బడి నిర్వహణ భారం

ABN , First Publish Date - 2022-07-07T06:45:20+05:30 IST

జిల్లాలోని పాఠశాల ఖాతాల్లో నిల్వ ఉన్న నిధులన విద్యాశాఖ వెనక్కి తీసుకోవడంతో ఇక్కట్లు ఎదురవు తున్నాయి. కొన్ని సంవత్సరాలుగా పాఠశాలల ఖాతాల్లో ఉన్న నిధులను గత విద్యా సంవత్సరం మార్చి చివరిలో విద్యాశాఖ వాపసు తీసుకుంది.

బడి నిర్వహణ భారం
జగిత్యాల జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం

- ప్రధానోపాధ్యాయుల ఇబ్బందులు

- జిల్లా నుంచి రూ. 3.71 కోట్ల పాఠశాల గ్రాంట్‌ వెనక్కి

- సకాలంలో ఖర్చు చేయకపోవడమే కారణమంటున్న అధికారులు

- నూతన విద్యా సంవత్సరానికి జమ కాని నిధులు

 జగిత్యాల, జూలై 6 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పాఠశాల ఖాతాల్లో నిల్వ ఉన్న నిధులన విద్యాశాఖ వెనక్కి తీసుకోవడంతో ఇక్కట్లు ఎదురవు తున్నాయి. కొన్ని సంవత్సరాలుగా పాఠశాలల ఖాతాల్లో ఉన్న నిధులను గత విద్యా సంవత్సరం మార్చి చివరిలో విద్యాశాఖ వాపసు తీసుకుంది. వీటిని వినియోగించుకునే అవకాశం లేకపోవడంతో వెనక్కు పంపాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో విద్యాశాఖ అధికారులు రూ. 3.71 కోట్ల నిధులు వాపసు చేశారు. మెజార్టీ ప్రభుత్వ పాఠశాలల్లో సంబందిత నిధులు నిరుపయోగంగా ఉన్నట్లు గుర్తించి ప్రభుత్వం నిర్ణయం తీసు కుంది. పాఠశాలలు ప్రారంభమై నెల రోజులు అవుతున్నా నిధుల కేటాయింపు విషయంపై స్పష్టత రాకపోవడంతో ప్రధానోపాధ్యాయులు బడి నిర్వహణపై ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

జగిత్యాల జిల్లా వ్యాప్తంగా 838 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ఇందులో 514 ప్రాథమిక పాఠశాలలు, 91 ప్రాథమికోన్నత పాఠశాలలు, 233 ఉన్నత పాఠశాలలున్నాయి. వీటిల్లో 84,515 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. బడుల నిర్వహణకు ప్రతి యేటా రెండు విడతల్లో ప్రభుత్వం గ్రాంటు మంజూరు చేస్తుంది. జిల్లాలో రెండు సంవత్సరాలకు సంబంధిం చిన నిధులు వినియోగించని పాఠశాలలకు గ్రాంటు మొత్తాలు ఖాతాలో పడి ఉండడంతో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది. బ్యాంకుల్లో నిల్వ ఉన్న నగదు మొత్తానికి వడ్డీ కూడా జమ చేస్తారు. ఈ లెక్కన జిల్లాలోని అన్ని పాఠశాలలకు కలిపి రూ.3.71 కోట్లు ఉన్నట్లు సమగ్ర శిక్ష అధికారులు గుర్తించారు. వీటిని జమ చేసి సుమారు పక్షం రోజుల క్రితం విద్యాశాఖ వెనక్కి తీసుకుంది. ఏళ్లుగా ఉన్నా విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నా అధిక పాఠశాలలో వినియోగానికి నోచుకోలేదు. కొన్ని చోట్ల ప్రధానోపాద్యాయులు, ఎస్‌ఎంసీ కమిటీ చైర్మన్లు, సభ్యుల మధ్య సఖ్యత లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయి.

గ్రాంటు కేటాయింపు ఇలా..

ప్రభుత్వం ప్రతి  సంవత్సరం విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్న పాఠశాలలకు గ్రాంటు విడుదల చేస్తుంది. ఒకటి నుంచి 30లోపు విద్యార్థులున్న పాఠశాలలకు రూ. 12,500, 31 నుంచి 250 వరకు ఉన్న ఉన్న పాఠశాలలకు రూ. 25 వేలు, 251 నుంచి 500 వరకు ఉన్న పాఠశాలలకు రూ. 50 వేలు, 501 నుంచి 750 వరకు ఉన్న పాఠశాలలకు రూ. 75 వేలు, 751కి పైబడి విద్యా ర్థులున్న పాఠశాలలకు రూ. లక్ష చొప్పున ప్రభుత్వం గ్రాంటు విడుదల చేస్తుంది. ప్రతి విద్యా సంవత్సరం నవంబరు మాసంలో మొదటి విడత, మార్చి మాసంలో రెండవ విడత గ్రాంటు మంజూరు అవుతుంది. 

గ్రాంటు వెచ్చింపు ఇలా..

ప్రభుత్వం ప్రతి యేడాది విడుదల చేసిన గ్రాంటును వినియోగించు కోవడానికి అవసరమైన మార్గదర్శకాలను సూచించింది. ప్రధానో పాధ్యాయులు పాఠశాలకు అవసరమైన చాక్‌పీసులు, డస్టర్లు, రిజిస్టర్లు, పుస్తకాలు, రిపబ్లిక్‌ డే, స్వాతంత్య్ర దినోత్సవం, ఇతర జాతీయ దినోత్సవాల సందర్భంగా ఉత్సవాలు నిర్వహణకు, పాఠశాలకు అవసరమైన సంద ర్భాల్లో సున్న వేయడం, చిన్న చిన్న మరమ్మతులకు సంబందిత గ్రాంటు నుంచి నిధులు వినియోగించుకునే అవకాశాలున్నాయి. 

కష్టతరంగా పాఠశాలల నిర్వహణ

2022-2023 విద్యా సంవత్సరానికి పాఠశాల గ్రాంటు సాధారణంగా ప్రతి ఏడాది నవంబర్‌లో మొదటి విడత, మార్చిలో రెండో విడత ఇస్తారు. విద్యా సంవత్సరం చివర్లో నిధులు విడుదల చేయడంతో కొన్ని పాఠశా లల్లో ఖర్చు చేయలేకపోతున్నారు. నిధులు వచ్చిన తర్వాత తీసుకోవచ్చులే అని ముందుగా ప్రధానోపాద్యాయులు సొంత డబ్బులు వెచ్చిస్తున్నారు. నిధులు వచ్చిన తర్వాత వాటిని తీసుకోవాలని అనుకుంటే కొందరు ఎస్‌ఎంసీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాఠశాల నిర్వహణకు అవసరమైన నిధుల వ్యయం ప్రధానోపాధ్యాయులకు కష్టతరంగా మారుతోంది. దీనికి తోడు ప్రభుత్వ ఆదేశాల మేరకు గతంలో గల పాఠశాల గ్రాంటు నిర్వహణ బ్యాంకు ఖాతాలను ప్రధానోపాధ్యా యులు, ఎస్‌ఎంసీ చైర్మన్లు రద్దు చేసుకున్నారు. కొత్త ఖాతాలను తెరవడానికి ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎటువంటి ఆదేశాలు రాలేదు. దీంతో కొత్త ఖాతాలు సైతం తెరుచుకోవడం లేదు. ప్రభుత్వం ఖాతాల తెరవడానికి ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుంది. పాఠశాల నిర్వహణ గ్రాంటు ఎప్పుడు విడుదల అవుతుందోనని ప్రధానోపాధ్యాయులు ఎదురు చూస్తున్నారు. 

సమస్యను ప్రభుత్వం పరిష్కరించాలి

- తిరుక్కోవెల శ్యాంసుందర్‌, టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు, 

ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు అవసరమైన గ్రాంటు సమస్యను  ప్రభుత్వం పరిష్కరించాలి. గ్రాంటు లేకపోవడం వల్ల ప్రధానోపాధ్యా యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాల నిర్వహణ కష్టతరంగా మారుతోంది. చిన్న చిన్న సమస్యలకు నిధుల వ్యయం తలనొప్పిగా తయారయింది.

ప్రభుత్వ ఆదేశాల మేరకే

- జగన్మోహన్‌ రెడ్డి, జిల్లా విద్యాధికారి

జిల్లాలో ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాలల గ్రాంట్లను సర్కారు ఖాతాకు జమ చేశాము. ప్రస్తుత విద్యా సంవత్సరానికి విద్యార్థుల సంఖ్య ఆధారంగా ప్రభుత్వం గ్రాంటు మంజూరు చేస్తుంది. ఇందుకు అవసర మైన వివరాలను ప్రభుత్వానికి అందించాం. 

Updated Date - 2022-07-07T06:45:20+05:30 IST