బుమ్రా..వండర్‌ షో!

ABN , First Publish Date - 2022-07-03T09:34:18+05:30 IST

ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా (194 బంతుల్లో 13 ఫోర్లతో 104) కీలక శతకంతోపాటు కెప్టెన్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా (16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 31 నాటౌట్‌, 3/35) ఆల్‌రౌండ్‌ షోతో..

బుమ్రా..వండర్‌ షో!

షమిని అవుట్‌ చేసిన బ్రాడ్‌..

టెస్టుల్లో 550వ వికెట్‌ దక్కించుకున్నాడు

బుమ్రా (16 బంతుల్లో 31 నాటౌట్‌; 3/35) 

పట్టుబిగించిన టీమిండియా 

కష్టాల్లో ఇంగ్లండ్‌

ఐదో టెస్ట్‌

 బుమ్రా జోరు.. ఇంగ్లండ్‌ బేజారు! ఇదీ..వర్ష ప్రభావిత ఐదో టెస్టు రెండో రోజు ఆట తీరు. బ్యాట్‌తో వరల్డ్‌ రికార్డు బాదేసిన స్పీడ్‌ గన్‌.. బంతితోనూ చెలరేగి పోయాడు. చకచకా మూడు ఇంగ్లండ్‌ టాపార్డర్‌ వికెట్లు పడగొట్టి.. ఆతిథ్య జట్టును పీకల్లోతు కష్టాల్లోకి నెట్టాడు. దీంతో తొలి రోజు తడబడిన టీమిండియా.. బుమ్రా ఆల్‌రౌండ్‌ షోతో రెండో రోజు ఆధిపత్యం ప్రదర్శించింది. 


బర్మింగ్‌హామ్‌: ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా (194 బంతుల్లో 13 ఫోర్లతో 104) కీలక శతకంతోపాటు కెప్టెన్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా (16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 31 నాటౌట్‌, 3/35) ఆల్‌రౌండ్‌ షోతో.. ఇంగ్లండ్‌తో 5వ టెస్ట్‌లో టీమిండియా పైచేయి సాధించింది. బ్యాట్‌తో వరల్డ్‌ రికార్డు నమోదు చేసిన బుమ్రా.. బంతితో ఇంగ్లండ్‌ టాపార్డర్‌ వెన్ను విరిచాడు. ఓవర్‌నైట్‌ స్కోరు 338/7తో ఆటకు రెండో రోజైన శనివారం తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్‌ 416 పరుగులకు ఆలౌటైంది. నిన్నటి స్కోరుకు 78 పరుగులు జోడించిన టీమిండియా షమి (16), జడేజా, సిరాజ్‌ (2) వికెట్లను చేజార్చుకుంది. అనంతరం మొదటి ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ 84/5తో తీవ్ర ఇక్కట్లలో పడింది. ఆట ముగిసే సమయానికి బెయిర్‌స్టో (12), బెన్‌ స్టోక్స్‌ (0) క్రీజులో ఉన్నారు. భారత మొదటి ఇన్నింగ్స్‌ స్కోరుకు ఇంగ్లండ్‌ ఇంకా 332 పరుగులు వెనుకబడింది. మొత్తం రెండో రోజు 38.5 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. 


టెయిలెండర్ల అండగా..:

తొలి సెషన్‌ ఆరంభంలో ఆచితూచి ఆడిన ఓవర్‌నైట్‌ బ్యాటర్‌ జడేజా కవర్‌-పాయింట్‌ దిశగా బౌండ్రీ బాది టెస్ట్‌ కెరీర్‌లో మూడు, విదేశాల్లో తొలి సెంచరీ నమోదు చేశాడు. పిచ్‌పై బ్యాట్‌ సాము చేస్తూ సంబరాలు చేసుకున్నాడు. మరో ఓవర్‌నైట్‌ బ్యాటర్‌ షమిని బ్రాడ్‌ క్యాచవుట్‌ చేయడంతో 8వ వికెట్‌కు 48 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. మరో నాలుగు పరుగుల తేడాతో జడ్డూను ఆండర్సన్‌ బౌల్డ్‌ చేయడంతో టీమిండియా 375/9తో నిలిచింది. దీంతో భారత ఇన్నింగ్స్‌ ఇక ఎంతో సాగదనిపించింది. కానీ, బుమ్రా సంచలన బ్యాటింగ్‌తో ఒకే ఓవర్‌లో (4, 5వైడ్లు, 6 (నోబ్‌), 4, 4, 4, 6, 1) 35 పరుగులు రావడంతో.. భారత స్కోరు అనూహ్యంగా 400 పరుగుల మార్క్‌ దాటింది. సిరాజ్‌ను అవుట్‌ చేసిన ఆండర్సన్‌ ఇన్నింగ్స్‌ను ముగించాడు. అయితే, 9, 10, 11 నెంబర్ల బ్యాటర్ల సహకారంతో భారత స్కోరుకు 93 పరుగులు సమకూరడం విశేషం. 


టాప్‌ ఢమాల్‌..:

లంచ్‌కు ముందు బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌.. బుమ్రా దెబ్బకు టాపార్డర్‌ను కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. కాగా, వరుణుడు మూడుసార్లు ఆటంకం కలిగించడంతో రెండో సెషన్‌ ఆట సజావుగా సాగలేదు. తొలి ఓవర్‌ను నుంచి బుమ్రా పదునైన బంతులతో ఇంగ్లండ్‌కు శుభారంభం దక్కకుండా చేశాడు. మూడో ఓవర్‌ చివరి బంతికి ఓపెనర్‌ అలెక్స్‌ లీస్‌ (6)ని బౌల్డ్‌ చేశాడు. ఈ సమయంలో వర్షం కురవడంతో ఇంగ్లండ్‌ 16/1తో లంచ్‌కు వెళ్లింది. ఇక, రెండో సెషన్‌ మొదలైన వెంటనే మరో ఓపెనర్‌ క్రాలే (9)ను బుమ్రా వెనక్కిపంపాడు. డ్రైవ్‌ ఆడే క్రమంలో స్లిప్స్‌లో ఉన్న గిల్‌కు క్రాలే క్యాచిచ్చాడు. పోప్‌ (10) కూడా జస్‌ప్రీత్‌ జోరుకు పెవిలియన్‌ చేరాడు. ఈ దశలో ఫామ్‌లో ఉన్న రూట్‌, బెయిర్‌స్టో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడారు. వరుణుడు మళ్లీ రావడంతో.. ముందుగానే టీబ్రేక్‌కు వెళ్లాల్సి వచ్చింది. దీంతో రెండో సెషన్‌ ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ 60/3తో నిలిచింది. 


దెబ్బకొట్టిన సిరాజ్‌..:

రూట్‌ను అవుట్‌ చేసిన సిరాజ్‌ ఇంగ్లండ్‌ను కోలుకోలేనిదెబ్బ కొట్టాడు. షమి ఓవర్‌లో రూట్‌ రెండు ఫోర్లు బాదిన రూట్‌.. దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు. మరోవైపు బెయిర్‌స్టో మాత్రం క్రీజులో నిలిచేందుకు ఇబ్బందులు పడ్డాడు. ఈ దశలో బుమ్రా, షమి పరుగులను కట్టడి చేస్తూ ఒత్తిడి పెంచారు. అయితే, మరోసారి బంతిని అందుకున్న సిరాజ్‌.. రూట్‌ను క్యాచవుట్‌ చేశాడు. దీంతో నాలుగో వికెట్‌కు 34 పరుగుల భాగసామ్యం ముగిసింది. నైట్‌ వాచ్‌మన్‌గా వచ్చిన లీచ్‌ (0)ను షమి వెనక్కిపంపాడు. 


స్కోరు బోర్డు

 భారత్‌ తొలి ఇన్నింగ్స్‌:

గిల్‌ (సి) క్రాలే (బి) అండర్సన్‌ 17, పుజార (సి) క్రాలే (బి) అండర్సన్‌ 13, విహారి (ఎల్బీ) పాట్స్‌ 20, కోహ్లీ (బి) పాట్స్‌ 11, పంత్‌ (సి) క్రాలే (బి) రూట్‌ 146, అయ్యర్‌ (సి) బిల్లింగ్స్‌ (బి) అండర్సన్‌ 15, జడేజా (బి) అండర్సన్‌ 104, శార్దూల్‌ (సి) బిల్లింగ్స్‌ (బి) స్టోక్స్‌ 1, షమి (సి) లీచ్‌ (బి) బ్రాడ్‌ 16, బుమ్రా (నాటౌట్‌) 31, సిరాజ్‌ (సి) బ్రాడ్‌ (బి) అండర్సన్‌ 2; ఎక్స్‌ట్రాలు 40; మొత్తం: 84.5 ఓవర్లలో 416 ఆలౌట్‌; వికెట్లపతనం: 1/27, 2/46, 3/64, 4/71, 5/98, 6/320, 7/323, 8/371, 9/375;  బౌలింగ్‌: ఆండర్సన్‌ 21.5-4-60-5, బ్రాడ్‌ 18-3-89-1, పాట్స్‌ 20-1-105-2, లీచ్‌ 9-0-71-0, స్టోక్స్‌ 13-0-47-1, రూట్‌ 3-0-23-1.


ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌:

లీస్‌ (బి) బుమ్రా 6, క్రాలే (సి) గిల్‌ (బి) బుమ్రా 9, పోప్‌ (సి) శ్రేయాస్‌ (బి) బుమ్రా 10, రూట్‌ (సి) పంత్‌ (బి) సిరాజ్‌ 31, బెయిర్‌స్టో (12 బ్యాటింగ్‌),  లీచ్‌ (సి) పంత్‌ (బి) షమి 0, బెన్‌ స్టోక్స్‌ (0 బ్యాటింగ్‌); ఎక్స్‌ట్రాలు: 16; మొత్తం: 27 ఓవర్లలో 84/5; వికెట్ల పతనం: 1/16, 2/27, 3/44, 4/78, 5/83; బౌలింగ్‌: బుమ్రా  11-1-35-3, షమి 13-3-33-1, సిరాజ్‌ 3-2-5-1. 

Updated Date - 2022-07-03T09:34:18+05:30 IST