ఊడిపడిన బస్‌ ఫుట్‌పాత్‌

ABN , First Publish Date - 2021-10-21T05:20:51+05:30 IST

ఆర్టీసీ అధికారులు నిర్లక్ష్యం పలువురి విద్యార్థుల ప్రాణాల మీదకు తెచ్చింది.

ఊడిపడిన బస్‌ ఫుట్‌పాత్‌
గాయపడిన విద్యార్థి

రోడ్డుపై పడిన పలువురు విద్యార్థులు 

తృటిలో తప్పిన పెనుప్రమాదం


భీమవరం క్రైం, అక్టోబరు 20 : ఆర్టీసీ అధికారులు నిర్లక్ష్యం పలువురి విద్యార్థుల ప్రాణాల మీదకు తెచ్చింది. కండీషన్‌లో లేని బస్సుల కార ణంగా పలు ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా భీమవరంలో మరో ఘటన జరిగింది. అయితే తృటిలో పెనుప్రమాదం తప్పడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. తణుకు డిపోకు చెందిన ఏపీ 29 జెడ్‌ 1260 బస్సు బుధవారం ఉదయం తణుకు నుంచి భీమవరం బయలుదేరింది. అయితే బస్సులో చాలా మంది విద్యార్థులు ఉన్నారు. బస్సు గరగపర్రు రోడ్డులోని బీవీ రాజు విగ్రహం వద్దకు వచ్చేసరికి విద్యార్థులు బస్సు ఆగుతుందని దిగడానికి మెట్లు వద్దకు వచ్చారు. బస్సు వేగంగా వెళుతుండగా ఒక్క సారిగా బస్సు మెట్లు విరిగిపడ్డాయి. దీంతో బస్సులో ఉన్నవారంతా ఉలిక్కిపడ్డారు. మెట్లుపైన ఉన్న సుమారు 10 మంది విద్యార్థులు కిందపడి తీవ్ర గాయాలపాలయ్యారు. వెంటనే 108కి ఫోన్‌ చేసినా స్పందించకపోవడంతో ఆటోలో ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు కోలుకుంటున్నట్టు సమాచారం. దీనిపై ఎటువంటి కేసు నమోదు కాలేదని టూటౌన్‌ పోలీసులు తెలిపారు. ఆర్టీసీ ప్రయాణం సురక్షితం అంటూ బోర్డులు పెట్టి హడావుడి చేసే అధికారులు బస్సులు కండీషన్‌ కూడా చూడాల్సిన పరిస్ధితి ఎంతైనా ఉందని ప్రయాణికులు కోరుతున్నారు. ఇదిలా ఉండగా బుధవారం భీమవరం నుంచి ఏలూరు వెళ్ళే బస్సు ఇంజన్‌ పాత బస్టాండ్‌ వద్ద  ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. సుమారు 3 గంటల పాటు బస్సు నిలిచిపోయింది. దీంతో సహనం కోల్పోయిన ప్రయాణికులు ఆర్టీసీ సిబ్బందిని నిలదీశారు. ఇలా నిత్యం బస్సులు మరమ్మతులకు గురవడంపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు బస్సులు కండీషన్‌పై పూర్తిస్థాయి దృష్టి పెట్టాలని కోరుతున్నారు. 



Updated Date - 2021-10-21T05:20:51+05:30 IST