Abn logo
Oct 23 2020 @ 00:32AM

పెగులుతున్న గొంతులు

‘‘ఇవాళ స్టాన్‌ స్వామి, రేపు మనం’’ – జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ ‍సొరేన్‌ చేసిన హెచ్చరిక తీవ్రమైనది, ప్రజాస్వామికవాదులు, శాంతిని న్యాయాన్ని కోరుకునేవారు అందరూ పట్టించుకోవలసిన, పట్టించుకుని ఏదో ఒక ఆచరణలోకి దిగవలసిన హెచ్చరిక అది. జార్ఖండ్‌లో ఆదివాసులతో ఐదు దశాబ్దాలుగా జీవిస్తూ, వారి సాధికారత కోసం ప్రయత్నిస్తూ, కార్పొరేట్ల మైనింగ్‌ దురాశలను, ప్రభుత్వాల యురేనియం ప్రమాదక్రీడలను ప్రతిఘటిస్తూ, పత్థల్‌గడి ఉద్యమం ద్వారా ఆదివాసీ స్వతంత్ర గ్రామపంచాయతులకు నాంది పలికిన జెస్యూట్‌ ఫాదర్‌ స్టాన్‌స్వామిని ఈ నెల 8వ తేదీన నేషనల్‌ ఇన్‌వెస్టిగేటివ్‌ ఏజెన్సీ (ఎన్‌ఐఎ) అరెస్టు చేసిన నేపథ్యంలో బుధవారం నాడు జరిగిన ఒక జాతీయస్థాయి ఆన్‌లైన్‌ పత్రికాసమావేశంలో సొరేన్‌తో పాటు అనేకమంది ప్రముఖులు పొల్గొన్నారు. మార్క్సిస్టు పార్టీ అగ్రనేత సీతారాం ఏచూరి, సిపిఐ నాయకులు డి.రాజా, ఎన్‌సిపి నేత సుప్రియా సూలే, డిఎంకెకి చెందిన కనిమొజి, కాంగ్రెస్‌ నేతలు శశిథరూర్‌, కబీర్‌ కళామంచ్‌, క్రైస్తవ ప్రజాసంస్థల పెద్దలు పాల్గొన్న ఈ కార్యక్రమం పౌరహక్కుల ప్రజాసంస్థ (పియుసిఎల్‌) నిర్వహించింది. ‘‘ఈ అరెస్టులను ఇట్లా అనుమతిస్తూ పోతే పరిస్థితి ప్రమాదకరంగా మారుతుంది. ఈ నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టాలి. ఉపా, ఇతర నిర్బంధచట్టాలను యథేచ్ఛగా దుర్వినియోగం చేస్తున్నారు, అసలు ఆ చట్టాలనే రద్దు చేయాలి. స్టాన్‌స్వామి మీద అభియోగాలను తక్షణం తొలగించాలి, లేదా కనీసం బెయిల్‌ మీద అయినా విడిచిపెట్టాలి’’ అంటూ వక్తలు మాట్లాడారు. ఈ పత్రికాసమావేశం వెంటనే సాధించే ప్రయోజనం ఏదీ ఉండకపోవచ్చును కానీ, దేశవ్యాప్తంగా కొన్ని గొంతులు కలిసి ఒక ప్రజాస్వామిక సంఘటిత స్వరం వినిపించారన్నది ఆహ్వానించదగిన పరిణామం. దేశం నలుమూలల నుంచి ఏరిఏరి మరీ ఒకే కేసులో భాగం చేసి బాధిస్తున్నప్పుడు, అందుకు ప్రతిఘటన కూడా దేశవ్యాప్తంగా, సకల శిబిరాల నుంచి రావలసిందే కదా? 


స్టాన్‌ స్వామికి 83 ఏళ్లు. బీమా కోరేగావ్‌ కేసులో ఆయనది 16వ అరెస్టు. మొన్నటి దాకా ముద్దాయిలలో, ప్రఖ్యాత తెలుగు విప్లవకవి వరవరరావు 80ఏళ్ల వయసుతో అందరికంటె వయోధికులుగా ఉన్నారు. వయసూ ఆరోగ్యాలూ సాక్ష్యాలూ వంటి వాటితో నిమిత్తం లేదని ఈ కేసులో గత పరిణామాలు సూచిస్తూనే ఉన్నాయి కాబట్టి, ఇప్పుడు మరింత పెద్ద వయసు వ్యక్తిని, అనేక ఆరోగ్య సమస్యలున్న వ్యక్తిని, ఎన్నడూ బీమాకోరేగావ్‌కు వెళ్లని వ్యక్తిని కేసులో పెట్టారు. జార్ఖండ్‌లో బిజెపి ప్రభుత్వం ఉన్న కాలంలో కూడా ఆయన మీద కేసులు పెట్టారు, అరెస్టు చేశారు. బిర్సాముండా పోరాటం తరువాత జార్ఖండ్‌లో ఆదివాసీలకు భూమి ఉన్న హక్కును తొలగిస్తూ, అక్కడి భూమి విక్రయాలకు అనుమతించే చట్టాలను బిజెపి రాష్ట్రప్రభుత్వం చేసినప్పుడు, స్టాన్‌స్వామి నాయకత్వంలో ఆదివాసులు ఉద్యమించారు. జార్ఖండ్‌లో హేమంత్‌ సొరేన్‌ ప్రభుత్వం వచ్చిన తరువాత, ఆయనపై కేసులన్నిటినీ తొలగించారు. ఆదివాసులకు ఆరాధ్యుడు, సేవాభావం తప్ప మరేమి తెలియని నిస్వార్థుడు అయిన స్టాన్‌స్వామిని పోలీసులు వేధించడాన్ని సొరేన్‌ గతంలో కూడా వ్యతిరేకించారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా అదే వైఖరిని ప్రకటించడం విశేషం. ఇవన్నీ విడివిడిగా జరుగుతున్న అరెస్టులు కావని, వీటన్నిటి వెనుక ఒక క్రమం ఉన్నదని, హిందూత్వ నియంతృత్వ రాజ్యాన్ని స్థాపించే ప్రయత్నంలో భాగమే ఇవన్నీ అని సీతారామ్‌ ఏచూరి చేసిన వ్యాఖ్య కూడా తీవ్రమైనది. నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టాలని చెప్పిన కనిమొజి గొంతులో కూడా రాజకీయ సంకల్పం వ్యక్తమయింది. 


బీమాకోరేగావ్‌లో 2018 జనవరి 1 నాడు జరిగినదానికి, కేసులో పేర్కొంటున్న అంశాలకు సంబంధమే లేదని పరిణామాలను గమనిస్తున్నవారికి అర్థమవుతుంది. నిజానికి ఆ చోట మొదట ఘర్షణను ప్రేరేపించి, ఒక దళితుడి మరణానికి కారణమయిన మిలింద్‌ ఎక్బోటే, శంభాజీ భిడే లను పోలీసులు ఈ కేసులో చేర్చనేలేదు. దేశవ్యాప్తంగా దళిత, ఆదివాసీ ఉద్యమాలతో, హక్కుల పరిరక్షణ కృషితో, ప్రగతిశీల దృక్పథంతో కార్యకర్తలుగా, వక్తలుగా, అధ్యాపకులుగా, కవులుగా ఉన్నవారిని ఎంచుకుని ఎంచుకుని మరీ కేసును రూపొందించారు. మొదట ప్రధానమంత్రి నరేంద్రమోదీ హత్యకు కుట్రజరిగిందని పేర్కొన్నారు. ఎన్‌ఐఎ కేసును తీసుకున్న తరువాత మార్పు వచ్చినట్టుంది. ఇటీవల కోర్టుకు సమర్పించిన 10 వేల పేజీల అదనపు చార్జిషీటు ప్రకారం, వీరంతా కలిసి ‘దళిత్‌ మిలీషియా’ రూపొందించడానికి కుట్రపన్నారు. గాంధేయవాది, అహింసామార్గంలోనే సామాజికమార్పు సాధించాలని విశ్వసించే స్టాన్‌స్వామితో సహా పదహారుమందీ మావోయిస్టులతో సంబంధాలు కలిగి ఉన్నారనీ దర్యాప్తు సంస్థ అభియోగం మోపింది. 


అహింసావాదీ, న్యాయవాదీ, ఉపాధ్యాయుడూ.. ఎవరైనా సరే, సమాజం గురించి పట్టించుకుంటే, న్యాయం జరగాలని గట్టిగా అడిగితే ఒకే పర్యవసానం ఉంటుందని హెచ్చరించడానికే ఇటువంటి కేసులు నిర్మిస్తున్నారన్న ఆరోపణలు నిజమేనా? లేకపోతే, కొన్ని సందర్భాలలో సమాజం అంతా కోరుతున్నా నేరస్థులను అరెస్టు చేయడానికి మీనమేషాలు లెక్కించడమేమిటి? మరి కొన్ని చోట్ల, అందరూ గౌరవించే ప్రజాప్రేమికులపై తీవ్రమైన కేసులు పెట్టడమేమిటి?

Advertisement