5 ఏళ్లు.. రూ.11 లక్షల కోట్ల ఫోన్లు

ABN , First Publish Date - 2020-08-02T06:12:49+05:30 IST

వచ్చే ఐదేళ్లలో భారత్‌లో మొబైల్‌ ఫోన్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ కేంద్రాలను ప్రారంభించేందుకు దేశీయ, అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు సిద్ధంగా ఉన్నాయని కేంద్ర టెలికాం, ఐటీ శాఖ మంత్రి రవి శంకర్‌

5 ఏళ్లు.. రూ.11 లక్షల కోట్ల ఫోన్లు

  • పీఎల్‌ఐ కింద ఉత్పత్తికి దరఖాస్తు చేసిన 22 మొబైల్‌ కంపెనీలు
  • జాబితాలో యాపిల్‌ వెండార్స్‌, సామ్‌సంగ్‌
  • 12 లక్షల మందికి ఉద్యోగావకాశాలు
  • కేంద్ర మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ వెల్లడి


న్యూఢిల్లీ: వచ్చే ఐదేళ్లలో భారత్‌లో మొబైల్‌ ఫోన్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ కేంద్రాలను ప్రారంభించేందుకు దేశీయ, అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు సిద్ధంగా ఉన్నాయని కేంద్ర టెలికాం, ఐటీ శాఖ మంత్రి రవి శంకర్‌ ప్రసాద్‌ వెల్లడించారు.    సుమారు రూ.11 లక్షల కోట్ల విలువైన మొబైల్‌ ఫోన్ల ఉత్పత్తిని చేపట్టేందుకు ఐఫోన్‌ తయారీ సంస్థ యాపిల్‌ కాంట్రాక్ట్‌ మాన్యుఫ్యాక్చరర్లు, సామ్‌సంగ్‌, లావా, డిక్సన్‌ వంటి 22 కంపెనీలు ప్రతిపాదనలను సమర్పించాయని శనివారం నాడిక్కడ మంత్రి తెలిపారు. మొబైల్‌ ఫోన్ల తయారీ కోసం ప్రభుత్వం ప్రకటించిన రూ.41,000 కోట్ల ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సా హకాల (పీఎల్‌ఐ) పథకానికి లోబడి ఈ సంస్థలు తమ ప్రతిపాదనలను అందించాయని పేర్కొన్నారు. ఈ కంపెనీల ప్రతిపాదనల ప్రకారం దాదాపు 12 లక్షల మందికి ఉద్యోగావకాశాలు అందుబాటులోకి వస్తాయని అంచనా వేస్తున్నట్లు రవి శంకర్‌  వెల్లడించారు. ఇందులో ప్రత్యక్షంగా 3 లక్షల మందికి ఉద్యోగాలు లభించనుండగా 9 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి లభించనుందని పేర్కొన్నారు. అంతేకాకుండా 11 లక్షల కోట్ల విలువైన మొబైల్‌ ఫోన్ల తయారీని చేపట్టే అవకాశం లభించటమే కాకుండా దాదాపు రూ.7 లక్షల కోట్ల విలువైన ఎగుమతులు చేపట్టే వీలు కలుగుతుందన్నారు. మొబైల్‌ ఫోన్‌ తయారీ ప్లాంట్ల కోసం దరఖాస్తు ప్రతి ఒక్క సంస్థకు తాను వ్యక్తిగతంగా ధన్యవాదాలు చెబుతున్నట్లు ప్రసాద్‌ తెలిపారు.


బెంచ్‌మార్క్‌ ధర రూ.15 వేల పైనే.. 

అంతర్జాతీయ కంపెనీలు ఉత్పత్తి చేయనున్న మొబైల్‌ ఫోన్ల బెంచ్‌మార్క్‌ ధర రూ.15,000 పైనే ఉంటాయని ప్రసాద్‌  తెలిపారు. మొబైల్‌ ఫోన్ల తయారీ కోసం దరఖాస్తు చేసిన కంపెనీల్లో తైవాన్‌, దక్షిణ కొరియా, జర్మనీ, ఆస్ట్రియా తదితర దేశాలకు చెందిన సామ్‌సంగ్‌, ఫాక్స్‌కాన్‌, హాన్‌హాయ్‌, రైజింగ్‌ స్టార్‌, విస్ట్రాన్‌, పెగాట్రాన్‌ ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇందులో ఫాక్స్‌కాన్‌, హాన్‌ హాయ్‌, విస్ట్రాన్‌ కంపెనీలు.. యాపిల్‌ ఐఫోన్ల తయారీకి కాంట్రాక్టు మాన్యుఫ్యాక్చరర్స్‌గా ఉన్నాయి. కాగా పీఎల్‌ఐ పథకం కింద భారతీయ కంపెనీలు ఉత్పత్తి చేసే ఫోన్లకు ఎలాంటి ధర పరిమితి లేదన్నారు. ప్రతిపాదనలు సమర్పించిన దేశీయ కంపెనీల్లో లావా, డిక్సన్‌ టెక్నాలజీస్‌, భగవతి (మైక్రోమాక్స్‌), పడ్జెట్‌ ఎలకా్ట్రనిక్స్‌, సోజో మాన్యుఫ్యాక్చరింగ్‌ సర్వీసెస్‌, ఆప్టిమస్‌ ఎలకా్ట్రనిక్స్‌ ఉన్నాయి. కాగా రూ.45,000 కోట్ల విలువైన మొబైల్‌ ఫోన్‌ కాంపోనెంట్ల తయారీకి ఏటీ అండ్‌ ఎస్‌, అసెంట్‌ సర్క్యూట్స్‌, విసికాన్‌, వాల్సిన్‌, సహస్ర, విటెస్కో, నియోలింక్‌ వంటి కంపెనీలు ఉన్నాయని ప్రసాద్‌ తెలిపారు. ఈ పథకం కింద చైనా కంపెనీల నుంచి ఎలాంటి దరఖాస్తులు అందుకోలేదని చెప్పారు.


రూ.11,000 కోట్ల పెట్టుబడులకు సిద్ధం : ఐసీఈఏ

మొబైల్‌ ఫోన్ల తయారీ సంస్థలు.. పీఎల్‌ఐ పథకం కింద రూ.11,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని భారత సెల్యూలార్‌ అండ్‌ ఎలకా్ట్రనిక్స్‌ సమాఖ్య (ఐసీఈఏ) వెల్లడించింది. మొబైల్‌ ఫోన్ల తయారీ సంస్థలకు ఐసీఈఏ నేతృత్వం వహిస్తోంది. పీఎల్‌ఐ ద్వారా దేశీయంగా తయారీ రంగం రెండు నుంచి రెండున్నర రెట్ల మేర పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపింది. అంతేకాకుండా దేశీయంగా మొబైల్‌ ఫోన్ల తయారీ విలువ ఏకంగా రూ.27.5 లక్షల కోట్లకు చేరుకునే అవకాశం ఉందని భావిస్తున్నట్లు ఐసీఈఏ ప్రెసిడెంట్‌ పంకజ్‌ మొహింద్రో తెలిపారు. ప్రస్తుతం దేశీయంగా ఏటా మొబైల్‌ ఫోన్ల ఉత్పత్తి విలువ రూ.2 లక్షల కోట్లుగా ఉండగా 5-6 లక్షల మందికి ఉపాధి లభిస్తోంది.

Updated Date - 2020-08-02T06:12:49+05:30 IST