బస్‌ షెల్టర్లు లేక అవస్థలు

ABN , First Publish Date - 2022-05-23T03:50:57+05:30 IST

ఓ వైపు ఎండలు, మరో వైపు వర్షాలు ప్రయాణికులకు అవస్థలు కలి గిస్తున్నాయి. ఎందుకంటే బస్సు కోసం ఎదురు చూడడానికి చాలా చోట్ల బస్‌ షెల్టర్లు లేవు. నిలువ నీడ లేక చెట్లను, దుకాణాలను ఆశ్రయిస్తు న్నారు. జంక్షన్‌లో బస్సుల కోసం నిరీక్షించే సమయంలో ఎండ మండినా, వాన వచ్చినా తలదాచుకోవడానికి ఇబ్బందులు తప్పడం లేదు. ఇటు పాలకులు, అటు ఆర్టీసీ అధికారులు పట్టించుకోక పోవడం ప్రయాణి కులకు నరకప్రాయంగా మారింది.

బస్‌ షెల్టర్లు లేక అవస్థలు
ఎండలోనే బస్సు ఎక్కుతున్న ప్రయాణికులు

మండుటెండలో ప్రయాణికుల పడిగాపులు

పట్టించుకోని అధికారులు 

తాత్కాలిక ఏర్పాటైనా చేయాలని కోరుతున్న ప్రజలు 

బెజ్జూరు, మే 22: జిల్లాలోని పలు మండల కేంద్రాల్లో బస్సు షెల్టర్లు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. రకరకాల చార్జీల పేరుతో ప్రయాణికుల నుంచి ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తున్న ఆర్టీసీ సౌకర్యాల కల్పనపై మాత్రం దృష్టి సారించకపోవడంపై పలు విమర్శలు వస్తున్నాయి. ఓ వైపు భానుడు భగభగమంటున్నాడు. ఎండ తీవ్రతతో పాటు వడగాలుల ఇబ్బందులు పెడుతున్నాయి. మరోవైపు ప్రయాణికులు మండుటెండలోనే బస్సుల కోసం నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొంది.  జిల్లాలో పదిహేను మండలాలుండగా కేవలం ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌, కౌటాల మండలాల్లో బస్టాండ్‌లు ఉన్నాయి., మిగితా మండలాల్లో కొన్నిచోట్ల కేవలం షెల్టర్లు మాత్రమే ఉన్నాయి. బెజ్జూరు, చింతలమానేపల్లి, సిర్పూర్‌(టి), దహెగాం, రెబ్బెన,  కెరమెరి, తిర్యాణి వంటి మండలాల్లో బస్టాండులు లేని కారణంగా వివిధ గ్రామాలకు వెళ్లే ప్రయాణికులు తిప్పలు పడుతున్నారు. పెంచికలపేటలో చిన్న షెల్టర్‌ మాత్రమే ఉంది. ప్రయాణికులకు నిలువ నీడ లేకపోవడంతో ఎండలోనే నిలవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. బస్సుల కోసం గంటల తరబడి రోడ్లపై, కిరాణ దుకాణాల ఎదుట, చెట్ల కింద వేచి చూడాల్సిన దుస్థితి ఉంది. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో ఎండలు దంచి కొడుతుండటంతో ప్రయాణికులు ఎండలోనే ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. 

ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నా..

జిల్లాలోని పలు మండలాల్లో  బస్‌ షెల్లర్లు లేని కారణంగా ప్రయా ణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ఆర్టీసీ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. మండలాల్లో నుంచి ప్రతినిత్యం వివిధ పనుల నిమిత్తం కాగజ్‌నగర్‌కు, కార్యాలయాల పనుల కోసం జిల్లా కేంద్రానికి వెళ్తుంటారు. ఈ క్రమంలో చంటి పిల్లలతో కుటుంబ సభ్యులు ఎండలోనే వేచి ఉండాల్సిన పరిస్థితులు ఉన్నా యి. గతంలో కొన్నిచోట్ల బస్టాండ్‌ల నిర్మాణం కోసం పాలకులు భూమి పూజ చేసినప్పటికీ ఇప్పటికీ పనులు ప్రారంభించలేదు. రోడ్లపై నిల్చొని ఉన్నా కనీసం తాగనీరు సైతం దొరకని దుస్థితి నెలకొంది. 

సౌకర్యాల కల్పనపై..

ఆర్టీసీ ద్వారా ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతున్నా సౌకర్యాల కల్పనపై శ్రద్ధ చూపడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. ఇటీవల కాలంలో ఆర్టీసీ బస్సు చార్జీలను గుట్టు చప్పుడు కాకుండా పెంచినా వసతులు మాత్రం ఏర్పాటు చేయడం లేదని ప్రయా ణికులు మండిపడుతున్నారు. వేసవిని దృష్టిలో పెట్టుకొని ప్రయాణికుల సౌకర్యార్థం వసతులు, బస్‌షెల్టర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

అధికారులు చర్యలు తీసుకోవాలి

మోర్లె తిరుపతి, బెజ్జూరు

ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా బస్‌ షెల్టర్ల నిర్మాణానికి అధికారులు చర్యలు తీసుకోవాలి. ఎండతీవ్రతకు అక్కడ చిరు వ్యాపా రులు ఏర్పాటు చేసుకున్న కవర్ల కింద, చెట్ల నీడన ఉండాల్సి వస్తోంది.   

బస్‌షెల్టర్లు నిర్మించాలి..

బుజాడి మల్లేష్‌, పాపన్‌పేట్‌ 

మండల కేంద్రాల్లో బస్‌ షెల్టర్లు నిర్మించాలి. వేసవి, వర్షాకాలంలో బస్సుల కోసం వేచి ఉండే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అవసరమైన చోట్ల బస్‌ షెల్టర్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలి. 

Updated Date - 2022-05-23T03:50:57+05:30 IST