Abn logo
Sep 28 2021 @ 15:10PM

రైతులకు భరోసా కల్పించని సీఎం కేసీఆర్ వరి వేస్తే ఉరే అంటున్నారు: బండి సంజయ్

సిద్దిపేట: తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మంగళవారం సిద్దిపేటలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే సంగ్రామ యాత్ర చేస్తున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్ రైతుబంధు మాత్రమే ఇచ్చి మిగతా అన్ని పథకాలను వదిలేశారని తీవ్రస్థాయిలో విమర్శించారు. రైతులను పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. రైతులకు భరోసా కల్పించని కేసీఆర్.. వరి వేస్తే ఉరే అంటున్నారని మండిపడ్డారు.

 

కేంద్రంతో సంబంధం లేకుండా ప్రతి గింజ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని చెప్పి సీఎం కేసీఆర్.. ఇప్పుడేమో వరి వేస్తే ఉరి అంటూ కేంద్రం మీద నెపం నెట్టేస్తున్నారని బండి సంజయ్ విమర్శించారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయదని ఎవరు చెప్పారో సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి ఢిల్లీకి టైం పాస్ కోసం వెళుతున్నారని ఎద్దేవా చేశారు. తాను చేస్తున్న సంగ్రామ యాత్ర విజయవంతం అవుతున్నదని, ఈసారి టీఆర్ఎస్ గల్లంతు ఖాయమన్నారు. టీఆర్ఎస్‌లో సగం మంది మంత్రులు నక్సలైట్లని, వారు నక్సలైట్ల  సానుభూతి పరులని అన్నారు. హుజురాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ డిపాజిట్ కోసం ప్రయత్నం చేస్తుందన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీపై ఆయన విమర్శలు గుప్పించారు. అభ్యర్థి లేని పార్టీ కాంగ్రెస్ అని, ఆ పార్టీ ఢిల్లీలో.. గల్లీలో కూడా లేదన్నారు. ఇతర పార్టీలు ఎన్నికల్లో అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నాయని, బీజేపీ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకోలేదని బండి సంజయ్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండిImage Caption