బ్యాంకును దోచుకోవడం ఎలా అనే వీడియోతో విజయం సాధించాడు! చివరికి..

ABN , First Publish Date - 2020-10-06T02:19:20+05:30 IST

యూట్యూబ్ వీడియోలు చూసి బొమ్మ తుపాకీ సాయంతో ఓ యువకుడు ఏకంగా బ్యాంకులను దోచుకున్నాడు. మొత్తం 12 లక్షలతో ఉడాయించాడు. అయితే.. పోలీసుల నుంచి తప్పించుకోవడం అసాధ్యమని యూట్యూబ్ వీడియోల్లో చెప్పలేదేమో కానీ..చివరికి అతడు పోలీసుల చేతికి చిక్కాడు.

బ్యాంకును దోచుకోవడం ఎలా అనే వీడియోతో విజయం సాధించాడు! చివరికి..

భువనేశ్వర్: యూట్యూబ్ వీడియోలు చూసి ఓ యువకుడు ఏకంగా 2 బ్యాంకులను దోచుకున్నాడు. మొత్తం 12 లక్షలతో ఉడాయించాడు. అయితే.. పోలీసుల నుంచి తప్పించుకోవడం అసాధ్యమని ఏ వీడియోలోనూ చెప్పలేదేమో కానీ..చివరికి అతడు పోలీసుల చేతికి చిక్కాడు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. అతడు తాను దోచుకున్న సోమ్మతోనే అదే బ్యాంకులో తాను తీసుకున్న లోన్ తీర్చేందుకు ప్రయత్నించాడట. ఓడిశాలో ఈ ఘటన జరిగింది.


నిందితుడి పేరు సౌమ్యరంజన్ జీనా..! గతంలో అతడికి ఓ దుస్తుల షాపు ఉండేది. ఏడాదికి దాదాపు పది లక్షల వ్యాపారం చేసేవాడు. అయితే.. కరోనా సంక్షోభం అతడి ఆర్థిక స్థితిని తలకిందులు చేసింది. దీంతో ఖాళీగా మారిన అతడు.. యూట్యూబ్ చూస్తూ గడిపేవాడు. ఈ క్రమంలోనే.. కొన్ని వీడియోల కారణంగా అతడిలో బ్యాంకును దోచుకోవాలన్న కోరిక కలిగింది. 


దీంతో.. అతడు సెప్టెంబర్ 7న ఓ బొమ్మ తుపాకీ తుసుకుని స్కూటీపై వచ్చి భువనేశ్వర్‌లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులోకి చొరబడ్డాడు. ఉద్యోగులను బెదిరించి పది లక్షలు దోచుకుపోయాడు. అలా దోచుకున్న డబ్బుతో అతడు ఓ తూపాకీని బుల్లెట్లను కొనుగోలు చేశాడు. వాటి సాయంతో బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మరి కొంత మొత్తం దోచుకుపోయాడు.


ఇలా మొత్తం 12 లక్షలను దోచుకున్నాడు. అయితే.. ఆ రెండు బ్యాంకుల నుంచీ అతడు గతంలో 19 లక్షల లోన్ తీసుకున్నాడు. ఇలా దొచుకున్న సొమ్ముతో లోను బాకీని కూడా తీర్చే ప్రయత్నం చేశాడు. అయితే..అతడు వాడిన స్కూటీ ఇతర ఆధారాల ద్వారా పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అతడి నుంచి పది లక్షలను స్వాధీనం చేసుకున్నారు.

Updated Date - 2020-10-06T02:19:20+05:30 IST