వ్యాపారాలు లాక్‌డౌన్‌

ABN , First Publish Date - 2021-06-18T06:01:19+05:30 IST

కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభణతో రాష్ట్ర ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ వీధి వ్యాపారులను రోడ్డున పడేసింది. తోపుడు బండ్లపై చిరు వ్యాపారాలు చేసుకుని జీవనోపాధి సాగించే వందలాది కుటుంబాలకు ఉపాధి కరువైంది.

వ్యాపారాలు లాక్‌డౌన్‌
అమలాపురంలో ఉపాధి లేక మూలకు చేరుకున్న పానీపూరీ బండ్లు దృశ్యాలు

  • మూలనపడ్డ పానీపూరి, చాట్‌, నూడిల్స్‌, బజ్జీ బళ్లు
  • ఉపాధి లేక అలమటిస్తున్న చిరు వ్యాపారులు
  • కర్ఫ్యూ నిబంధనలు సడలించాలని వేడుకోలు

(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

కరోనా సెకండ్‌ వేవ్‌ విజృంభణతో రాష్ట్ర ప్రభుత్వం విధించిన కర్ఫ్యూ వీధి వ్యాపారులను రోడ్డున పడేసింది. తోపుడు బండ్లపై చిరు వ్యాపారాలు చేసుకుని జీవనోపాధి సాగించే వందలాది కుటుంబాలకు ఉపాధి కరువైంది. గత కొన్ని రోజులుగా బళ్లన్నీ ఇళ్లకే పరిమితమయ్యాయి. మధ్యాహ్నం నుంచి లాక్‌డౌన్‌ అమలు చేస్తుండడంతో సాయంత్రం వేళ వ్యాపారాలు చేసుకుని జీవించే కుటుంబాలకు జీవనోపాధి పూర్తిగా దెబ్బతింది. అప్పులు కూడా దొరకని పరిస్థితి. ముఖ్యంగా రాజస్థాన్‌, పశ్చిమ బెంగాల్‌, కర్ణాటక, ఒడిసా రాష్ట్రాల నుంచి వచ్చి బండ్లపై పానీపూరి, చాట్‌ వ్యాపారాలు నిర్వహించుకునే వందల కుటుంబాలకు నెల పైనుంచే జీవనోపాధి పోయింది. వీరంతా ఆకలితో అలమటించాల్సిన పరిస్థితి. ఇక సాయంత్రం వేళ పానీపూరి బళ్లతో నూడుల్స్‌, టిఫిన్స్‌, బజ్జీ బళ్లు, టీస్టాల్స్‌ ఇలా అనేక రకాల వ్యాపారాలు పూర్తిగా కనుమరుగయ్యాయి. ప్రత్యామ్నాయ ఉపాధి లేక అప్పులు చేసుకుని జీవనోపాధి సాగిస్తున్నామంటూ చిరు వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. తమ వ్యాపారాలకు సాయంకాలమే అనువైనదని, ఆ సమయంలోనే లాక్‌డౌన్‌లో భాగంగా కర్ఫ్యూను అమలు చేయడం వల్ల ఇబ్బంది పడుతున్నామని పానీపూరీ వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు. పోలీసులు ప్రత్యేక అనుమతి ఇస్తేనే దూర ప్రాంతాల నుంచి వచ్చిన తమ కుటుంబాలు బతికి బట్టకడతాయని చెప్తున్నారు. లాక్‌డౌన్‌ పొడిగిస్తే తమ పరిస్థితి మరింత దయనీయంగా మారుతుందని, ప్రభుత్వం తక్షణమే రాత్రి 9గంటల వరకు నిబంధనలు సడలిస్తే చిరు వ్యాపారులకు ఉపాధి లభిస్తుందంటున్నారు. ప్రభుత్వం రుణాలు మంజూరు చేసి ఆదుకోవాలని కోరుతున్నారు. కుటుంబ పోషణకు ప్రభుత్వం ప్రత్యేక అనుమతులు ఇవ్వాలని వేడుకుంటున్నారు.

Updated Date - 2021-06-18T06:01:19+05:30 IST