గ్యాస్ సబ్సిడీ ఎత్తివేత!

ABN , First Publish Date - 2021-02-26T07:01:24+05:30 IST

కేంద్ర ప్రభుత్వ చర్యలతో గ్యాస్‌ బండ గృహ..

గ్యాస్ సబ్సిడీ ఎత్తివేత!

గుది ‘బండ’!

గ్యాస్‌ ఆల్‌టైమ్‌ గరిష్ఠ ధర రూ.816.50 

ఒక్క నెలలో మూడుసార్లు ధరల పెంపు 

జిల్లాలో గ్యాస్‌ వినియోగదారులపై రూ.646 కోట్ల భారం 

మూడు నెలలుగా పెరుగుతున్న ధరలు 

పెట్రోల్‌, డీజిల్‌తో పాటే గ్యాస్‌ ధరలు 

సబ్సిడీ ఎత్తివేసే ఆలోచనలో కేంద్రం 


ఆంధ్రజ్యోతి, విజయవాడ: కేంద్ర ప్రభుత్వ చర్యలతో గ్యాస్‌ బండ గృహ వినియోగదారుల పాలిట గుది బండగా మారుతోంది. ఎడా పెడా పెరుగుతున్న గ్యాస్‌ ధరలతో పేద, మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఒకపక్క పెట్రోల్‌, డీజిల్‌పై అర్థరూపాయి, రూపాయి, రెండు రూపాయాలు చొప్పున పెంచుతుంటే.. మరోపక్క గ్యాస్‌పై ఏకంగా రూ.25 నుంచి రూ. 50 వరకు పెంచుకుంటూ పోతుండటం సామాన్య, మధ్య తరగతి వర్గాల నడ్డి విరుస్తోంది. నూతన సంవత్సరంలో ఒక్క ఫిబ్రవరి నెలలోనే మూడుసార్లు గ్యాస్‌ ధరలను పెంచడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.


గ్యాస్‌ ధరల పెరుగుదల ఇలా..

ఈ నెలలో  మూడుసార్లు గ్యాస్‌ ధరలు పెరిగాయి. నాలుగో తేదీన రూ.25, 15వ తేదీన రూ.50 చొప్పున పెంచిన ప్రభుత్వం, మళ్లీ రూ.25 పెంచింది. ఈ నెలలో మొత్తం రూ.100 పెరిగింది. గత ఏడాది డిసెంబరు నెలలో రూ.100 పెరిగింది. డిసెంబరు రెండో తేదీన రూ.50, డిసెంబరు 15న మరో రూ.50 చొప్పున పెంచారు. మొత్తంగా ఈ మూడు నెలల వ్యవధిలో గ్యాస్‌ ధర రూ.200 పెరిగింది. తాజాగా పెరిగిన ధరలతో ఇప్పుడు సిలిండర్‌ రూ.816.50కు చేరింది. 


సబ్సిడీ ఎత్తివేతకు ఆలోచన! 

గృహ వినియోగదారులకు ఇస్తున్న గ్యాస్‌ సబ్సిడీ ధర కూడా నానాటికీ చిక్కి పోతోంది. ఒకప్పుడు రూ.150 మేర సబ్సిడీ వచ్చేది. ప్రస్తుతం వస్తున్న సబ్సిడీ రూ.15.38గా ఉంది. గత ఏడాదిగా గ్యాస్‌ ధరలు పెరుగుతున్నా సబ్సిడీ మాత్రం పెరగటం లేదు. దీని వెనుక ఓ కథ ఉంది. గ్యాస్‌ ధరలను పెంచటానికి కేంద్ర ప్రభుత్వం అంతర్జాతీయ ముడిచమురు ధరలను సాకుగా చూపిస్తోంది. వాస్తవానికి పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్‌, స్టాంప్‌ డ్యూటీలు వేయటం వల్ల ధరలు పెరుగుతున్నాయి. గ్యాస్‌ ధరలు పెరుగుతున్నా సబ్సిడీ పెరగకపోవటంలోని మర్మం ఇదే. గ్యాస్‌ సబ్సిడీని కూడా ఎత్తివేసే ఆలోచనలో కేంద్రం ఉన్నట్టుగా తెలుస్తోంది. సబ్సిడీ కూడా ఎత్తివేస్తే పేద, మధ్య తరగతి వర్గాలపై మరింత భారం పడుతుంది. 


గృహ వినియోగదారులపై ఏడాదికి రూ.646 కోట్ల భారం  

గ్యాస్‌ ధరల పెంపుతో గృహ వినియోగదారులపై ఏడాదికి రూ.646.29 కోట్ల భారం పడుతోంది. ప్రతి కుటుంబం సగటున నెలకు ఒక సిలిండర్‌ను వినియోగిస్తారు. కృష్ణాజిల్లాలో మొత్తం 26,92,878 గ్యాస్‌ కనెక్షన్లు ఉన్నాయి. ఈ లెక్కన రెండు నెలల్లో పెరిగిన భారం రూ.200 వల్ల నెలకు రూ.53.85 కోట్ల భారం జిల్లాలోని గ్యాస్‌ గృహ వినియోగదారులపై పడుతోంది. ఏడాదికి రూ. 646.29 కోట్ల భారం పడుతోంది. 

Updated Date - 2021-02-26T07:01:24+05:30 IST