బండి సంజయ్‌ ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదు

ABN , First Publish Date - 2020-12-03T05:35:42+05:30 IST

రెండేళ్లుగా కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ ఒక్క రూపాయి నిధులు కూడా నియోజకవర్గానికి తీసుకురాలేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు.

బండి సంజయ్‌ ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదు
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కవిత

ప్రజలు ప్రశ్నించే సమయం ఆసన్నమైంది

ఎమ్మెల్సీ కవిత

కరీంనగర్‌, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రెండేళ్లుగా కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ ఒక్క రూపాయి నిధులు కూడా నియోజకవర్గానికి తీసుకురాలేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత తొలిసారిగా  కరీంనగర్‌కు వచ్చిన ఆమెకు రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్‌ ఘనస్వాగతం పలికారు. బుధవారం జాగృతి నాయకుడు పసుల చరణ్‌ వివాహానికి హాజరయ్యేందుకు వచ్చిన ఆమె నగరంలోని పాతబజార్‌ శివాలయం, కరీముల్లాషా దర్గాను దర్శించారు. తొలుత పాతబజార్‌లోరి గౌరీశంకరాలయంలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజ లు చేశారు. ఆలయం వద్ద ఎమ్మెల్సీ కవితకు రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్‌ పూల మొక్కతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, మంత్రి గంగుల కమలాకర్‌ ఆమెను సత్కరించి జ్ఞాపిక అందించారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ చాలా రోజుల తర్వాత కరీంనగర్‌కు రావడం సంతోషంగా ఉందన్నారు. అతి పురాతనమైన గౌరీశంకరాలయంలో పూజలు చేయడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. కరీంనగర్‌ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి గ్రేటర్‌ ఎన్నికల్లో ప్రచారం చేశారని అన్నారు. టీఆర్‌ఎస్‌ కార్యకర్తల కష్టం వృథా కాదని, భారీ మెజార్టీతో గ్రేటర్‌ పీఠం గెలుస్తామని చెప్పారు. గ్రేటర్‌ ఎన్నికల్లో బీజేపీ నాయకులు అబద్ధపు ప్రచారాలకు తెగపడ్డారని, కరీంనగర్‌ ప్రజలు బండి సంజయ్‌ను ప్రశ్నించే సమయం ఆసన్నమవుతుందని చెప్పారు. ట్రిపుల్‌ ఐటీ తీసుకురావడంలో బండి సంజయ్‌ విఫలమయ్యారని అన్నారు. కేబుల్‌ బ్రిడ్జి, ఐటీ హబ్‌తో కరీంనగర్‌ మరింత అభివృద్ధి చెందనుందని చెప్పారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ కనమల్ల విజయ, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, మేయర్‌ సునీల్‌రావు, డిప్యూటీ మేయర్‌ చల్లా స్వరూపారాణి హరిశంకర్‌, కార్పొరేటర్‌ గుగ్గిళ్లపు మంజులా రమేశ్‌, జాగృతి మహిళా అధ్యక్షురాలు గందె కల్పన, మన్సూర్‌ తవక్కల్‌, టీఆర్‌ఎస్‌, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

శివయ్య సేవలో..

కరీంనగర్‌ కల్చరల్‌: పాతబజార్‌లోని ప్రాచీన శివాలయమైన గౌరీశంకర ఆలయంలో బుధవారం నిజామాబాద్‌ ఎమ్మెల్సీ కల్వకుంట కవిత, బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖా మంత్రి గంగుల కమలాకర్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, మేయర్‌ సునీల్‌రావు, డిప్యూటీ మేయర్‌ చల్ల స్వరూపారాణి హరి

శంకర్‌ కార్తీక మాసం సందర్భంగా అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉమ్మడి జిల్లా దేవాదాయశాఖా సహాయ కమీషనర్‌ చంద్రశేఖర్‌, ఆలయ చైర్మన్‌ ప్రొద్దుటూరి శ్రీనివాస్‌, ఈవో పీచర కిషన్‌రావు పూర్ణకుంభ స్వాగతం పలికారు. పూజల అనంతరం అమ్మవారి సన్నిధిలో శేషవస్త్రాలు, ప్రసాదం అందజేశారు. స్థానికుల విజ్ఙప్తి మేరకు అక్కడే ఉన్న పురాతన కరీముల్లా షా దర్గాలోనూ ప్రార్థనలు చేసి చాదర్‌ సమర్పించారు. ఈ సందర్భంగా దర్గా ముతవల్లీ సయ్యద్‌ సులేమాన్‌ తవక్కలి షాహ్‌ ఖాద్రి ఎమ్మెల్సీ  కవితకు వినతిపత్రం సమర్పించారు. 2006 ఉప ఎన్నికల సమయంలో  కేసీఆర్‌ దర్గాకు రాగా దర్గా గుంబత్‌ శిఽథిలమైందని బాగుచేయించేందుకు నిధులు మంజూరు చేయాలని కోరామని, ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ విషయంలో సహకరించాలని కోరారు. సహకరిస్తానని ఆమె హామీ ఇచ్చారు.


Updated Date - 2020-12-03T05:35:42+05:30 IST