దమ్ముంటే అరెస్టు చేయండి

ABN , First Publish Date - 2020-11-22T08:49:43+05:30 IST

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి దమ్ముంటే తనను అరెస్టు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సవాల్‌ విసిరారు.

దమ్ముంటే   అరెస్టు చేయండి

మేం వాస్తవాలు చెబుతున్నా.. 

టీఆర్‌ఎస్‌ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు

భాగ్యలక్ష్మి ఆలయానికి ఎందుకె ళ్లొద్దు?

మజ్లిస్‌కు అధికారమిస్తే వెళ్లనివ్వరు

వరద సాయం ఆపాల్సిందిగా ఏ పార్టీ లేఖ రాయలేదని ఎస్‌ఈసీ చెప్పింది దీనిపై కేసీఆర్‌ సమాధానం చెప్పాలి

10 వేలు అందినవారికి అదనంగా సాయం చేస్తాం

కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌లకు ఓటేస్తే మజ్లిస్‌కు వేసినట్లే: బండి సంజయ్‌

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై నేడు చార్జిషీట్‌ 

మండలి మాజీ చైర్మన్‌ స్వామిగౌడ్‌తో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి భేటీ!


హైదరాబాద్‌, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి దమ్ముంటే తనను అరెస్టు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ సవాల్‌ విసిరారు. వరద సాయం నిలిపి వేతపై తాము వాస్తవాలు చెబుతున్నా గ్రహించకుండా.. టీఆర్‌ఎస్‌ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘30 కోట్ల మంది ముస్లింలను దేశం నుంచి తరిమికొడతారా? అని సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి అంటే తప్పు లేనప్పుడు.. హైదరాబాద్‌ నుంచి హిందువులను పంపించేస్తారా అని నేనంటే తప్పా?’’ అని సంజయ్‌ ప్రశ్నించారు. తాము చెప్పే వాస్తవాలనే రెచ్చగొట్టినట్లుగా టీఆర్‌ఎస్‌ భావిస్తే తమకేమీ అభ్యంతరం లేదన్నారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. భాగ్యలక్ష్మి అమ్మవారంటే సీఎం కేసీఆర్‌కు భయమన్నారు. ఓ వర్గం ఓట్ల కోసం దారుసలాంకు, మక్కా మసీదుకు వెళ్లిన సీఎం.. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి ఎందుకు రాలేదని ప్రశ్నించారు.


‘‘నన్ను అరెస్టు చేయాలని ఒకాయన, భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్దకే ఎందుకు వెళ్లారని ఇంకొకాయన అంటున్నారు. భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు ఎందుకు వెళ్లొద్దో చెప్పాలి’’ అని సంజయ్‌ అన్నారు. ఎంఐఎంకు మేయర్‌ పదవి ఇస్తే భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి వెళ్లనివ్వరని సంజయ్‌ హెచ్చరించారు. రాష్ట్ర ప్రజలు చైతన్యవంతులయ్యారని, టీఆర్‌ఎ్‌సకు ఏం చేయాలో అది చేస్తారని వ్యాఖ్యానించారు. తమకు 25 సీట్లు వచ్చినా మేయర్‌ పీఠం తీసుకుంటామని టీఆర్‌ఎస్‌ నేతలు అంటున్నారని, దీంతోనే ఆ పార్టీ 25 స్థానాలకు పరిమితం కాబోతున్నట్లు అంగీకరించారని అన్నారు. పాతబస్తీ నుంచి బకాయిలు వసూలు చేసిన తర్వాతే టీఆర్‌ఎస్‌ ఓట్లు అడగాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ వాళ్లు తమ ఇంట్లోని వాళ్లను కూడా కాపాడుకోలేకపోతున్నారని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. వరద సాయం నిలిపి వేయాల్సిందిగా ఏ పార్టీ కూడా తమకు లేఖ రాయలేదని రాష్ట్ర ఎన్నికల సంఘం చేసిన ప్రకటనపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని సంజయ్‌ డిమాండ్‌ చేశారు.


విద్యాసంస్థను నిర్వహిస్తున్న ఓ టీఆర్‌ఎస్‌ నేత.. వందల ఎకరాలకు రైతుబంధు సాయం పొందుతూ తమకు నీతులు చెబుతున్నారని విమర్శించారు. ఆయన అక్రమాలను బయట పెడతామని హెచ్చరించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే.. వరదలతో నష్టపోయి రూ.10 వేలు అందుకున్నవారికి అదనంగా సాయం చేస్తామని ప్రకటించారు. కాంగెరస్‌కు ఓటేస్తే టీఆర్‌ఎ్‌సకు వేసినట్లేనని, టీఆర్‌ఎ్‌సకు వేస్తే అవన్నీ ఎంఐఎంకు పోయినట్లేనని అన్నారు. అందుకే ఎంఐఎం ఎలా చెబితే కేసీఆర్‌ అలా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. సీఏఏను, ఎన్‌ఆర్‌సీని కేసీఆర్‌ వ్యతిరేకించింది అందుకేనన్నారు. భాగ్యనగరంలో ఉన్న 40 వేల మంది రోహింగ్యాలను పంపించివేయడంపై టీఆర్‌ఎస్‌ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ల నుంచి అక్రమంగా వచ్చిన వారిని ఎందుకు పంపించడంలేదని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ఆదివారం చార్జిషీట్‌ విడుదల చేయనున్నట్లు తెలిపారు. కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ చార్జిషీట్‌ను విడుదల చేస్తారని చెప్పారు.


స్వామిగౌడ్‌తో కిషన్‌రెడ్డి భేటీ!

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి శనివారం టీఆర్‌ఎస్‌ నేత స్వామిగౌడ్‌తో భేటీ అయ్యారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ సమావేశం జరిగినట్లు సమాచారం. టీఆర్‌ఎస్‌ నాయకత్వంపై స్వామిగౌడ్‌ అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరిగిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. 

Updated Date - 2020-11-22T08:49:43+05:30 IST