అది తాతా మనవళ్ల రాయల్ సమోసా.... ప్రతిరోజూ బారులు తీరుతున్న జనం!

ABN , First Publish Date - 2022-07-07T16:23:54+05:30 IST

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్.. కచోరీ, మిర్చి ప్రేమికుల...

అది తాతా మనవళ్ల రాయల్ సమోసా.... ప్రతిరోజూ బారులు తీరుతున్న జనం!

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్.. కచోరీ, మిర్చి ప్రేమికుల నగరం. ఈ అల్పాహారంతోనే ఇక్కడ ఉదయం ప్రారంభమవుతుంది. జోధ్‌పూర్ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మరొక రుచి కూడా ఇక్కడ ఉంది. అదే తాత, మనవళ్లు చేతులు కలిపి తయారుచేసిన రాయల్ సమోసా. ఘంటాఘర్ కూడలిలో ఒక దుకాణం వెలుపల ప్రతిరోజూ పొడవైన క్యూ కనిపిస్తుంది. అదే అరోరా సాహిబ్ షాహీ సమోసా దుకాణం. ఇక్కడికి వచ్చే ఆహార ప్రియులు సమోసాలను చట్నీతో కాకుండా బ్రెడ్ మధ్య పెట్టుకుని తింటారు. ఆనంద్ ప్రకాష్ అరోరా 1984లో చిన్న దుకాణంలో సమోసాలు అమ్మడం ప్రారంభించారు. నగర ప్రజల్లో సమోసాల క్రేజ్‌ని పెంచేందుకు కరపత్రాలు పంపిణీ చేశారు. అంతే కస్టమర్లు ఇతని షాప్ ముందు క్యూ కట్టడం ప్రారంభించారు. తాము తయారు చేసే సమోసాకు షాహీ సమోసా అనే పేరు  పెట్టారు.


ఇప్పుడు ఈ సమోసా ఖ్యాతి ప్రపంచవ్యాప్తమయ్యింది. వివిధ మసాలా దినుసుల కలయికతో సమోసాలు సిద్ధం చేసి, ప్రజల నుండి సమీక్షలు తీసుకుని, అత్యుత్తమంగా ఈ సమోసాలను తయారు చేయసాగారు. తన కుమారుని మరణానంతరం ఆనంద్ ప్రకాష్ తన మనవడు దీపాంశు అరోరాకు సమోసాల తయారీని నేర్పించారు. ప్రస్తుతం తాతామనవళ్లు కలిసి షాహీ సమోసాలు తయారు చేస్తున్నారు. షాహీ సమోసాలు 24 గంటలు పాడవకుండా ఉంటాయి. ఈ సమోసాలను ఆర్డర్ మేరకు ప్రత్యేక ప్యాకింగ్ ద్వారా దుబాయ్, ముంబై, ఢిల్లీ, బెంగళూరులకు పంపిస్తుంటారు. ఒకప్పుడు 25 పైసలకు అమ్మిన సమోసా నేడు 22 రూపాయలకు చేరుకుంది. ఈ తాతామనవళ్లు రోజూ 15 నుంచి 17 వేల సమోసాలు విక్రయిస్తున్నారు. నెలవారీ టర్నోవర్ 18 నుండి 20 లక్షల మధ్య ఉంటుంది. వార్షిక టర్నోవర్ సుమారు 2.5 కోట్లు. ప్రస్తుతం దుకాణంలో 20 మంది సిబ్బంది పనిచేస్తున్నారు.



Updated Date - 2022-07-07T16:23:54+05:30 IST