‘ఫార్మా’ భూములతో వ్యాపారమా?

ABN , First Publish Date - 2020-10-28T05:46:38+05:30 IST

ఐదేళ్ళుగా తెలంగాణా రాష్ట్ర పరిశ్రమల అవస్థాపన కార్పోరేషన్ (టిఎస్ఐఐసి) ఫార్మాసిటీ నిర్మాణం కోసం ప్రయత్నాలు చేస్తున్నది...

‘ఫార్మా’ భూములతో వ్యాపారమా?

స్వేచ్ఛా విపణి ఆర్థిక వ్యవస్థను స్వీకరించిన తరువాత ఇంకా ప్రభుత్వాలు ప్రైవేటు యాజమాన్యాలకు భూమి సేకరించి ఇవ్వాలా? వారు రైతుల నుంచి నేరుగా మార్కెట్ ధర చెల్లించి కొనుక్కోవచ్చు గదా? రైతుల భూమిని ప్రజాప్రయోజనమనే మిషతో లాక్కుని, ఆ ప్రజలను కూలీలుగా మార్చి, ఒక ప్రభుత్వసంస్థ లాభాలు పొందడాన్నిమన రాజ్యాంగం ఆమోదిస్తుందా? 


ఐదేళ్ళుగా తెలంగాణా రాష్ట్ర పరిశ్రమల అవస్థాపన కార్పోరేషన్ (టిఎస్ఐఐసి) ఫార్మాసిటీ నిర్మాణం కోసం ప్రయత్నాలు చేస్తున్నది. ప్రారంభం నుంచి ఆ సంస్థ యాచారం, కందుకూరు, కడ్తల్ మండల ప్రజల పట్ల వివక్ష చూపుతోంది. ప్రత్యేకించి అత్యధికంగా భూమి సేకరిస్తున్న యాచారం మండలంలో రైతుల పట్ల దౌర్జన్యంగా వ్యవహరిస్తూ వారి ప్రాథమిక హక్కులను నిర్లక్ష్యం చేస్తున్నది. భూ సేకరణ జరుపుతున్న రెవెన్యూ యంత్రాంగం అసైన్డ్ భూముల లెక్కలను తారుమారు చేసి ఎకరాలు ఉన్న వారికి కొన్ని గుంటల భూమికే పరిహారం చెల్లించింది. ప్రజలలో అవగాహన పెరిగి ప్రజాభిప్రాయ సేకరణలో ప్రాజెక్టును వ్యతిరేకిస్తారేమోననే భయంతో వారిని హాజరు కానియ్యకుండా అరెస్టు చేసి దూరంలోని పోలీసు స్టేషన్‌కు తరలించారు. విన్నపాలతో న్యాయం జరగదని గ్రహించిన బాధితులు భూమి ఇవ్వకూడదని నిర్ణయించి న్యాయపోరాటం మొదలుపెట్టారు. 


ఫార్మాసిటీకి పర్యావరణ అనుమతి మొదటగా సెప్టెంబరు 6, 2018న లభించింది. కాని, అందులోని నియమాలను అమలుపరచలేక సవరణలు కోరుతూ దాఖలు చేసుకున్న అర్జీకి మార్చి 18, 2020న పాక్షిక ఆమోదం లభించింది. ఆధునిక సాంకేతికతతో అంతా పర్యావరణహితంగా నిర్మించి, నిర్వహిస్తామని ప్రగల్భాలు పలుకుతూ వచ్చిన టిఎస్ఐఐసి మొదట నిర్దేశించిన సహజ వాయువుకు బదులుగా అమితమైన కాలుష్యం కలిగించే బొగ్గును నీటి ఆవిరి ఉత్పత్తికోసం వాడనుంది. ప్రతి పరిశ్రమకూ తమ సొంత ఇటిపి ఉంటుందని చెప్పి, తరువాత అన్ని పరిశ్రమల వ్యర్థాలూ తామే గంపగుత్తగా శుద్ధి చేస్తామని సవరణ తెచ్చుకుంది. గ్రామాలకూ ఫాక్టరీలకూ కనీసం 1 కిలోమీటరు దూరముండాలని విధించిన నియమాన్ని కూడా సడలింప చేయించుకుని దాన్ని 100 మీటర్లకు కుదించారు. 


ఇదంతా రాష్ట్రాభివృద్ధి కోసమని, ఫార్మారంగాన్ని ప్రోత్సహిస్తే ఎగుమతులు పెరిగి ఆదాయం ఇనుమడిస్తుందని, దానితో రాష్ట్ర ఆదాయమూ పెరిగి ప్రజలకు మేలు జరుగుతుందని చెబుతున్నారు. అది జరగాలంటే రైతులు స్వచ్ఛందంగా భూముల్ని ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే అప్పగించాలనీ, లేకుంటే బాంకులో డబ్బులు వేసి బలవంతంగా తీసుకుంటామనీ బెదిరిస్తున్నారు అధికారులు. ఈ మండలాల రైతుల నుంచి భూముల్ని బలవంతంగా సేకరించడంలో ప్రజా ప్రయోజనమున్నదనే మాటలో వాస్తవమెంతో పరికిద్దాం. 


రైతుల నుంచి సేకరించ తలపెట్టిన 19333.20 ఎకరాలలో 10200 ఎకరాలు పట్టా భూములు, 6199 అసైన్డ్ భూములు, మిగిలినవి కొంతమేర కబ్జాలో ఉన్న ప్రభుత్వ భూములూ, చెరువులూ తదితరాలు. కబ్జాలో ఉన్న భూములకు ఎకరానికి 7.5 లక్షలు, అసైన్డ్ భూములకు ఎకరానికి 8 లక్షలు, పట్టా భూములకు ఎకరానికి 12.5 లక్షల రూపాయలూ చెల్లిస్తామని ప్రకటించారు. ఈ భూసేకరణలో అవకతవకల్ని పత్రికలు ప్రముఖంగా ఎండగట్టి, అసలు అక్కడ భూములే లేకున్నా పరిహారం పొందిన వారి పేర్లు ప్రకటించాయి. ఈ నెల 16వ తేదీ అర్ధరాత్రి ఒంటిగంటకు ఇళ్ళలో చొరబడి రైతులను అరెస్టు చేసి నాన్ బైయిలబుల్ కేసులు పెట్టారు. వారు చేసిన నేరం ఏమిటంటే స్థానిక ఎంఎల్ఎ చెరువు దగ్గర పూజ చేయడానికి వస్తున్నాడని తెలిసి తమ భూములు సేకరించవద్దని విన్నవించుకోవడానికి గుమిగూడిన గ్రామస్థులను పోలీసులు అసభ్య పదజాలంతో తిడుతూ కాళ్ళతో డొక్కలో తన్నితే యువకులు చెప్పులు విసరడం. ఈ నేపథ్యంలో భూసేకరణ ప్రజాహితానికేనా అన్న అనుమానం ఎవరికైనా రాకమానదు.


భూ సేకరణ కోసం టిఎస్ఐఐసి ఎకరా పట్టా భూమికి 12.5లక్షల చొప్పున 10200 ఎకరాలకు 1275 కోట్లు; ఎకరా అసైన్డ్ భూమికి 8 లక్షల చొప్పున 6199 ఎకరాలకు 495.92 కోట్లు; వెరసి మొత్తం 1770.92 కోట్ల రూపాయలు చెల్లిస్తోంది. కబ్జాలో ఉండి వ్యవసాయం చేసుకుంటున్న భూములను పరిగణనలోకి తీసుకోలేదు. కారణం, అవి ఎన్ని ఎకరాలో సమాచారం లేదు. సమాచార హక్కు కింద ఆ వివరాలు అడిగినా ఇవ్వలేదు. ఈ భూములలో 12980 ఎకరాలు వ్యాపారస్తులకు విక్రయిస్తారు (పరిశ్రమలకు 9535, నివాస ప్రాంతాలకు 1507, కార్యాలయాలు, ఆసుపత్రులు, హోటళ్ళు తదితరాలకు 1111, పరిశోధనశాలలకు 827 ఎకరాలు). మిగిన భూములు టిఎస్ఐఐసి అవస్థాపన అవసరాలైన రోడ్లకు, పచ్చదనానికి, ఫార్మాసిటీ నిర్వహణకు అవసరమైన జలశుద్ధి ప్లాంట్లు, ఘన వ్యర్థ నిక్షేపాలు, బాయిలర్లు, జనరేటర్లు తదితరాలకు ఉపయోగిస్తారు.  


ఈ సంవత్సరంలోనే అమెజాన్ కార్పోరేషన్ డేటా సెంటరుకు ఎకరాకు 1 కోటి 40 లక్షల రూపాయల చొప్పున ఇదే ప్రాంతంలో భూమి ఇచ్చారు. ఫార్మాసిటీ ఏర్పాటు కోసం 12980 ఎకరాలను, ఒక ఎకరా 1 కోటి 50 లక్షలకు అమ్మితే వచ్చే రాబడి 19470 కోట్ల రూపాయలు.


అంటే టిఎస్ఐఐసి బీద రైతులను బెదిరించి, పోలీసు దమనకాండ ప్రయోగించి పొందే లాభం 17799.08 కోట్ల రూపాయలు. వారు ప్రకటించిన పాజెక్టు ఖర్చు 16784 కోట్ల రూపాయలు. అంటే ఇంకా 1015 కోట్ల రూపాయలు టిఎస్ఐఐసికి మిగులుతాయి. ఇదంతా బీద రైతుల సొమ్ము కాదా?


స్వేచ్ఛా విపణి ఆర్థిక వ్యవస్థను 1991 నుంచి ప్రభుత్వ విధానంగా స్వీకరించిన తరువాత ఇంకా ప్రభుత్వాలు ప్రైవేటు యాజమాన్యాలకు భూమి సేకరించి ఇవ్వాలా? వారు రైతుల నుంచి నేరుగా మార్కెట్ ధర చెల్లించి కొనుక్కోవచ్చు గదా?


తరతరాలుగా రైతుల చెమటతో తడిసిన భూమిని ప్రజాప్రయోజనమనే మిషతో లాక్కుని, ఆ ప్రజలను కూలీలుగా మార్చి, ఒక ప్రభుత్వసంస్థ లాభాలు పొందడం మన రాజ్యాంగం ఆమోదిస్తుందా? ప్రభుత్వమే ప్రజల పట్ల దోపిడీదారుగా వ్యవహరిస్తే ఇక ప్రజలకు రక్షణేదీ? ఇలాటి అభివృద్ధి వాంఛనీయమా? 

డా. కలపాల బాబూరావు


Updated Date - 2020-10-28T05:46:38+05:30 IST