ఉక్కు కోసం 5న బంద్‌

ABN , First Publish Date - 2021-03-02T07:03:19+05:30 IST

విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం కొనసాగుతున్న ఉద్యమంలో భాగంగా ఈనెల 5న రాష్ట్రవ్యాప్త బంద్‌కు ఉక్కు పరిరక్షణ సమితి పిలుపునిచ్చింది.

ఉక్కు కోసం 5న బంద్‌
మీడియా సమావేశంలో మాట్లాడుతున్న వామపక్షాల నాయకులు

సన్నాహాల్లో వామపక్షాలు

ఒంగోలు, మార్చి 1 (ఆంధజ్ర్యోతి) : విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం కొనసాగుతున్న ఉద్యమంలో భాగంగా ఈనెల 5న రాష్ట్రవ్యాప్త బంద్‌కు ఉక్కు పరిరక్షణ సమితి పిలుపునిచ్చింది. కార్మిక, ప్రజాసంఘాలతో కూడిన పరిరక్షణ వేదిక ఇచ్చిన బంద్‌ పిలుపునకు వామపక్షాలు సంపూర్ణ మద్దతు ఇచ్చాయి. జిల్లాలో బంద్‌ విజయవంతంపై దృష్టిసారించాయి. అందుకు అవసరమైన సన్నాహాలను ఆ పార్టీల జిల్లా నేతలు చేస్తున్నారు. స్థానిక సీపీఎం కార్యాలయంలో సోమవారం వారు సమావేశమై బంద్‌ నిర్వహణపై చర్చించారు. సీపీఎం నాయకులు పూనాటి ఆంజనేయులు, జాలా అంజయ్య, కొండారెడ్డి, సీపీఐ నాయకులు ఎంఎల్‌ నారాయణ, ఎస్‌డీ సర్దార్‌, న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు చిట్టిపాటి వెంకటేశ్వర్లు, సీపీఐ(ఎంఎల్‌) నాయకుడు ఎంఎస్‌ సాయి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. దేశంలోని 100 ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేస్తామని స్వయంగా ప్రధాని మోదీ ప్రకటించడం దుర్మార్గమని మండిపడ్డారు. నాడు 32మంది బలిదానం చేసి విశాఖ ఉక్కును సాధించారని, నాటి ఉద్యమంలో ప్రస్తుత ప్రకాశం జిల్లా ప్రాంతం కీలకంగా పనిచేసిందన్నారు. ఆ స్ఫూర్తితో నేడు ఉద్యమించాలన్నారు. ఈనెల 5న తలపెట్టిన బంద్‌ను జిల్లాలోని అన్నివర్గాల ప్రజలు సంపూర్ణ మద్దతును ప్రకటించి జయప్రదం చేయాలని కోరారు. 


Updated Date - 2021-03-02T07:03:19+05:30 IST