లక్షకు 3 లక్షలు ఇస్తామంటూ బురిడీ

ABN , First Publish Date - 2021-06-15T06:02:03+05:30 IST

లక్షకు మూడు లక్షల నకిలీనోట్లు ఇస్తామంటూ మాయమాటలు చెప్పి ఐదు లక్షలు తీసుకుని ఉడాయించిన ఇద్దరు ఘరానా మోసగాళ్లను చిన్నచౌకు పోలీసులు అరెస్టు చేశారని కడప డీఎస్పీ బి.సునీల్‌ తెలిపారు.

లక్షకు 3 లక్షలు ఇస్తామంటూ బురిడీ
వివరాలు తెలుపుతున్న డీఎస్పీ సునీల్‌

ఇరువురు మోసగాళ్ల అరెస్టు

రూ.4.50 లక్షల నగదు, స్కూటరు, సెల్‌ఫోన్లు స్వాధీనం

కడప (క్రైం), జూన 14: లక్షకు మూడు లక్షల నకిలీనోట్లు ఇస్తామంటూ మాయమాటలు చెప్పి ఐదు లక్షలు తీసుకుని ఉడాయించిన ఇద్దరు ఘరానా మోసగాళ్లను చిన్నచౌకు పోలీసులు అరెస్టు చేశారని కడప డీఎస్పీ బి.సునీల్‌ తెలిపారు. సోమవారం తన కార్యాలయంలో చిన్నచౌకు సీఐ అశోక్‌రెడ్డి, ఎస్‌ఐ అమర్‌నాధరెడ్డితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించి నిందితుల వివరాలను డీఎస్పీ వెల్లడించారు. టి.సుండుపల్లె మండలం రెడ్డివారిపల్లెకు చెందిన వాకా క్రిష్ణ, చెగురుపల్లెకు చెందిన నాగేశ్వర్‌రావు కడప చిన్నచౌకు ప్రాంతానికి చెందిన ఇద్దరు తెలిసిన వ్యక్తులను కలసి తమ వద్ద అచ్చు ఒరిజినల్‌ నోట్లలా ఉండే నకిలీ నోట్లు ఉన్నాయని, రూ.లక్ష ఇస్తే తాము రూ.3లక్షలు ఇస్తామని నమ్మబలికారు. తమ వద్ద ఉన్న ఒరిజనల్‌ రూ.500 నోట్లకు టింక్చర్‌ పూసి అవే నకిలీవని చూపించారు. ఆ ఇద్దరినీ వెంట తీసుకెళ్లి టింక్చర్‌ పూసిన నోట్లతో పెట్రోలు బంకులో పెట్రోల్‌ పట్టుకున్నారు. దీంతో మాయగాళ్ల మాటలు నమ్మిన ఆ ఇద్దరూ డబ్బుకు ఆశపడి గత నెల రూ.5లక్షలు ఇచ్చారు. ఆ డబ్బు తీసుకున్న నిందితులు పది నిముషాల్లో మొత్తం డబ్బుతెచ్చిస్తామని చెప్పి వెళ్లి ఎంతకూ తిరిగి రాలేదు. తాము మోసపోయామని గుర్తించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ అశోక్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎస్‌ఐ అమర్‌నాధరెడ్డి సిబ్బందితో దర్యాప్తు చేపట్టి సోమవారం పాతబైపాస్‌ సర్కిల్‌ వద్ద ఇద్దరు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి స్కూటర్‌, రూ.1.50 లక్షల నగదు, రెండు సెల్‌ఫోన్లు, రెండు టింక్చర్‌ బాటిళ్లు కలిపి, కవరులో ఉన్న హైపోస్ఫటికం స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు వారిని రిమాండుకు తరలించామని డీఎస్పీ తెలిపారు.

Updated Date - 2021-06-15T06:02:03+05:30 IST