బుమ్రా..ఎందుకిలా?

ABN , First Publish Date - 2020-02-14T10:00:40+05:30 IST

ప్రపంచ బ్యాటింగ్‌ దిగ్గజాలలో ఒకడైన వివియన్‌ రిచర్డ్స్‌ అభిప్రాయమిది. ఎలాంటి వేదికపై అయినా అద్భుత పేస్‌తో పాటు తన ట్రేడ్‌మార్క్‌ యార్కర్లతో...

బుమ్రా..ఎందుకిలా?

‘జస్‌ప్రీత్‌ బుమ్రా కన్నా 

నేను డెన్నిస్‌ లిల్లీ బౌలింగ్‌ను 

ఎదుర్కొనేందుకే ఇష్టపడతా..’-

 ప్రపంచ బ్యాటింగ్‌ దిగ్గజాలలో ఒకడైన వివియన్‌ రిచర్డ్స్‌ అభిప్రాయమిది. ఎలాంటి వేదికపై అయినా అద్భుత పేస్‌తో పాటు తన ట్రేడ్‌మార్క్‌ యార్కర్లతో బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బందిపెట్టే భారత స్పీడ్‌స్టర్‌ బుమ్రాకు ఏమైంది? ఇప్పుడందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఇదే. జట్టు విజయాలకు కీలకంగా నిలిచే ఈ స్టార్‌ పేసర్‌ను తాజా వన్డే సిరీ్‌సలో కివీస్‌ బ్యాట్స్‌మెన్‌ అలవోకగా బాదేశారు.. ఈ ఏడాది ఆరు వన్డేలు ఆడితే తను తీసింది కేవలం ఒక్క వికెట్టే. బుమ్రా తన మ్యాజిక్‌ను కోల్పోయాడా? లేక ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ అతడిని ఎలా ఆడాలో తెలుసుకున్నారా? 


నిజంగా ఇలాంటి పరిస్థితి బుమ్రాకు కూడా కొత్తగానే అనిపిస్తున్నదేమో..ఎందుకంటే  గతంలో ఎవరూ అతడి బౌలింగ్‌లో కివీస్‌ బ్యాట్స్‌మెన్‌లాగా ఎదురుదాడికి దిగలేదు. ఇటీవల ముగిసిన మూడు వన్డేల సిరీస్‌లో జరిగిన అన్ని మ్యాచ్‌ల్లోనూ బుమ్రా తన పది ఓవర్ల కోటాను పూర్తి చేశాడు. 5.57 ఎకానమీ రేట్‌తో 167 పరుగులిచ్చి కనీసం ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోవడం ఆశ్చర్చపరిచింది. ఓ వన్డే సిరీస్‌లో ఇలా జరగడం అతడి కెరీర్‌లో ఇదేమొదటిసారి. ఈ దెబ్బతో తన నెంబర్‌వన్‌ ర్యాంకును కూడా కోల్పోవాల్సి వచ్చింది. టీ20 సిరీ్‌సలో ఆరు వికెట్లతో ఫర్వాలేదనిపించినా వన్డేల్లో మాత్రం కివీస్‌ ఆటగాళ్లు బాదేశారు.


పేలవ ప్రదర్శన

గత ఏడాది స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీ్‌సకు ముందు బుమ్రా గాయపడి కొంతకాలం క్రికెట్‌కు దూరమయ్యాడు. ఆ తర్వాత శ్రీలంకతో జరిగిన టీ20 సిరీ్‌సలో ఆడి రెండు వికెట్లు తీయగా, ఆసీ్‌సతో జరిగిన మూడు వన్డేల్లో బుమ్రా తీసింది ఒక్క వికెట్‌ మాత్రమే. తాజాగా కివీ్‌సతో వన్డే సిరీస్‌ అతడికి పీడకలనే మిగిల్చింది. ఓపెనర్లు గప్టిల్‌, నికోల్స్‌, టేలర్‌...బుమ్రా బౌలింగ్‌లో ఏ మాత్రం ఇబ్బంది పడకపోవడమే కాకుండా  భారీగా పరుగులు రాబట్టారు. దీంతో వరుసగా 0/53, 0/64, 0/50 గణాంకాలను నమోదు చేయాల్సి వచ్చింది. ముఖ్యంగా బుమ్రాను డెత్‌ ఓవర్ల స్పెషలి్‌స్టగా పేర్కొంటుంటారు. కానీ అతడి లైన్‌ అండ్‌ లెంగ్త్‌ను సంపూర్ణంగా అర్థం చేసుకుంటూ లెగ్‌ సైడ్‌లో అలవోకగా ఆడేశారు. అందుకే ఎంత భారీ స్కోరునైనా కివీస్‌ ఒత్తిడి లేకుండా ఛేదించి సిరీ్‌సను క్లీన్‌స్వీ్‌ప చేసేసింది. 


ఒత్తిడే కారణమా?

బుమ్రా ఫెయిల్యూర్‌పై అటు మాజీ ఆటగాళ్లు కూడా ఆందోళన వెలిబుచ్చుతున్నారు. బుమ్రా ఫామ్‌లో లేకపోతే జట్టు విజయాలపై ప్రభావం పడుతుందని మాజీ బ్యాట్స్‌మన్‌ లక్ష్మణ్‌ గుర్తుచేశాడు. అయితే విపరీత ఒత్తిడి కారణంగానే అంచనాలకు తగ్గట్టు బౌలింగ్‌ వేయలేకపోతున్నాడని  జహీర్‌, నెహ్రాలాంటి మాజీ పేసర్లు అభిప్రాయపడుతున్నారు. ప్రతీ సిరీ్‌సలో అతడి నుంచి వికెట్లను ఆశించడం తప్పని సూచిస్తున్నారు. అతను గాయం నుంచి ఇటీవలే కోలుకుని ఆడుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలని, అలాంటి సమయంలో అత్యున్నత ఫామ్‌ను ఎలా ఆశిస్తారని ప్రశ్నించారు. మరోవైపు తుది జట్టును ఎంపిక చేసేటప్పుడు సెలెక్టర్లు మరింత మెరుగ్గా ఆలోచించాలని నెహ్రా అన్నాడు. రెండేళ్లుగా బుమ్రా, షమిపైనే బౌలింగ్‌ విభాగం ఎక్కువగా ఆధారపడుతోందని, జట్టులోని ఇతర బౌలర్లు కూడా తమ ప్రాముఖ్యతను తెలుసుకోవాలని అంటున్నాడు.


పుంజుకోవాల్సిందే..

ఈనెల 21 నుంచి కివీ్‌సతో భారత జట్టు రెండు టెస్టుల సిరీస్‌ ఆడబోతోంది. గతేడాది ఆగస్టు-సెప్టెంబర్‌లో విండీస్‌ టూర్‌ తర్వాత బుమ్రా మరోసారి ఈ ఫార్మాట్‌లో బరిలోకి దిగబోతున్నాడు. ఆ టూర్‌లో తను విండీ్‌సను వణికించాడు. ఓ హ్యాట్రిక్‌ సహా 13 వికెట్లు నేలకూల్చాడు. ఏదేమైనా వీలైనంత త్వరగా బుమ్రా తన లయను అందుకుని మునుపటి ప్రదర్శననే కివీస్‌ పిచ్‌లపై చూపాలని జట్టుతో పాటు అభిమానులు కూడా కోరుకుంటున్నారు. 

(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం)

Updated Date - 2020-02-14T10:00:40+05:30 IST