దగ్ధ స్వప్నం

ABN , First Publish Date - 2022-05-23T05:48:45+05:30 IST

లేత కలల రెక్కల మీద అహం కవాతు చేసినపుడు కాలం కడుపున గర్భస్రావం చితిపేర్చిన మృత క్షణాల...

దగ్ధ స్వప్నం

లేత కలల రెక్కల మీద

అహం కవాతు చేసినపుడు

కాలం కడుపున గర్భస్రావం

చితిపేర్చిన మృత క్షణాల 


మంటన రగిలిన దగ్ధస్వప్నం

రేపటి ఊహకి

ఊపిరి అందనంటోంది

మనిషి ఉనికికి


ఉరి బిగుసుకుంటోంది

నడిచిన దారిలో

నలిగిన పూలు

ఇపుడు

ఏ ఋతువుల గానం చేస్తాయి

కన్నీటిధారలతో 

కడుపు నిండిన నదులు

ఇక 

ఏ పెదవుల దాహం తీరుస్తాయి.


మైడియర్‌,

ఈ రుధిర గోళం మీద 

ఇద్దరం క్షతగాత్రులమే

నువ్వు బయట, నేను లోపల.

మనం తెగిపడే నక్షత్రాలమే

ఇవాళ నువ్వు, రేపు నేను.


కళ్లలో తుఫాను కమ్ముకొస్తున్నవేళ

ఏ తీరం తన ఒడిలో చోటివ్వదు

గుండె గాయాల కొలిమైన చోట

ఏ కౌగిలి ఈ దేహాగ్ని చల్లార్చదు.


            యుద్ధం

            మానవత్వపు ముఖంపై 

                   మిగిలే నెత్తుటి మరక 

            క్రూరత్వపు కత్తి అంచున 

                   మెరిసే కన్నీటి చారిక

క్రాంతికుమార్‌ కె

96032 14455

Updated Date - 2022-05-23T05:48:45+05:30 IST