కొనసాగుతున్నాయి. రోడ్డు విస్తరణ, అభివృద్ధికి మొత్తం రూ.20కోట్లు ఖర్చు చేయనున్నారు. అర్బన్‌ ఫైనాన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్సర్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌(టీయూఎ్‌ఫఐడీసీ) నుంచి రూ.15కోట్లు, హెచ్‌ఎండీఏ నిధులు రూ.5కోట్లు కేటాయించారు. ఇప్పటికే రూ.5కోట్లతో రోడ్డు డివైడర్‌తో పాటు లైటింగ్‌, గ్రీనరీ, సుందరీకరణ పనులు ప్రారంభించారు.


భువనగిరి-నల్లగొండ రోడ్డు విస్తరణ

హైదరాబాద్‌-భువనగిరి రోడ్డు విస్తరణ పనులు ముమ్మరంగా కొనసాగుతుండగా, భువనగిరి-నల్లగొండ రోడ్డును సైతం విస్తరించేందుకు ప్రణాళికను రూపొందిస్తున్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో మునిసిపల్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నల్లగొండ రోడ్డు అంబేడ్కర్‌ చౌరస్తా నుంచి మునిసిపల్‌ కార్యాలయం వరకు 1.5కి.మీ ఉంది. దీనికి సర్వే నిర్వహించాలని మునిసిపల్‌ అధికారులను ఎమ్మెల్యే అదేశించారు. అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద సర్కిల్‌ ఏర్పాటు చేయనున్నారు. కాగా, పట్టణ అభివృద్ధిపై ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల భువనగిరి పాఠశాలను ఎమ్మెల్యే సందర్శించి తాగునీటి ఇబ్బందులను పరిశీలించి సొంత ఖర్చుతో బోర్‌ ఏర్పాటుచేయించారు. అదేవిధంగా భువనగిరి చెరువును అర్బన్‌ ఫారెస్ట్‌ నిధులతో సుందరీకరణపై దృష్టి సారించారు.

Updated Date - 2022-01-04T05:46:10+05:30 IST