టార్గెట్‌ టెన్‌..షన్‌

ABN , First Publish Date - 2022-05-04T05:30:00+05:30 IST

టార్గెట్‌ టెన్‌..షన్‌

టార్గెట్‌ టెన్‌..షన్‌

ఉపాధ్యాయులపై నూరుశాతం ఉత్తీర్ణత ఒత్తిడి

విద్యాశాఖ లక్ష్యాలే మాస్‌ కాపీయింగ్‌కు కారణం

ఎలాగైనా పాస్‌ చేయించాలనే టీచర్ల అడ్డదారులు

పసమర్రు మాస్‌ కాపీయింగ్‌ ఘటనలో 16 మంది అరెస్ట్‌, బెయిల్‌

ఏడుగురు ఉపాధ్యాయుల సస్పెన్షన్‌

అసలు సూత్రధారులపై చర్యలు శూన్యం


టార్గెట్‌.. టార్గెట్‌.. టార్గెట్‌.. 

పదో తరగతిలో నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలి. లేదంటే చర్యలు తీసుకుంటాం.. ఉపాధ్యాయులకు ఉన్నతాధికారులు విధిస్తున్న టార్గెట్‌ ఇది. విద్యాశాఖ విధిస్తున్న ఈ టెన్షనే టీచర్లను మాస్‌ కాపీయింగ్‌కు ఉసిగొల్పుతోంది. కరోనా కారణంగా గత రెండేళ్లలో నామమాత్రపు విద్య సాగడం, గత ఏడాది కూడా బ్లాక్‌ ఫంగస్‌ కారణంగా ఆలస్యంగా తరగతులు ప్రారంభం కావడం, సిలబస్‌ పూర్తికావడమే గగనమైతే, రివిజన్‌కు ఆస్కారం లేని పరిస్థితి తలెత్తడం, పైగా వైసీపీ ప్రభుత్వం వచ్చాక మొదటి పదో తరగతి పరీక్షలు కావడం.. ఉపాధ్యాయుల ఒత్తిడిని మరింత పెంచాయి. ఫలితాల్లో ఏదో సాధించాలనే తపనతో భావిభారతానికి పూలబాట వేయాల్సిన ఉపాధ్యాయులు జాతిని నిర్వీర్యం చేసే మాల్‌ప్రాక్టీస్‌వైపు తప్పటడుగులు వేస్తున్నారు.


గుడివాడ, మే 4 : పదో తరగతి పరీక్షల నిర్వహణ గతంలో ఎన్నడూ లేనంత గందరగోళంగా ఉంది. పరీక్షల్లో మాస్‌ కాపీయింగ్‌, పేపర్‌ లీకులతో రోజుకో సంచలనం బయటపడుతోంది. విద్యాశాఖ విధించిన లక్ష్యాలు సాధించడానికే ఉపాధ్యాయులు పక్కదారులు పడుతున్నారని ఉపాధ్యాయ సంఘాలు పేర్కొంటున్నాయి. ఉత్తీర్ణతా శాతం మెరుగుపడకపోతే వచ్చే ప్రమాదమేమీ లేదు.. జాతి నిర్వీర్యమయ్యే మాల్‌ప్రాక్టీస్‌ వంటి పనులను ప్రోత్సహించడం భవిష్యత్తుకు మంచిది కాదని విద్యావేత్తలు సూచిస్తున్నారు. విద్యావ్యవస్థలో నెలకొన్న నిర్లక్ష్యాన్ని పారదోలకుండా నూరుశాతం నిబంధనలు ఏ మేరకు సబబని ప్రశ్నిస్తున్నారు. ప్రతి తరగతికి ఉండాల్సిన కనీస అభ్యసన సామర్థ్యాలు లేకుండానే పైతరగతులకు వచ్చేస్తున్న విద్యార్థులు పదో తరగతి సమయంలో ఏమీ నేర్చుకోలేకపోతున్నారు. పదో తరగతి విద్యార్థుల్లో కొందరు ఐదో తరగతి పాఠ్యపుస్తకాలు చదవలేకపోతున్నారని ప్రథమ్‌ వంటి స్వచ్ఛంద సంస్థ చేస్తున్న అసర్‌ సర్వేలో తేలింది. ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పగించకుండా ఉంటే ఇలాంటి పరిస్థితి రాదు. కేవలం విద్యాశాఖ విధించే లక్ష్యాలు సాధించడానికే కొంతమంది టీచర్లు మాస్‌ కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తున్నారని విశ్లేషణలో తెలుస్తోంది. వ్యవస్థాపరంగా పరీక్షల నిర్వహణలో అనేక లోపాలు ఉన్నా శిక్ష మాత్రం ఉపాధ్యాయులకే విధించడం భావ్యం కాదని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు పేర్కొంటున్నారు. 

విద్యావ్యవస్థలో తిమింగలాలు

పదో తరగతి పరీక్షల మాల్‌ప్రాక్టీస్‌ వ్యవహారంలో తిమింగలాలు తప్పించుకున్నాయని తెలుస్తోంది. సూత్రధారులను వదిలేసి పాత్రధారులను పట్టుకున్నారని పలువురు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవాప్తంగా విస్తరించిన మాల్‌ప్రాక్టీస్‌ గ్రూపు బండారం బట్టబయలు చేయాలనే డిమాండ్లు వస్తున్నాయి. వాస్తవానికి గుడివాడ పట్టణంలోని ప్రైవేట్‌ విద్యాసంస్థలకు సహకరించేలా కొంతమంది ఉపాధ్యాయులు ఏటా చీఫ్‌ సూపరింటెండెంట్లుగా అవతారమెత్తుతున్నారు. పేపర్‌ లీక్‌ తతంగాన్ని నడిపిన తిమింగలాలను వదిలేసి అమాయకులను బలి చేశారనే విమర్శలూ వ్యక్తమవుతున్నాయి. విద్యాశాఖ డైరెక్టరేట్‌లోని కీలక వ్యక్తుల కనుసన్నల్లోనే ఏడు ఉమ్మడి జిల్లాలకు చెందిన 537 మంది ఉపాధ్యాయులు మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడ్డారని పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. వైసీపీ ప్రభుత్వం తొలిసారిగా నిర్వహిస్తున్న పదో తరగతి పరీక్షలు కావడంతో రాష్ట్రవ్యాప్తంగా పలచన అవుతామని అరెస్టులను కట్టడి చేశారనే వాదనా లేకపోలేదు. అంతేకాదు.. వివిధ శాఖలకు చెందిన స్థానిక అధికారులు ఉపాధ్యాయుల వద్ద నుంచి గుట్టుగా ముడుపులు అందుకున్నారని తెలుస్తోంది. ఉపాధ్యాయులను సోమవారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకుని బుధవారం అరెస్ట్‌ చూపడంపైనా అనుమానాలు ఉన్నాయి. రెండు రోజుల్లో అధికారులే బేరాలకు అవకాశం కల్పించారనే విమర్శలు వస్తున్నాయి. 

అసలు వారిని వదిలి..

ఉమ్మడి కృష్ణాజిల్లాలో 1,133 పాఠశాలలకు చెందిన 55,357 మంది విద్యార్థులు 364 పరీక్షా కేంద్రాల్లో పదో తరగతి  పరీక్షలు రాస్తున్నారు. మాస్‌ కాపీయింగ్‌ పద్ధతులు ఇలాగే కొనసాగితే దేశ భవిత ప్రమాదంలో పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పామర్రు మండలం పసమర్రు జిల్లా పరిషత్‌ పాఠశాలకు చెందిన ఆరుగురు ఉపాధ్యాయులు, మండవల్లి మండలం కానుకొల్లు, మండవల్లి పాఠశాలలకు చెందిన పదిమంది ఉపాధ్యాయులు, సిబ్బంది మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడినట్లు పోలీసు విచారణలో తేలింది. మండవల్లి పోలీస్‌స్టేషన్‌లో వీరందరినీ అరెస్ట్‌ చేసి రెండు విడతల్లో  కైకలూరు కోర్టులో హాజరుపర్చగా, న్యాయమూర్తి వారందరికీ వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్‌ మంజూరు చేశారు. అయితే, పసమర్రుకు చెందిన ఉపాధ్యాయులు యార్లగడ్డ సురేశ్‌, పి.జ్ఞానానందం, కె.వరప్రసాద్‌, కె.తిరుమలేశ్‌, సీహెచ్‌ వెంకయ్య చౌదరి, ఎంఎల్‌ శ్రీనివాస్‌, మండవల్లి మండలం కానుకొల్లు ఉపాధ్యాయుడు బేతాళ రత్నకుమార్‌ను మాత్రమే అధికారులు సస్పెండ్‌ చేయడం విమర్శలకు తావిస్తోంది. పోలీసులు అరెస్ట్‌ చేసిన మిగతా ఉపాధ్యాయులపై సస్పెన్షన్‌ విధించకపోవడంపై విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కేసులో కీలక సూత్రధారులైన ఇద్దరిని బుధవారం మండవల్లి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి చివరి నిమిషంలో కేసు పెట్టకుండా విడిచిపెట్టారు.



Read more